Sunday, June 1, 2025

ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇగా, సబలెంక

- Advertisement -
- Advertisement -

జెంగ్, సంసొనొవా ముందంజ
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అరినా సబలెంక (బెలారస్), ఐదో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. 8వ సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), 19వ సీడ్ సంసొనొవా (రష్యా), 17వ సీడ్ డారియా కసట్కినా (ఆస్ట్రేలియా) తదితరులు నాలుగో రౌండ్‌లో ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ పదో సీడ్ హోల్గర్ రూనే (డెన్మార్క్), 8వ సీడ్ లొరెంజొ ముసెట్టి (ఇటలీ) మూడో రౌండ్‌లో విజయం సాధించి ముందంజ వేశారు. మరియానొ నవొన్ (అర్జెంటీనా)తో జరిగిన పోరులో ముసెట్టి 46, 64, 63, 62తో జయకేతనం ఎగుర వేశాడు. తొలి సెట్‌లో ఓడిన ముసెట్టి తర్వాత చెలరేగి ఆడాడు. వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. రూనే మూడో రౌండ్‌లో చెమటోడ్చి విజయం సాధించాడు. ఫ్రాన్స్‌కు చెందిన క్వెన్‌టిన్‌తో జరిగిన ఐదు సెట్ల సమరంలో రూనే 46, 62, 57, 75, 62తో జయభేరి మోగించాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో పోరు ఐదు సెట్ల వరకు వెళ్లింది. అయితే ఆఖరు వరకు నిలకడగా ఆడడంలో సఫలమైన రూనే మ్యాచ్‌ను గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
అరినా అలవోకగా..
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అరినా సబలెంక అలవోక విజయంతో నాలుగో రౌండ్‌లో ప్రవేశించింది. సెర్బియా క్రీడాకారిణి ఒల్గా డనిలొవిక్‌తో జరిగిన మూడో రౌండ్‌లో సబలెంక 62, 63తో విజయం సాధించింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన సబలెంక ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేసింది. మరో పోటీలో స్వియాటెక్ 62, 75తో క్రిస్టియన్ (రుమేనియా)ను ఓడించింది. తొలి సెట్‌లో సునాయాసంగా గెలిచిన స్వియాటెక్‌కు రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే టైబ్రేకర్‌లో సెట్‌ను గెలిచిన స్వియాటెక్ నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇతర పోటీల్లో జెంగ్ 63, 64తో విక్టోరియా మొబొకొ (కెనడా)పై, సంసొనొవా 62, 63తో డయానా(ఉక్రెయిన్)పై విజయం సాధించి ముందంజ వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News