న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూరులో IC-814 ఎయిర్ ఇండియా విమాన హైజాక్‌కు ప్రధాన సూత్రధారి అయిన అబ్దుల్ రవూఫ్ అజార్ ను మట్టుబెట్టినట్లు భారత అధికార వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు.. ఆపరేషన్ సిందూర్ పేరుతో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు సంబంధించిన ఉగ్రస్థావరాలపై విరుచుకపడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
భారత ఆర్మీ జరిపిన దాడుల్లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది మృతి చెందారు. ఇందులో అతని తమ్ముడు, జైషే ముఖ్య కమాండర్ అయిన అబ్దుల్ రవూఫ్ అజార్ ఉన్నాడు. భారత్ దాడుల్లో మొదట తీవ్రంగా గాయపడిన రవూఫ్.. తర్వాత మరణించినట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలలో కీలక పాత్రధారిగా ఉన్న రవూఫ్.. భారతదేశం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడు. అబ్దుల్ రవూఫ్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి, అమెరికా ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి.
కాగా, 24 ఏళ్ల వయసులోనే రవూఫ్ అజార్.. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC-814 హైజాక్‌కు కీలక పాత్ర పోషించాడు. తన సోదరుడు, మసూద్ అజార్ ను భారత్ జైలు నుంచి విడుదల చేసేందుకు.. రవూఫ్, ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేశాడు. అప్పటి నుండి, భారతదేశంలో జైషే ఉగ్రవాద గ్రూప్ నిర్వహించిన ప్రతి పెద్ద దాడి వెనుక అతను ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్ శాసనసభ, భారత పార్లమెంటుపై 2001 ఫిదాయీన్ దాడులు, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, అలాగే నగ్రోటా, కథువాలో సైనిక శిబిరాలపై దాడులు వెనుక కూడా అతని హస్తం ఉంది. అలాగే, 40 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని బలిగొన్న 2019 పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడితో కూడా అతనికి సంబంధం ఉంది.