మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అసాధారణ ఆటతో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా ఖాతా కూడా తెరవకుండానే కీలకమైన రెండు వికెట్లను కోల్పోయింది. ఇలాంటి స్థితిలో భారత్‌కు ఇన్నింగ్స్ ఓటమి ఖాయమని అందరూ ఓ అంచనాకు వచ్చేశారు. ఐదు సెషన్‌ల పాటు ఆట మిగిలివుండడం, పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారడంతో టీమిండియా ఓటమి లాంఛనంగానే కనిపించింది. నాలుగో రోజు రెండు సెషన్‌లలోపే ఆట ముగుస్తుంని విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు.
గిల్, రాహుల్ అద్భుత పోరాటం..
ఈ దశలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ ఆటగాడు కెఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకు పోయారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్‌ను కాపాడుకున్నారు. వీరిని ఔట్ చేసేందుకు ఇగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రక్షణాత్మక బ్యాటింగ్‌తో గిల్, రాహుల్‌లు భారత ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. తొలుత వికెట్‌ను కాపాడుకోవడంపైనే దృష్టి సారించిన ఇద్దరు ఆ తర్వాత బ్యాట్‌ను ఝులిపించడం ప్రారంభించారు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ వీరు చేసిన పోరాటాన్ని ప్రశంసిచక తప్పదు.
ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ వీరు కొనసాగించిన ప్రయాణం భారత క్రికెట్ చరిత్రలో చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పడలో అతిశయోక్తి లేదు. చాలా కాలం తర్వాత నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్ ఇలాంటి ప్రదర్శన చేసిందని చెప్పాలి. రాహుల్, గిల్ బ్యాటింగ్ టీమిండియాలో కొత్త జోష్‌ను నింపింది. ఈ సిరీస్‌లో రాహుల్, గిల్ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు. కీలకమైన మాంచెస్టర్ టెస్టులోనూ గిల్, రాహుల్‌లు మరోసారి చిరస్మరణీయ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. గిల్ సెంచరీతో మెరువగా, రాహుల్ తృటితో శతకాన్ని చేజార్చుకున్నాడు. రాహుల్, గిల్‌లు కలిసి మూడో వికెట్‌కు 188 పరుగులు జోడించి జట్టును పటిష్టస్థితికి చేర్చారు.
జడేజా, వాషింగ్టన్ అదుర్స్..
రాహుల్, గిల్‌లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఇలాంటి స్థితిలో మరోసారి టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదంలో చిక్కుకుంది. కానీ సుందర్, జడేజాలు మాత్రం అద్భుతమే చేశారు. అసాధారణ ఆటతో భారత్‌ను ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇటు జడేజా అటు సుందర్‌లు ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగారు. ఇంగ్లీష్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ క్రీజులో గోడలా నిలిచారు. ఈ జండను విడగొట్టేందుకు ఆతిథ్య జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చారిత్రక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సుందర్, జడేజాలు అజేయ శకతాలతో భారత్‌ను ఓటమి నుంచి గట్టెక్కించారు. వీరు సాధించిన ఈ శతకాలు వీరి కెరీర్‌లోనే కాకుండా భారత క్రికెట్ చరిత్రలో చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం. ఈ మ్యాచ్‌లో రాహుల్, గిల్‌లతో పాటు జడేజా, వాషింగ్టన్‌ల బ్యాటింగ్ విన్యాసాలను ఎంత పొగిడినా తక్కువే. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా నైతిక విజయం టీమిండియాదే అని చెప్పక తప్పదు.