Saturday, September 6, 2025

నాకు అవకాశం వచ్చినా.. నన్ను నేను సెలెక్ట్ చేసుకోను: సందీప్

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా ఆడే అవకాశం రావాలని ప్రతీ ఒక్క క్రికెటర్ ఆశపడుతుంటారు. అందుకే మన క్రికెటర్లు ఐపిఎల్ వంటి టోర్నమెంట్‌లలో తమ సత్తా ఏంటో చాటి చెబుతారు. తద్వారా జాతీయ జట్టులో ఛాన్స్ కొట్టేస్తారు. అయితే కొన్నిసార్లు మంచి ప్రదర్శన చేసినా జట్టులో చోటు దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితితే బౌలర్ సందీప్ శర్మకు (Sandeep Sharma) ఎదురైంది. ఐపిఎల్‌లో 137 మ్యాచులు ఆడి 146 వికెట్లు తీశాడు సందీప్. ముఖ్యంగా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీని 18 ఇన్నింగ్స్‌లో ఏడుసార్లు ఔట్ చేశాడు. తన ఐపిఎల్ కెరీర్‌లో 20.83 యావరేజ్‌తో బౌలింగ్ చేశాడు. అయినప్పటికీ.. 32 ఏళ్ల సందీప్ భారత్ తరఫున కేవలం రెండు టి-20లు మాత్రమే ఆడాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు మరోసారి భారత టి-20 టీంలోకి వచ్చే అవకాశం ఉందా అని సందీప్‌ను (Sandeep Sharma) ప్రశ్నించారు. ‘భారత జట్టులో తిరిగి స్థానం పొందుతాననే నమ్మకం నాకు ఉంది. కానీ, నాదొక వ్యక్తిగత అభిప్రాయం. 32, 33 ఏళ్ల క్రికెటర్ ఎవరైనా ఉంటే ఆటతీరు బాగున్నా.. సెలక్టర్లు అతడిపై ఆసక్తి చూపించరు. యువ క్రికెటర్లకే ప్రాధాన్యత ఇస్తారు’ అని సందీప్ సమాధానం ఇచ్చాడు.

ఒకవేళ తానే సెలక్టర్‌ అయినా.. తనను తాను సెలక్ట్ చేసుకోనని అన్నాడు. ‘‘నేను సెలక్టర్ అయితే.. హర్షిత్ రాణా, సందీప్ శర్మలు ఇద్దరి ప్రదర్శన సమానంగా ఉన్నా.. హర్షిత్‌నే సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే జట్టుకు యువ ఆటగాళ్లు అవసరం. 33 సంవత్సరాల ఆటగాడిని ఎంపిక చేస్తే.. అతను మరో రెండు, మూడేళ్లు మాత్రమే ఆడగలడు. అయితే యువ క్రికెటర్ అయితే.. దాదాపు 7 నుంచి 8 సంవత్సరాల వరకూ చక్కగా ఆడుతాడు’’ అని సందీప్ వివరించాడు.

Also Read : ఆసియాకప్‌కు మొండిచెయ్యి.. కానీ, ఆ సిరీస్‌లో కెప్టెన్సీ.?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News