టీం ఇండియాకు ఎన్నో మరుపులేని విజయాలు అందించిన కెప్టెన్లలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒకడు. ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించాలనే తపన విరాట్‌లో ఉంటుంది. అందుకోసం మ్యాచ్ చివరివరకూ పోరాటం చేస్తాడు. తన కెప్టెన్సీలో ఐసిసి ట్రోఫీలు జట్టుకు అందించకపోయినా.. భారత జట్టును సమర్థవంతంగా నడిపించిన కెప్టెన్ల లిస్టులో మాత్రం విరాట్‌కు చోటు ఉంటుంది. ముఖ్యంగా 2019 ప్రపంచకప్‌లో విరాట్.. భారత్‌ను సెమీఫైనల్స్ వరకూ తీసుకెళ్లాడు. కానీ, సెమీస్‌లో మాత్రం టీం ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ విషయం యావత్ భారత ప్రజల మనస్సును కలచివేసింది. అయితే ఆ సమయంలో విరాట్ కోహ్లీ బాత్రూం కన్నీళ్లు పెట్టుకున్నాడని.. స్టార్ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ వెల్లడించాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఐపిఎల్‌లో ఆర్‌సిబి గెలిచినప్పుడు విరాట్ (Virat Kohli) కన్నీరు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. ‘‘2019 వరల్డ్ కప్ సమయంలో కోహ్లీ ఏడవడం చూశాను.. అతడు మాత్రమే కాదు.. జట్టులో అందరి పరిస్థితి అదే. చివరిగా క్రీజ్‌లోకి వెళ్లింది నేనే. కోహ్లీని దాటి ముందుకు వస్తుంటే.. అప్పటికే అతని కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. ధోనీకదే చివరి మ్యాచ్. మరో 15 పరుగులు తక్కువ ఇవ్వాల్సింది. నేను ఇంకొంచెం మంచిగా బౌలింగ్ చేస్తే బాగుండేది’’ అని చాహల్ పేర్కొన్నాడు.