హైదరాబాద్: శనివారం ఉదయం 6.30కి గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైందని సిపి ఆనంద్ తెలిపారు. ఇంకా 900 విగ్రహాల నిమజ్జనం అవ్వాల్సి ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..చిన్న విగ్రహాలు కలుపుకొని 25 వేల విగ్రహాలు నిమజ్జనం అవ్వాలని, 40 గంటల పాటు నిమజ్జన శోభాయాత్ర జరిగిందని తెలియజేశారు. 12,034 విగ్రహాలు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నారని, 6,300 విగ్రహాలు నిన్నటి వరకు నిమజ్జనం అయ్యాయని సిపి ఆనంద్ పేర్కొన్నారు. ఇవి కాకుండా 1.20 లక్షల విగ్రహాలు బేబీ పాండ్స్, ఇతర ఇతర చెరువుల్లోనూ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 1.40 లక్షల విగ్రహాలు నిమజ్జనం చేశారన్నారు. సున్నిత ప్రాంతమైన సౌత్ జోన్ విగ్రహాలను ముందు తీయించామని, 40 అడుగుల కన్నా ఎత్తు ఉన్న విగ్రహాలు ఈ సారి పెరిగాయని చెప్పారు.
విగ్రహాల ఎత్తు పెరగడంతో శోభాయాత్ర ఆలస్యమైందని, శనివారం రాత్రి శోభాయాత్రలో జరిగిన గొడవల్లో 5 కేసులు నమోదు చేశామని అన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీసులకు అభినందనలు సిపి ఆనంద్ తెలియజేశారు. సిఎం రేవంత్ రెడ్డి సర్ ప్రైజ్ విజిట్ చేయడం మంచిదేనని ఎలాంటి సమస్య రాలేదని, అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమం విజయవంతమైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన 1,070 మందిని పట్టుకున్నామని, పిక్ పాకెటింగ్ కేసులు కూడా నమోదు చేశామని అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి క్రైమ్ రేట్ తగ్గిందని, ఈ సారి నిమజ్జనంలో సాంకేతికతను వాడామని.. 9 డ్రోన్లు ఉపయోగించామని చెప్పారు. 35 హై రైజ్ బిల్డింగ్స్ పైన కెమెరాలు పెట్టి మానిటరింగ్ చేశామని సిపి ఆనంద్ స్పష్టం చేశారు.
Also Read : ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం దృశ్యాలు