Sunday, August 10, 2025

బిసి రిజర్వేషన్లపై ఎందుకీ గలభా?

- Advertisement -
- Advertisement -

ఆగస్టు 7 భారత సమాజంలో తరతరాలుగా విద్యకు, భూమికి దూరంచేసి వెనుకవేయబడ్డ వర్గానికి స్వతంత్ర భారతదేశంలో సుమారు 50 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు కల్పించబడ్డ రోజు. సామాజిక న్యాయం కోసం 40 సంవత్సరాలు వెనకబడ్డ వర్గాల పోరాటానికి గుర్తింపు లభించిన రోజు. లోక్‌సభలో మాజీ ప్రధాని విపి సింగ్ ఇతర వెనకబడ్డవర్గాల కోసం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ప్రకటన జారీ చేసిన రోజు. నేడు దేశవ్యాప్త బిసి రిజర్వేషన్ల ఉద్యమానికి నాంది పలికిన రోజు. బిసిల 42 శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం హైదరాబాద్ ఇంద్రపార్క్ నుంచి ఢిల్లీలో జంతర్‌మంతర్‌కు చేరింది. తెలంగాణనే కాదు యావత్ భారతదేశం బిసిల 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయా, కావా? అనే ప్రశ్నతో వెయ్యి కండ్లతో ఎదురుచూస్తుంది.

ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు లేని పరిమితి బిసి రిజర్వేషన్లకు ఎందుకు? 2019 జనవరి నెలలో ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం, రెండు సభలలో ఆమోదించడం, (Passage both houses) రాష్ట్రపతి సంతకం చేయడం, గజిట్‌లో ప్రచురించడం, అమలు కావడం చకచకా జరిగిపోయాయి. కానీ బిసిలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రం రెండు బిల్లులు పంపి ఆరు నెలలు గడుస్తున్నా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఎందుకు? స్థానిక సంస్థలలో బిసిల 42% రిజర్వేషన్లు అమలు చేయాలని 2018 చట్టంలో సెక్షన్ 285ఎ కి సవరణ చేసి గవర్నర్‌కు ఆర్డినెన్స్ పంపిస్తే మళ్లీ ఆర్డినెన్స్ ఢిల్లీకి (రాష్ట్రపతి సలహా కోసం) చేరింది. ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు లేని అగ్నిపరీక్ష బిసిల 42% రిజర్వేషన్లకు ఎందుకు? అసలు ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు లేని 50% పరిమితి నిబంధన బిసి రిజర్వేషన్లు ఎందుకు? ఇడబ్యుఎస్ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్ధించింది, బిసి 42 శాతం రిజర్వేషన్లను సమర్థించదా? ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు.

జనహిత్ అభియాన్ వర్సెస్ ఇండియా కేసులో 2022 నవంబర్ 7న ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు 3:2 మెజార్టీ ద్వారా సమర్థించింది. ముఖ్యంగా ఈ కేసులో సుప్రీం కోర్టు స్పష్టపరిచిన అంశాల్లో ఆర్టికల్ 15(4), 16(4) కింద రిజర్వేషన్లు అసాధారణ పరిస్థితులలో తప్ప 50% మించకూడదు అనే తీర్పు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు (ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలు వంటివి) వర్తిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కాదు. ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌ను విడిగా పరిగణిస్తారు. ఇడబ్ల్యుఎస్ కోటా (10%) ఇప్పటికే ఎస్‌సి, ఎస్‌టి లేదా ఒబిసి రిజర్వేషన్ల పరిధిలోకి రాని వారికి, ఎందుకంటే ఇది అదనంగా కనిపిస్తున్న రిజర్వేషన్లు. 103వ రాజ్యాంగ సవరణ ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ కోసం ఆర్టికల్స్ 15(6), 16(6)లను రాజ్యాంగానికి చేర్చింది కాబట్టి ఆమోదిస్తున్నాం. ఇది రాజ్యాంగంలో భాగం కాబట్టి, సుప్రీంకోర్టు గతంలో న్యాయపరంగా రూపొందించిన 50% నియమాన్ని అధిగమిస్తుందని తీర్పు ఇచ్చింది.

తమిళనాడు వెనుకబడిన తరగతులు, ఎస్‌సి, ఎస్‌టిల చట్టం, 1993ను ఆమోదించింది. ఇది 69% రిజర్వేషన్లను కల్పిస్తుంది. న్యాయ సమీక్షనుండి రక్షించడానికి రాజ్యాంగంలోని 9షెడ్యూల్‌లో ఈ చట్టం చేర్చబడింది. 2018లో మహారాష్ట్ర ఎస్‌ఇబిసి (సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు) వర్గం కింద మరాఠాలకు 16% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఇది మొత్తం రిజర్వేషన్లను 70%కి పెంచింది. మే 2021లో సుప్రీంకోర్టు 50% పరిమితిని ఉల్లంఘించడానికి ఎటువంటి అసాధారణ పరిస్థితులు లేవని దానిని కొట్టివేసింది. రాజస్థాన్ గుజ్జర్లకు 5% రిజర్వేషన్లు, ఇతర ఒబిసిలకు 21% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నించింది, దీనితో మొత్తం రిజర్వేషన్లు 70% కంటే ఎక్కువయ్యాయి. రాజస్థాన్ హైకోరు, సుప్రీం కోర్టు 50% పరిమితిని ఉల్లంఘించాయి.

అసాధారణ పరిస్థితులను సమర్థించడానికి తగినంత డేటా లేదు అని ఈ చట్టాన్ని కొట్టివేసాయి. బీహార్ ప్రభుత్వం నవంబర్ 2023 లో బీహార్ కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లను 75%కి పెంచుతూ చట్టాన్ని ఆమోదించింది. పాట్నా హైకోర్టు అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప రిజర్వేషన్ 50% మించకూడదనీ, కుల సర్వే డేటాలో అసాధారణ పరిస్థితులు నిరూపించబడలేవనీ, అదనపు రిజర్వేషన్లను సమర్థించడానికి తగినంత బలమైన సామాజిక, -ఆర్థిక సూచికలు దీనికి లేవు అని కొట్టివేసింది. ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, కృష్ణమూర్తి కేసులులో ఇచ్చిన త్రిబుల్ టెస్ట్ తీర్పును, వివిధ రాష్ట్రాల్లో బిసి రిజర్వేషన్లపై హైకోర్టులు, సుప్రీం కోర్టు తీర్పులను ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు (బిసిలు) 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి నవంబర్-, డిసెంబర్ 2024లో తెలంగాణ సామాజిక,- ఆర్థిక, కుల సర్వే (ఎస్‌ఇఇఇపిసి)ని నిర్వహించింది, ఇది 96.9% గృహాలను కవర్ చేసింది. జనాభాలో బిసిలు 56.33% ఉన్నారని తేల్చింది.

సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా డేటాను విశ్లేషించడానికి, రిజర్వేషన్ సంస్కరణలను సిఫార్సు చేయడానికి బిసి కమిషన్ ఏర్పరచింది. మార్చి 2025లో, తెలంగాణ శాసనసభ విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో బిసి రిజర్వేషన్లను 42%కి పెంచడం (29% నుండి), పంచాయతీలు, మునిసిపాలిటీలు వంటి స్థానిక సంస్థలకు 42% కోటాను పెంచడం కోసం (18% ఎస్‌సి, 10% ఎస్‌టి కోటాలతోపాటు మొత్తం 70%కి తీసుకురావడం) రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్లమెంట్ అనుమతి కోసం ఢిల్లీకి పంపింది. జులై 2025లో తెలంగాణ మంత్రివర్గం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285ఎని సవరించడానికి ఆర్డినెన్స్ జారీ చేయడానికి ఆమోదం తెలిపింది.గవర్నర్ ఈ ఆర్డినెన్స్‌ను 1 ఆగస్టు 2025న రాష్ట్రపతికి పంపారు. ప్రస్తుతం ఏం చేయాలి.

బిసిల 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ అవసరం. 50% పరిమితిని అధిగమించాలంటే అసాధారణ పరిస్థితుల్లో అధిగమించవచ్చు. 50 శాతం పరిమితి అనేది న్యాయపరమైన మినహాయింపే కాని రాజ్యాంగపరమైన మినహాయింపు కాదు. కాబట్టి 56.36% ఉన్న బిసిలకు తగినంత ప్రాతిధ్యం లేదని డెడికేట్ కమిషన్ ద్వారా రిపోర్టును సమర్పిస్తూ సమగ్ర సర్వే, శాస్త్రీయ డేటాను ముందు ఉంచే ప్రయత్నం చేయాలి. తమిళనాడు మాదిరిగా 42% బిసి రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి కోర్టుల నుంచి మినహాయింపు పొందవచ్చు (తొమ్మిదవ షెడ్యూల్లోని చట్టాలను న్యాయ సమీక్ష చేయవచ్చు). రాజ్యాంగ సవరణ కోసమే తెలంగాణ సమాజం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంది. ఇంత జరుగుతున్నా బిసి రిజర్వేషన్లకు మోక్షం లభించడం లేదంటే యావత్ భారతదేశం, తెలంగాణ సమాజం దానికి కారకులు ఎవరో నిర్ణయించుకోవాలి.

  • జుర్రు నారాయణ యాదవ్, 94940 19270
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News