Saturday, August 2, 2025

కష్టాల్లో టీమిండియా… తీరు మారని యశస్వి..

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో చివరి టెస్టు
ఓవల్ (లండన్): ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన ఐదో, చివరి టెస్టులో (Ind vs Eng Fifth test match) టీమిండియా కష్టాల్లో చిక్కుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 9 బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ కూడా నిరాశ పరిచాడు. రాహుల్ ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో భారత్ 38 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లు కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.

ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే లంచ్ తర్వాత టీమిండియా (Ind vs Eng Fifth test match) కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. నిలకడగా ఆడుతున్న కెప్టెన్ గిల్ (21) లేని పరుగు కోసం వెళ్లి రనౌటయ్యాడు. కొద్ది సేపటికే సాయి సుదర్శన్ కూడా వెనుదిరిగాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన సుదర్శన్ 108 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన రవీంద్ర జడేజా (9), వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (19) కూడా నిరాశ పరిచారు. తాజా సమాచారం లభించే సమయానికి భారత్ 52 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

తీరు మారని యశస్వి..

లండన్: టీమిండియా (Ind vs Eng Fifth test match) యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాడు. ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన చివరి టెస్టులో యశస్వి రెండు పరుగులు మాత్రమే చేసి పెవలియన్ చేరాడు. గస్ అట్కిన్సన్ వేసిన బంతిని ఆడడంలో విఫలమైన యశస్వి వికెట్ల ముందు దొరికి పోయాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో యశస్విపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఓపెనర్లు రాహుల్, యశస్విలు జట్టుకు శుభారంభం అందిస్తారని అందరూ భావించారు. అయితే యశస్వి 9 బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా విమర్శకులకు గట్టి సమాధానం చెబుతాడని భావించిన యశస్వి సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అందివచ్చిన అవకాశాన్ని యశస్వి సద్వినియోగం చేసుకోలేక పోయాడని, అతని బ్యాటింగ్‌లో నిలకడ లోపించిందని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. క్రీజులో పాతుకు పోవాల్సిన యశస్వి పేలవమైన ప్రదర్శనతో ఆరంభంలోనే పెవిలియన్ చేరడాన్ని గవాస్కర్, కపిల్ దేవ్, మంజ్రేకర్ తదితరులు తప్పుపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News