నాడు గాదరి కిషోర్ కుమార్ గర్విష్టి అన్నారు
నేడు కిషోర్ కుమారే బెస్ట్ అంటున్నారు
10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కుట్రలు చేయలే
అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టాం
6 గ్యారంటీల పేరుతో 13 పథకాలు, 420 హామీలు, 5 డిక్లరేషన్ లు ఇచ్చి ప్రజలను మోసం చేసింన్రు
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
మన తెలంగాణ/మోత్కూర్: నియోజకవర్గాల పునర్విభజన (డి లిమిటేషన్) జరుగకుంటే తుంగతుర్తి నియోజకవర్గం నుండి మళ్లీ పోటీ చేసి గెలుస్తానని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం మోత్కూరు మండలం పాటిమట్ల ఎక్స్ రోడ్ లోని శ్రీ లక్ష్మీ నర్శింహా ఫంక్షన్ హాల్ లో జరిగిన బీఆర్ఎస్ మోత్కూరు, అడ్డగూడూరు మండలాల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కుట్రలు, కుతంత్రాలు చేయలేదని అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టామని అన్నారు. నాడు తనను గాదరి కిషోర్ కుమార్ గర్విష్టి అన్నవారే నేడు గాదరి కిషోర్ కుమారే బెస్ట్ అంటున్నారన్నారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పాలన చూసే ప్రజలు ఇటువంటి కితాబులు తనకు ఇస్తున్నారని చెప్పారు. పవర్ అనేది గులాబీ జెండాలో ఉంటదని, మనిషిలో కాదని అన్నారు. కనీస అవగాహన లేని వారు గాదరి కిషోర్ కుమార్ స్థానికుడు కాదని అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు.
ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ ప్రాంతం వారు… వారు ఎక్కడి నుండి పోటీ చేసి గెలిచారు..అని తనపై ఆరోపణలు చేసేవారు తెలుసుకోవాలని హితవు పలికారు. భారత రాజ్యాంగంలో ఎవరు ఎక్కడి నుండి అయినా పోటీ చేయవచ్చనే హక్కు కలిగి ఉంటారు అన్న విషయం తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలనలో విచ్చలవిడితనం పెరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, కెసిఆర్ ను తిడితేనే లీడర్ అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి నిత్యం కొనసాగుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని అన్నారు. కెసిఆర్ ను పదేపదే తిడితే తనకు బాధ కలుగుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులందరికీ రుణమాఫీ చేయలేదని తెలిపారు. అందుకు తాను మూడు ఊర్లు సూచిస్తానని… ధర్మారం, శాలిగౌరారం, తాటిపాముల గ్రామాలలో ఉన్న రైతులకు పూర్తిగా రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలనుండి తప్పుకుంటానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లకు సవాల్ విసిరారు.
ఆరు గ్యారెంటీ ల పేరుతో 13 పథకాలు, 420 హామీలు, 5 డిక్లరేషన్ లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. పార్టీలో ఉన్న తాలంతా పోయిందని, ఇప్పుడు ఉన్న వారందరూ ని కార్స్ అయిన కార్యకర్తలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలోగులాబీ జెండా ఎగుర వేయాలని గాదరి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, హుజూర్నగర్ ఇన్చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు బడుగుల లింగయ్య యాదవ్, నేవూరి ధర్మేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మోత్కూరు, అడ్డగూడూరు మండలాల అధ్యక్షులు పొన్నబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మోత్కూరు పట్టణ అధ్యక్షులు జంగ శ్రీను, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేశం, మాజీ మార్కెట్ చైర్మన్ లు కొనతం యాకూబ్ రెడ్డి, చిప్పలపల్లి మహేంద్ర నాథ్, నాయకులు రాంపాక నాగయ్య, డాక్టర్ కోక బిక్షం, కడమంచి వస్తాధ్, సిహెచ్ సత్యం గౌడ్, అడ్డగూడూరు మాజీ జెడ్పిటిసి శ్రీరాముల అయోధ్య జ్యోతి, మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య, మర్రి అనిల్ కుమార్, దబ్బేటి శైలజ, కొండ సోoమల్లు తదితరులు పాల్గొన్నారు.