న్యూఢిల్లీ: అక్రమపద్ధతుల్లో పన్ను మినహాయింపులు పొందేందుకు పన్ను చెల్లింపుదారులకు సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఆదాయం పన్ను విభాగం కొరడా ఝళిపించింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సోమవారం దాడులు నిర్వహించిం ది. పన్ను మినహాయింపులు పొందేందుకు అవసరమైన పత్రాలను సమకూర్చడంలో పన్ను చెల్లింపుదారులకు కొంత మంది వ్యక్తులు, సంస్థలు సహాయపడుతున్నారన్న సమాచారం ఆధారంగా ఐటి విభాగం ఈ దాడులు చేపట్టింది. రాజకీయ పార్టీలకు విరాళాలు,పిల్లల ట్యూషన్ ఫీజులు, వైద్య ఖర్చులు లాం టి వాటి పేరిట నకిలీ బిల్లులను వారు టాక్స్‌పేయర్లకు సమకూరుస్తున్నట్లు ఈ విభాగం గుర్తించింది. పాత పన్ను విధానం లో సెక్షన్ 80జిజిసి కింద వ్యక్తులు ఏదయినా రాజకీయ పా ర్టీకి విరాళం ఇస్తే ఆ మొత్తాన్ని ఆదాయంపన్నునుంచి మినహాయింపు కింద చూపించుకోవచ్చు.
దీన్ని అదునుగా చేసుకుని కొందరు మధ్యవర్తులు బోగస్ డొనేషన్ల ను పన్ను చెల్లింపుదారులకు సమకూరుస్తున్నట్లు ఆదాయం పన్ను విభాగం గుర్తించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, మ ధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇటీవల జరిపిన దాడులు, స్వా ధీనం చేసుకున్న పత్రాల్లో సైతం దీనికి సంబంధించి మరిన్ని సాక్షాధారాలు లభించాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు( సిబిడిటి) ఒక ప్రకటనలో తెలియజేసింది. అక్రమ డిడక్షన్లు, మినహాయింపులు చూపిస్తూ రిటర్న్‌లు దాఖలు చేస్తున్న ఐటిఆర్‌లను తయారు చేసే వారు, మధ్యవర్తులు కొన్ని ముఠాలుగా ఏర్పడి ఈ రాకెట్‌లను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడయినట్లు ప్రకటన తెలిపింది.
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా ఐటి విభాగం పన్ను సలహాదారులు, అకౌంటెంట్ల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. తమ శాఖ ముందుగా పన్ను చెల్లింపుదారును విశ్వసించడమనే సూత్రాన్ని నమ్ముతుందని సిబిడిటి పేర్కొంది. అందుకనే స్వచ్ఛందంగా సరయిన రిటర్న్‌లను దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులకు ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ అడ్వైజరీలు పంపించడం ద్వారా వారికి చేరువ అయ్యే ప్రయత్నాలను పెద్ద ఎత్తున చేపట్టిందని, ఫలితంగా దాదాపు 40 వేల మంది పన్ను చెల్లింపుదారులు గత నాలుగు నెలల కాలంలో రూ. 1,045 కోట మేర తప్పుడు రిటర్న్‌ల ఉపసంహరించుకొంటూ స్వచ్ఛందంగా తమ రిటర్న్‌లను సవరించుకున్నారని తెలిపింది. అయినప్పటికీ ఇంకా చాలా మంది సహకరించడం లేదని, బహుశా పన్ను ఎగవేత రాకెట్ల వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ల ప్రభావం కారణంగా వారు అలా చేస్తుండవచ్చని సిబిడిటి తెలిపింది. ఇక ఇప్పుడు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పన్ను విభాగం సిద్ధమవుతోందని కూడా సిబిడిటి స్పష్టం చేసింది.