ముల్లాన్‌పూర్: ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళా టీమ్ 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది.
ఓపెనర్ జార్జియా వొల్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్, కెప్టెన్ అలీసా హీలీ (9) కూడా నిరాశ పరిచింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిసె పెరీ కాస్త మెరుగైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించింది. జట్టును ఆదుకుంటుందని భావించిన బేథ్ మూని(18) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయింది. పెరీ 5 ఫోర్లతో 44 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. అనబెల్ సదర్లాండ్ 4 ఫోర్లతో వేగంగా 45 పరుగులు సాధించింది. గార్డ్‌నర్ (17), మెక్‌గ్రాత్ (16), బ్రౌన్ 14 (నాటౌట్) కాస్త రాణించినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో తెలుగుతేజం క్రాంతి గౌడ్ మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లను పడగొట్టారు.
మంధాన జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్ స్మృతి మంధాన అండగా నలిచింది. మరో ఓపెనర్ ప్రతీక రావల్‌తో కలిసి శుభారంభం అందించింది. మంధాన ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించింది. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లు, సిక్సర్లుగా మలుచుతూ ముందుకు సాగింది. ప్రతీక 4 ఫోర్లతో 25 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (17), వికెట్ కీపర్ రిచా ఘోష్ (29), దీప్తి శర్మ (40) పరుగులు సాధించారు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన మంధాన 91 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 117 పరుగులు సాధించింది. ఇక చివర్లో స్నేహ్ రాణా 3 ఫోర్లతో వేగంగా 24 పరుగులు చేసింది. దీంతో భారత్ స్కోరు 292 పరుగులకు చేరింది.
Also Read: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా