లేని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల పేర్లతో
అందినకాడికి దోచుకుంటున్న కొన్ని
శాఖల అధికారులు మరి కొన్ని శాఖల్లో
అర్హత లేని వారికి పోస్టింగ్‌లు విచారణ
జరపాలని సిఎస్‌కు ఫిర్యాదు చేసిన
సచివాలయ ఉద్యోగులు
మన తెలంగాణ/హైదరాబాద్ : సచివాలయంలో అక్రమ పో స్టింగ్‌లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కు ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా చూపించడంతో పాటు పేపర్‌పై సచివాలయంలో పనిచేయని ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని పేర్లను చూపించి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కొన్ని శాఖ ల అధికారులు దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై కొందరు సిఎస్‌కు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఇది హాట్‌టాఫిక్‌గా మారింది. సచివాలయంలో పనిచేసే కొన్ని శాఖల ఉన్నతాధికారులే ఈ దోపిడీ కారణమని ఉద్యోగులు ఆరోపిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉ ద్యోగులు ఎంతమంది, వారికి ఎంత జీతాలు చెల్లిస్తున్నారు, ఎవరు ఏయే సెక్షన్‌లో పనిచేస్తున్నారన్న వివరాలపై ప్రభు త్వం దృష్టి సారించినట్టుగా తెలిసింది. దీంతోపాటు కొన్ని శా ఖల్లో ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులపై పలు ఆ రోపణలు వస్తుండడంపై కూడా ప్రభుత్వం నివేదిక ఇవ్వాల ని ఆదేశించినట్టుగా సమాచారం.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కొంతమంది ఎపికి కేటాయించడంతో పాటు కొన్ని పోస్టులు ఎపికి తరలిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప లు శాఖల్లో సెక్రటరీలు కొన్ని అక్రమ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు శాఖకు సంబంధం లేని బయటి వ్యక్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించడంతో పాటు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సచివాలయంలో పనిచేయకున్నా గడిచిన కొన్నేళ్లుగా ఆర్థికశాఖను తప్పుదోవ పట్టిస్తూ కొందరు అధికారులు అందినకాడికి దోచుకుంటున్నట్టుగా తెలిసింది. అయితే ఆర్థికశాఖలోని పనిచేసే కొందరు అధికారులు కూడా ఈ కుంభకోణంలో పాలుపంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సచివాలయంలో సుమారు 60 శాఖలు ఉండగా అందులోని కొన్ని శాఖల్లో అవినీతి అధికమయ్యిందన్నవిమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కొన్ని శాఖల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని పేపర్‌లపై చూపిస్తారని, ఫీల్డ్‌లో వారు లేకున్నా, అక్కడ పనిచేయకున్నా వారికి జీతాలు చెల్లిస్తున్నారని వెంటనే వాటిపై విచారణ జరపాలని పలు శాఖల ఉద్యోగులు డిమాండ్ చేస్తుండడం విశేషం.
ఆర్థికశాఖలోని (ఐటీ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో) కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన డైరెక్టర్ ఐటి, పివి రమణారావు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్. కృష్ణారావులను 2023, డిసెంబర్ 18వ తేదీన ఈ శాఖలో నియమిస్తున్నట్టు అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అంతర్గత ఉత్తర్వులు ఓఓఆర్టి1467ను జారీ చేశారు. ఆ ఉత్తర్వుల్లో పివి రమణారావుకు 2024 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు (రెండేళ్ల కాలానికి) ముందుగానే అడ్వాన్సు కింద నెలకు రూ.2,50,000ల చొప్పున రూ.60 లక్షలను, ఎన్. కృష్ణారావుకు అదే రెండేళ్ల కాలానికి నెలకు రూ.1,20,000ల చొప్పున మొత్తం రూ.28,80,000 చెల్లించడానికి అనుమతి ఇచ్చారు. దీంతో పాటు ఇద్దరికీ కలిపి 20 శాతం సిజీజీ అడ్మినిస్ట్రేటివ్ చార్జీల కింద రూ.17,78,000లు, 18 శాతం జీఎస్టీ కింద రూ.19,18,008లను కూడా చెల్లించాలని కూడా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. దీంతోపాటు మరో మూడేళ్ల పాటు ఈ పదవిలో వారిద్దరూ కొనసాగేలా ఆర్థికశాఖ అనుమతులు ఇవ్వడంపై ఆ శాఖ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతోపాటు అసలు ఆర్థిక శాఖలో లేని పోస్టులను సృష్టించి వారికి జీతాలు, అలవెన్సులు ఎందుకు ఇస్తున్నారన్న దానిపై ఆ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆర్థికశాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
షెడ్యూల్ కులాల సంక్షేమం శాఖలో
ఇక, షెడ్యూల్ కులాల సంక్షేమం శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఇరవై ఏళ్ల క్రితం ఓ ఉద్యోగి చేరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఆయన షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సెక్రటరీ పిఏగా, పిఎస్ గా వ్యవహారిస్తున్నారు. ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రభుత్వానికి సంబంధించిన ఫైల్స్‌ను తన దగ్గర పెట్టుకోవడం, ఆ ఫైల్స్ కు సంబంధించి తానే బాధ్యుడిగా ఉండటంపై సచివాలయంలో పనిచేసే అధికారులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సెక్రటరీగా బాధ్యతలు ఎలా నిర్వహిస్తారని సచివాలయం ఉద్యోగులు, ఆ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ శాఖలో ఏ సెక్రటరీ వచ్చినా ఆయనపై ఆధారపడాల్సిందేనని, ఆయన మిగతా అధికారులను బెదిరిస్తూ తమ దారికి తీసుకొచ్చుకుంటారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపించడం విశేషం. షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖలో డిప్యూటీ సెక్రటరీకి దక్కని గౌరవం కూడా ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఇవ్వాల్సి వస్తుందని,
ప్రస్తుత ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఆయన పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటుండడం విశేషం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖల్లో సైతం ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గెజిటెడ్ అధికారిలా ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేస్తున్నారని బయటకు చూపించే ప్రయత్నాలు చేయడం ఎందుకోసమని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ శాఖల్లో గడిచిన పదేళ్లుగా జరిగిన ఫైల్ మూవ్‌మెంట్‌పై సమగ్ర విచారణ జరిపించాలని ఆ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా సెక్రటేరియట్ లోని పలు శాఖల్లో అక్రమ పోస్టింగ్‌లు, లేని ఔట్‌సోర్సింగ్ పేరుతో జీతాలు తీసుకోవడం పరిపాటిగా మారిందని సచివాలయ ఉద్యోగులు బాహాటంగా పేర్కొంటుండడం విశేషం.