Friday, August 29, 2025

ట్రంప్ వినాయక చవితి కానుక

- Advertisement -
- Advertisement -

భారతీయులంతా ఈనెల 27న వినాయక చవితి జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతకు కొన్ని గంటల ముందే అర్ధరాత్రి వేళ వారి కోసం ఒక ప్రత్యేక కానుకను అమలుకు తెచ్చారు. అది, అమెరికాకు ఎగుమతి అయే అన్ని రకాల సరకులపై దిగుమతి సుంకాలను 50 శాతానికి పెంచటం. ఆయన ఇప్పటికే నిర్హేతుకంగా విధించిన 25 శాతం సుంకాలు ఇపుడు రెట్టింపు అయాయి. దానితో అన్ని ఉత్పత్తులు ప్రభావితం కానుండగా దుస్తులు, చర్మఉత్పత్తులు, జెనెరిక్, మందులు నగలు, వజ్రాభరణాలు వంటివి బాగా దెబ్బతిననున్నాయి. అదనపు సుంకాల భయంతో ఆయా పరిశ్రమలకు ఆర్డర్లు ఇప్పటికే తగ్గినట్లు, ఉద్యోగుల తొలగింపు మొదలైనట్లు కొద్ది వారాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ 50% క్రమంగా కుదురుకున్న కొద్దీ ఆ ప్రభావాలు గణనీయంగా ఉండనున్నాయి.

అమెరికా అధ్యక్షుని ఆగ్రహానికి ఆయన చెప్తున్న ఏకైక కారణం మనం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని. రెండేళ్లుగా చర్చలలో నానుతున్న ఈ విషయమై భారత ప్రభుత్వం ఎన్నో వివరణలు ఇచ్చింది. అవన్నీ సహేతుకమైనవే తప్ప కల్పితాలు కావు. కాని, ప్రపంచంపై ఆధిపత్యానికి అలవాటు పడి, అది తమ హక్కు కూడానని నమ్మే అమెరికాకు, దాని నాయకత్వాన గల యూరప్‌కు సహేతుకాలతో పనిలేదు. వారికి కావలసింది తక్కిన ప్రపంచాన్ని గత వందల సంవత్సరాలుగా పీడించి శాసించి, లాభపడినట్లే ఇప్పటికీ సాగించుకోవటం. అందుకు చతురోపాయాలను ప్రయోగిస్తారు. ఇతర దేశాలు కొంత నిలదొక్కుకునేందుకు కాస్త స్వతంత్రంగా వ్యవహరించ ప్రయత్నిస్తే సహించలేరు.

టారిఫ్‌లను ఈ విధంగా పెంచటమన్నది అందుకు ఒక ప్రతిఫలనం మాత్రమే. వాణిజ్యలోటు తగ్గింపు పేరిట, పోయిన మారు 25 శాతం సుంకాలు విధించిన తర్వాత భారత ప్రభుత్వం పదే పదే ఇచ్చిన వివరణలతో ట్రంప్ ప్రభుత్వం కొంతైన అర్థం చేసుకుని సెకండరీ టారిఫ్ పేరిట అదనపు 25 శాతం ఆలోచనలను విరమించుకోవచ్చుననే ఆశాభావం కొంత ఉండేది. కాని, సామ్రాజ్యవాదులకు మైత్రి అన్నది కపటనీతి మాత్రమేనని మరొకసారి రుజువు పరుస్తూ, ఇపుడు మరొక శాతం కూడా కొండచరియవలే భారత ఆర్థిక వ్యవస్తపైకి వచ్చి కూలింది. వారిది ఎప్పుడూ వాడుకునే వదలివేసే విధానమే. భారతదేశంతో ఇతరాత్రా ఉందనే మైత్రి ఏదీ అమెరికాకు ఈ క్రమంలో లెక్కకు రాలేదు. అమెరికా దృష్టి నుంచే ఆలోచించినా తమవలెనే భారత ఒక ప్రజాస్వామిక దేశం. ప్రపంచం ప్రజాస్వామిక శిబిరంగా, ‘నియంతృత్వాల’ శిబిరంగా విడిపోయి ఉందనుకుంటే, ఇండియా అంతర్జాతీయ వ్యవహారాలలో ప్రజాస్వామిక శిబిరంలోనే ఉంటూ వస్తున్నది.

అమెరికా భౌగోళిక వ్యూహాలకు అది చాలా అవసరమైనది. రష్యాతో గల దీర్ఘకాలిక సంబంధాలు వివిధ అవసరాలను ఆధారం చేసుకున్నవే తప్ప సైద్ధాంతికం కాదు.ఆర్థిక వ్యూహం తప్ప భౌగోళిక వ్యూహం లేదు. సోషలిస్టు భావజాలం ఉండిన నెహ్రూ కాలంలోనూ అదే పరిస్థితి. వాస్తవానికి మనకు స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దాలలో పారిశ్రామికంగా, సైనికంగా, సాంకేతికంగా నిలదొక్కుకునేందుకు తొడ్పడటానికి అమెరికా శిబిరం నిరాకరించగా సహాయపడింది రష్యాయే. అపుడు నిర్మించిన ఉక్కు కర్మాగారాలు, అణుకేంద్రాలు అందుకు తార్కాణాలు. అవసరమైన ఆయుధ సామగ్రిని సరఫరా చేసింది కూడా వారే. వందల ఏళ్ల పాశ్చాత్య వలస పాలన తర్వాత స్వాతంత్య్రం సాధించుకున్న ఇండియాను ఆ దశలో ఒకవైపు అమెరికా కాదని, మరొక వైపు రష్యా కూడా కాదని ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించటం కూడా కష్టం.

కాని అటువంటి స్థితిలోనూ భారత దేశం రెండు శిబిరాల మధ్య అలీన విధానాన్నే అనుసరించింది. ఆ దశ గడిచిన వెనుక, ముఖ్యంగా 1991లో సోవియెట్ యూనియన్ పతనమై, ఆ వెంటనే ఆర్థిక సంస్కరణల దశ రావటంతో భారత ప్రభుత్వ విధానాలలో మార్పు మొదలైంది. అమెరికా శిబిరంతో సాన్నిహిత్యం రాసాగింది. చైనాతో గల వివాదాలు అందుకు తోడయ్యాయి.అప్పటి నుంచి ఈ రోజు వరకూ కూడా కాంగ్రెస్, బిజెపిలలో ఏ పార్టీ పరిపాలించినా ఇదే వైఖరి కొనసాగుతూ వచ్చింది. ప్రధానిగా వాజపేయి ఉండినప్పటి కన్న మోడీ విధానంలో మితవాద ధోరణి మరింత ఎక్కువ గనుక ప్రస్తుత ప్రభుత్వానికి అమెరికా అనుకూలమైనదనే పేరు ప్రపంచంలో వచ్చింది. ఇపుడు కళ్ల ఎదురుగా కనిపిస్తున్న దానినే చూస్తే, గాజాలో ఇజ్రాయెల్ ఇంత భయంకరమైన మారణకాండను సాగిస్తుండగా కనీసం యూరోపియన్ దేశాల పాటి అయినా నోరు విప్పకపోవటం ఆ ముద్రను మరింత ధ్రువీకరిస్తున్నది.

విషయం ఏమంటే, ఇంత సాగిలపడుతున్నా అమెరికా అధ్యక్షునికి ఎంతమాత్రం ‘దయ’ లేకపోయింది. అట్లా లేకపోవటమన్నది ఇదే చమురు కొనుగోలుకు సంబంధించి కూడా పలు విధాలుగా కనిపిస్తున్నది. అది ఏ విధంగానో చూద్దాము. భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ. అందుకు తగిన చమురు ఉత్పత్తి ఇక్కడ లేనందున భారీగా దిగుమతులు తప్పనిసరి. అట్లా వేర్వేరు దేశాల నుంచి ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా లేదా ప్రపంచంలోని బహిరంగ మార్కెట్లలో ఖరీదు చేయాలి. ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల ధర కొంత తగ్గుతుంది. అటువంటి దేశాలలో ఇరాన్, వెనిజులా నుంచి కొనుగోళ్లను అమెరికా తన రాజకీయ కారణాల వల్ల నిషేధించింది. పశ్చిమాసియా నుంచి దిగుమతులు కొనసాగుతున్నాయి గాని అంతకన్న రష్యాన్ చమురు ధర తక్కువ.

అక్కడి నుంచి ఇండియా కొనవద్దన్నది అమెరికా వాదన. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్యం అనే సూత్రాలను వల్లించే అమెరికాకు, యూరోపియన్ రాజ్యాలకు మనం మనకు అవసరమైనవి ఎక్కడ ఖరీదు చేస్తున్నామనేది ఎందుకు సమస్య కావాలి? ఈ 25 శాతం, 50 శాతం సుంకాలకు మూలం ఇక్కడుంది. ఈ చర్చలన్నీ పలుమార్లు జరిగినవే. కాని ఈ రోజున పరిస్థితి మరింత క్లిష్ట దశకు చేరినందున మళ్లీ చెప్పుకోవలసి వస్తున్నది. రష్యా మూడేళ్లుగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నదని, మనం వారి నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందున యుద్ధానికి కావలసిన నిధులు మన నుంచి వారికి లభిస్తున్నాయని, అట్లా లభించినట్లయితే రష్యా ఆర్థికంగా బలహీనపడి యుద్ధంలో ఓడిపోతుందన్నది వారి వాదన.

ఇందులో ఒక తర్కం ఉందనుకుందాము. కాని ఆ తర్కంపై అనేక ప్రశ్నలున్నాయి. వాటిలో దేనికీ అమెరికా గాని, యూరప్ గాని సమాధానం చెప్పలేకపోతున్నాయి. ఆ ప్రశ్న లేమిటి? ఇండియా కొనవద్దంటూ స్వయంగా అమెరికా, యూరప్‌లు ఎందుకు ఖరీదు చేస్తున్నాయి? అట్లా కొంటున్న చైనాను వదలి వేసి ఇండియాపై సుంకాలు ఎందుకు? ఈ రెండూ గాక మరెన్నో దేశాలు దిగుమతి చేసుకుంటుండగా వాటి మాటేమిటి? అసలు ఈ యుద్ధానికి కారకులు ఎవరు? సోవియెట్ యూనియన్ నాయకత్వాన ఉండిన వార్సా సైనిక కూటమి ఆ యానియన్‌తోపాటు 1991లో రద్దయినా, అమెరికా నాయకత్వపు నాటో కూటమిని కొనసాగిస్తూ రష్యాను చుట్టు ముట్టేందుకు ప్రయత్నిస్తూ, ఆ కూటమిలో ఉక్రెయిన్‌ను చేర్చుకునేందుకు ప్రయత్నించటం వల్ల కదా ఈ యుద్ధం వచ్చింది?

ఆ మాటను స్వయంగా ట్రంప్ కూడా ఇపుడు అంటున్నారు కదా? అటువంటపుడు సమస్యను తమ స్థాయిలో పరిష్కరించుకోలేక ఇండియా వంటి దేశాలపై నిందలు వేయటం ఎందుకు? తామంతా కలసి ఉక్రెయిన్‌కు ఆయుధ సహాయం, ధన సహాయం చేసి కూడా మూడేళ్లుగా గెలిపించలేకపోతున్నపుడు, రష్యా నుంచి ఇతరులు చమురు ఖరీదు చేస్తున్నందుకే సమస్య తేలటం లేదనటం హాస్యాస్పదం కాదా? విషయాన్ని రష్యాలోనే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు గదా? అమెరికా చెప్తున్న తర్కంపై గల ఈ విధమైన ప్రశ్నలకు సమాధానాలు లేవు గనుకనే ఈ సుంకాల మాట వచ్చింది.

అమెరికా ఒక్కటే కాదు. ప్రచారంలోకి రాలేదు గాని, యూరోపియన్ దేశాలు కూడా ఇదే కారణం చూపుతూ భారత దేశంపై పలు ఆంక్షలు విధించాయి. ఒక దశలోనైతే ట్రంప్ 100 శాతం సుంకాలనగా తాము కూడా 100 శాతం సుంకాలన్నాయి. దీనంతటిలో కనిపించేది సామ్రాజ్యవాద ఆధిపత్య దురహంకార, అసమర్థ దుర్జనత్వం తప్ప మరేమీ లేదు. మేము ఏమైనా చేస్తాముగాని మీరు అడగవద్దు, మేము చెప్పిందే మీరంతా చేయాలి అనడమన్నమాట. తమ ప్రాబల్యాలు అన్ని విధాలుగా కూడా క్రమంగా తగ్గటం సుమారు రెండు దశాబ్దాల నుంచే మొదలైనా, ప్రపంచంలో కొత్త ధోరణులు తలెత్తి బలపడుతున్నా వీరికి వివేకం కలగటంలేదు. ఏదో ఒక విధంగా గత కాలపు ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ చేదు నిజాల మధ్య భారత దేశంగాని, ఇతర వర్ధమాన దేశాలు గాని చేయవలసిందేమిటి? మన విషయాని వస్తే, ట్రంప్ వినాయక చవితి కానుకకు బదులుగా ఆయనకు మన బహుమతిని ఇవ్వాలి. అందుకు జరగవలసినవి మూడు. అన్నింటికన్న ముందు జరగవలసింది అమెరికా యూరప్‌ల నిజస్వరూపాన్ని ఇప్పటికైనా అర్ధం చేసుకోవటం. వారి పట్ల గల విశ్వాసం దెబ్బతిన్నందున అందుకు తగినట్లు వ్యవహరించటం. వారిపై గల భ్రమలను వదలుకోవటం. సంబంధాలు తెంపుకోకుండానే భ్రమలు వదిలించుకుని తగు జాగ్రత్తతో వ్యవహరించటం. వారి వందల ఏళ్ల వలసవాద చరిత్ర ఎటువంటిదన్నది. వర్తమాన ప్రయోజనాలు ఏమిటన్నది మరిచి మనలో చాలా మందికి వారంటే హద్దులేని భ్రమలు కొనసాగుతున్నాయి. అదొక భూలోక స్వర్గమనే అపోహలున్నాయి.

కనుక, మంచిని మంచిగా, చెడును చెడుగా చూడగల దృష్టిని కనీసం ప్రస్తుత అనుభావాలతో అలవరచుకోవాలి. ఆత్మగౌరవం అన్నిటి కన్న ముఖ్యమని కూడా గుర్తించాలి. తర్వాత జరగవలసింది భారత ప్రభుత్వం వైపు నుంచి. దేశప్రయోజనాలు అన్నిటికన్న ప్రధానమని, అమెరికన్ శిబిరం నిజంగా ప్రజాస్వామికమనే భావన పొరపాటని గ్రహించటం అవసరం.వారికి ప్రజాస్వామ్యం వగైరా మాటలు తమకు ఉపయోగపడినంత వరకే. తమ ప్రయోజనాలకు అవసరమైపుడు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన దృష్టాంతాలు ప్రపంచమంతటా లెక్కలేనన్ని ఉన్నాయి. ద్వంద్వ నీతులు, ప్రమాణాలలో వారికి సరిపోగలవారు లేరు. భారత్ వంటి దేశాలతో మైత్రి అనేది కూడా తమ కపటనీతిలో భాగమే.

అందువల్ల, ప్రస్తుతం సుంకాల విషయంలో గాని, ఇతరత్రాగాని ప్రభుత్వం ఈ వాస్తవాలను గుర్తించి దృఢంగా వ్యవహరించాలి. అట్లా చేస్తున్న సూచనలు ప్రస్తుతానికైతే కొంత కనిపిస్తున్నాయి. ఆ ధోరణి ఇంకా బలపడాలి. దీర్ఘకాలికం కావాలి. చివరిది, ఇతర వర్ధమాన దేశాలతో సంబంధాలు ఇప్పటి కన్నా ఎక్కువగా, వేగంగా పటిష్టపరచుకోవటం. అమెరికా నాయకత్వాన గల వివిధ వ్యవస్థలకు ప్రత్యామ్నాయ వ్యవస్థలు రూపొందించుకోవటం. బహుళ ధ్రువ ప్రపంచం, బ్రిక్స్, అమెరికన్ డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీలలో లావాదేవీలు జరుపుకోవటం ఐక్యరాజ్యసమితి మొదలైన అంతర్జాతీయ సంస్థలలో మరింత ఐక్యంగా వ్యవహరించటం, స్వేచ్ఛావాణిజ్య వ్యవస్థలు బలహీనపడకుండా జాగ్రత వహించటం వంటివి జరగాలి. ఇవన్నీ ఎంతగా, ఎంత త్వరంగా జరిగితే భవిష్యత్తుకు అంత భద్రత లభిస్తుంది.

  • టంకశాల అశోక్ ( దూరదృష్టి)
  • రచయిత సీనియర్ సంపాదకులు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News