గట్లు తెంచుకుని ప్రవహించాలని ఎవరికి ఉండదు
ఆకాశపు నీలాల్లో బుడుంగున మునిగి
నీళ్ళు కారుతున్న జుట్టును
అరచేతులతో ఒత్తుకుంటూ
విప్పారిన కళ్ళతో ప్రపంచానికి కన్నుగీటాలనీ
గాయపరిచే దిగంతాలకు దూరంగా
అలా అలా ఒక నిశ్శబ్దంలోకి
ఇంటి నుండి తెచ్చుకున్న ఒకే జత బట్టలతో
కాళ్ళ వెంట నువ్వో నీ వెంట కాళ్ళో
అర్థంకాని నడకలోకి జారిపోవాలని
ఎవరికి అనిపించదు
సిలికాన్ పెదవుల మీద కృత్రిమ పలకరింపుల్ని
వినీ వినీ మొహమెత్తి ఎప్పుడోసారికి
మొత్తానికి మొత్తంగా అన్నింటినీ
విరగ్గొట్టాలని ఉండదూ
ముందు నుండి చూస్తే
సీతాకోకచిలుకల్లా కనబడే దృశ్యాల్ని
చూసీ చూసీ విసుగుపుట్టి ఏదోసారికి
కుప్పలుగా పోసి తగలబెట్టేయాలనీ
ఇన్నాళ్ళూ, మూడో కంటికి
తెలీకుండా దాచుకున్న
ప్రేమలన్నింటినీ పడవల్లోకి ఎక్కించేక
తీరపు చీకట్లలో జ్ఞాపకాల్ని
కడుక్కుని పునీతమవ్వాలని
లోలోపల నువ్వు మాత్రం అనుకోవూ
జేబులో ఎంతో ఇష్టంగా
భద్రపరుచుకున్న మనసు
కన్నీళ్ళలో నానీ నానీ ముక్కివాసన వేస్తుంటే
ఎప్పుడో ఒకప్పుడు
గుండెనలా ముళ్ళకంపలమీదకు విసిరేసి
గాయాల నొప్పిగా నిన్ను నువ్వు
వ్యక్తీకరించుకోవాలని కోరుకోవూ
– సాంబమూర్తి లండ