Friday, April 26, 2024

క్లీన్ స్వీప్‌పై టీమిండియా కన్ను

- Advertisement -
- Advertisement -

IND vs WI 3rd ODI Match Today

ట్రినిడాడ్: వెస్టిండీస్‌తో బుధవారం జరిగే మూడో, చివరి వన్డేకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలనే లక్షంతో భారత్ బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేలు కూడా చివరి వరకు నువ్వానేనా అన్నట్టుగా సాగాయి. ఆఖరి వన్డేకు ఆసక్తికరంగా సాగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కిందటి మ్యాచ్‌లో అక్షర్ పటేల్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో భారత్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, దీపక్ హుడా తదితరులు కూడా రెండో వన్డేలో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. తొలి వన్డేలో తృటిలో సెంచరీ సాధించే అవకాశాన్ని చేజార్చుకున్న కెప్టెన్ రెండో వన్డేలో విఫలమయ్యాడు.

ఈసారి మాత్రం మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు. అక్షర్ పటేల్, శార్దూల్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. చాహల్, సిరాజ్, అవేశ్, శార్దూల్‌లతో బౌలింగ్ విభాగం కూడా బాగానే కనిపిస్తోంది. దీంతో టీమిండియా హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమనే చెప్పాలి. మరోవైపు ఆతిథ్య విండీస్ కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన విండీస్ కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయినా పరువును కాపాడు కోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగానే ఉన్నా విండీస్‌కు రెండు మ్యాచుల్లో ఓటమి తప్పలేదు. చివరి వరకు భారత్‌కు గట్టి పోటీ ఇచ్చినా విజయం మాత్రం అందుకోలేక పోయింది. ఈ మ్యాచ్‌లో మాత్రం ఓటముల పరంపరకు తెరదించాలనే పట్టుదలతో విండీస్ ఉంది.

IND vs WI 3rd ODI Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News