హైదరబాద్: ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. పాలనలో పారదర్శకత ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. హైటెక్స్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను సిఎం ప్రారంభించారు. ప్రాపర్టీ షోలో స్టాళ్లు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..శతాబ్దాలుగా సాగిన హైదరాబాద్ అభివృద్ధి లో ఎంతోమంది పాత్ర ఉందని, పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకపోవడంతో అభివృద్ధి కొనసాగిందని తెలియజేశారు. రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టే ఎలాంటి నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకోదని చెప్పారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదని, లాభాలు వచ్చేలా పోత్సహించే బాధ్యత తనదని అన్నారు. దేశవిదేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామని, స్వదేశీ పెట్టుబడుల విషయంలో కొందరు అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
విదేశీ సంస్థలను ప్రోత్సహించిన తాము.. ఈ దేశ వాసులను ఎందుకు ప్రోత్సహించమో ఆలోచించాలని ప్రశ్నించారు. తాను మధ్యతరగతి మనస్తత్వం (Middle class mentality) ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తానని, ప్రజల సంపద కొల్లగొట్టి విదేశాలకు తరలించి దాచుకునే ఆలోచన తనకు లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు భారీగా రుణాలు తెచ్చిందని, తాము పాత రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు రీషెడ్యూల్ చేయించామని అన్నారు. మెట్రో రైలు విస్తరణ కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నామని, తెలంగాణలో ఇప్పటి వరకు ఒకే ఒక్క విమానాశ్రయం ఉందని ఆవేదనను వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో 40 విమానాశ్రయాలుంటే.. మనకు ఒక్కటే ఉందని, గత ప్రభుత్వం కొత్త విమానాశ్రయాల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. తాము కేంద్రాన్ని ఎన్నోసార్లు సంప్రదించి రెండు విమానాశ్రయాలు సాధించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.