లండన్: భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఐసిసి జరిమానా విధించింది. ఐసిసి ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినట్లు తేలడంతో అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించినట్లు పేర్కొంది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టు 4వ రోజు ఓపెనర్ బెన్ డకెట్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. సిరాజ్ బౌలింగ్ భారీ షాట్ కు యత్నించి డకెట్.. బుమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ వెళ్తుండగా.. సిరాజ్ అతనిని చూస్తూ.. నోరు పెద్దగా చేసి సంబరాలు జరుపుకున్నాడు. దీంతో సిరాజ్ ప్రవర్తన.. బ్యాట్స్‌మన్‌ను అవమానించేలా ఉందని, ఇది ఐసిసి ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ని ఉల్లంఘించినట్లు తేలడంతో జరిమానా విధించారు. అంతేకాదు.. క్రమశిక్షణ నియమావళిని తప్పినందుకు సిరాజ్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా వేశారు. గత 24 నెలల్లో ఇది సిరాజ్ కు రెండవ డీమెరిట్ పాయింట్. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో సిరాజ్ ఖాతాలో డీమెరిట్ పాయింట్ జత చేశారు.
కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్- ఇంగ్లాండ్ జట్లకు ఐదో రోజు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే భారత్ కు ఇంకో 135 పరుగులు చేయాలి. ఇక, ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించాలంటే 6 వికెట్లు పడగొట్టాలి. దీంతో ఐదో రోజు ఆటపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.