కొంప ముంచిన బౌలర్ల వైఫల్యం
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించే సువర్ణ అవకాశాన్ని చేజేతులా చేజార్చుకుంది. శుక్రవారం మూడో రోజు ఆరంభంలో భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టి పటిష్టస్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ జో రూట్ (22) ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు. సిరాజ్ అద్భుత బంతితో అతన్ని వెనక్కి పంపాడు. తర్వాతి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో ఒక వికెట్‌ను తీసి ఉంటే మ్యాచ్ భారత్ గుప్పిట్లోకి వచ్చేది. కానీ టీమిండియా బౌలర్లు మరోసారి తేలిపోయారు. హ్యారీ బ్రూక్, వికెట్ కీపర్ జేమీ స్మిత్‌లను ఔట్ చేయడంలో విఫలమయ్యారు. స్మిత్, బ్రూక్‌లు భారత బౌలర్లపైఎదురుదాడి చేస్తూ ముందుకు సాగారు.
ఈ జోడీని విడగొట్టడంలో భారత బౌలర్లు వైఫల్యం చవిచూశారు. వీరిపై ఎలాంటి ప్రభావం చూపలేక పోయారు. స్మిత్ వన్డేల మాదిరిగా చెలరేగి ఆడాడు. వరుస ఫోర్లతో టీమిండియా బౌలర్లను హడలెత్తించాడు. బ్రూక్ కూడా తన మార్క్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ జంటను తక్కువ స్కోరుకే ఔట్ చేసి ఉంటే భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించి ఉండేది. కానీ భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన స్మిత్, బ్రూక్ ఆరో వికెట్‌కు ఏకంగా 303 పరుగులు జోడించి భారత్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లారు. బ్రూక్ 234 బంతుల్లోనే17 ఫోర్లు, ఒక సిక్స్‌తో 158 పరుగులు చేశాడు. ఇక స్మిత్ భారీ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు మరోసారి పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. ప్రత్యర్థి టీమ్‌పై పట్టు సాధించే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్నారు. బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది.
తొలి టెస్టులో కూడా భారీ స్కోరు సాధించినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈసారి కూడా ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరును సాధించిన సంగతి తెలిసిందే. కానీ స్మిత్, బ్రూక్‌ను త్వరగా ఔట్ చేయడంలో విఫలం కావడంతో ఇంగ్లండ్ అనూహ్యంగా పుంజుకుంది. వంద పరుగుల లోపే ఐదు వికెట్లు కోల్పోయినా ఇంగ్లండ్ ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. స్మిత్, బ్రూక్‌ల అసాధారణ పోరాట పటిమతో మ్యాచ్‌లో మళ్లీ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే భారత ఆశలపై నీళ్లు చల్లడంలో ఇంగ్లండ్ సఫలమైంది.