Friday, August 15, 2025

ఇప్పటికీ అందని స్వాతంత్య్ర ఫలాలు

- Advertisement -
- Advertisement -

భారత దేశం స్వాతంత్య్రం సాధించుకొని నేడు 79 సంవత్సరాలు కావస్తున్నా స్వాతంత్య్ర ఫలాలు దేశంలోని ప్రతి పౌరుడికీ సమానంగా లభించకపోవడం మూలంగా స్వాతంత్య్రానికి అర్థం లేకుండాపోయింది. నాటి స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేసి, దేశ ప్రజలు స్వదేశంలో స్వపరిపాలలో స్వేచ్ఛ, సమానత్వ సోదరభావ ప్రజాస్వామ్య గణతంత్ర విలువలతో బతకాలని నాడు బ్రిటిష్ పాలకులతో అలుపెరగని పోరాటం చేసి స్వాతంత్య్రం సాధించి పెడితే, నేడు భారత దేశానికి స్వాతంత్య్ర, గణతంత్రం సాధించుకున్నప్పటికీ అనుకున్న విధంగా సంపూర్ణమైన ప్రగతిని సాధించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది బ్రిటిష్ పాలకులనుండి విముక్తిఅయి దేశంలో ఉన్న కుల, మతాలకతీతంగా పాలన వ్యవస్థలో సామాజిక న్యాయం లేకపోవడం మూలంగానే నేడు స్వాతంత్య్ర, గణతంత్ర ఫలాలు అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయంగా దక్కలేదనట్టుగా అనేక గణాంకాలు పరిశీలిస్తే నిరూపణ అవుతుంది.

నాడు మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ చెప్పినట్టుగానే బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని వీడి భారతీయులు పాలించుకున్నంత మాత్రాన విప్లవాత్మకమైన మార్పులు (Revolutionary changes) రావాని ముందుగానే చెప్పారు. అదే నేడు నిరూపణ అవుతున్నది. కానీ రాజ్యాధికారంలో కుల, మతాలకతీతంగా అన్ని సామాజిక వర్గాలకు సమానత్వం ఉన్నప్పుడే సామాజిక న్యాయం అమలవుతాదని ఫూలే, అంబేద్కర్ మహనీయులు ఆనాడే జోస్యం చెప్పారు. బ్రిటిష్ పాలకులను తరిమివేసి భారతదేశంలో ఉన్న 10% అగ్రవర్ణాలు కేంద్ర, రాష్ట్ర కార్య శాసన న్యాయ నిర్వహణ వ్యవస్థలో అత్యధిక సింహ భాగం ఉండటం మూలంగా పరిపాలన అంగాల్లో సామాజిక న్యాయం లోపించడం మూలంగా భారత దేశంలో సామాజిక న్యాయం లోపించి, దేశ ఆర్థిక వ్యవస్థ బలహీన పడినట్లుగా నిరూపణ అవుతున్నది.

అనేక గణాంకాలు చెప్తున్నట్టుగా భారత దేశంలో 90% సంపద అగ్రవర్ణాల చేతిలో ఉంటే, 10% సంపద అణగారిన వర్గాల చేతుల్లో ఉన్నట్లుగా నిరూపణ అవుతున్నది. అలాంటప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అమెరికా, చైనా, రష్యాలని వెనక్కి నెట్టేలా ఏ విధంగా నిర్మాణం అవుతాది? గణతంత్ర దేశం కదా మరి గణతంత్రం అనగా ఏంటి? దేశ పరిపాలన, సంపద, వ్యాపారం ఇలా సమస్త రంగాల్లో సమాన వాటాన్ని ప్రతి తలకి పంచుకొని దేశ సహజ వనరులను ప్రతి పౌరుడు అనుభవిస్తూ, దేశ అభివృద్ధికి పాటుపడేలా పనిచేయడమే గణతంత్ర రాజ్యానికి నిదర్శనం. కానీ దేశంలో అలా జరగకుండా, కేంద్ర, రాష్ట్ర అధికారాలు, సంపద, భూమి, సమస్త రంగాలు మైనారిటీలుగా ఉండి, అధికారంలో ఉన్న అగ్రవర్ణాల ఆధీనంలో బందీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోటీపడుతూ బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన మూడవ, నాల్గవ దేశంగా భారతదేశం అవతరించనున్నదని చెప్తున్నారు.

కానీ అగ్రవర్ణాలతోపాటు సమానంగా అణగారిన వర్గాల సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక, జీవినవిధానంలో విప్లవాత్మక మార్పు రాకుండా, సామాన్య నిరుపేద కుటుంబాలకి మౌలిక సౌకర్యాలు కల్పించకుండా, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా 3 లేదా 4 ఆర్థిక శక్తి కలిగిన దేశంగా భారతదేశం అవతరించిందో దేశ పౌరులకు ఆధారాలతో సహా రుజువు చేయాలి. నిరూపణ చేయలేకుంటే కేంద్ర ప్రభుత్వం దేశప్రజలను మభ్యపెడుతున్నదని చెప్పడానికి నిదర్శనం! కానీ దేశంలో 100 కోట్లుకు పైగా ఉన్న అణగారిన వర్గాలకి నేటికి మౌలిక సదుపాయాలు లేక ఏదో భారత రాజ్యాంగ పుణ్యమా అని కొంత మెరుగైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. అంతేగాని అణగారిన వర్గాలకు అంబేద్కర్, భారత రాజ్యాంగం చేసిన మేలు తప్ప. అందుకు అతీతంగా దేశ అగ్రవర్ణ పాలకులు చేసిన మేలు శూన్యం.

దానికి నిదర్శనమే దేశంలో అణగారిన వర్గాలు అస్వతంత్రులుగా బతుకుతూ కార్మిక, కూలీలుగా వెట్టి చాకిరీ చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సాధించుకున్న తదనంతరం నేటి వరకు కేంద్ర, రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో అన్ని సామాజిక వర్గాలకు సమాన వాటా ఇచ్చి, అదే విధంగా దేశ సంపదలో, సమస్త రంగాల్లో సమాన వాటాను పంపిణీ చేసి, ప్రభుత్వ అంగాలైన శాసన కార్య న్యాయ వ్యవస్థలో అన్ని సామాజిక వర్గాలకి సమాన వాటా ఇచ్చి ఉన్నట్లయితే నేడు భారత దేశమే ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉండేది. కాబట్టి ఇప్పటికైనా అగ్రవర్ణ పాలకులు పరివర్తన చెంది, భారతదేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరివర్తన దృష్టిలో పెట్టుకొని రాజ్యాధికారంలోను సమస్త రంగాల్లో దేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సమాన వాటా ఉండేలాగా గొప్ప మనసు చేసుకొని అగ్రవర్ణ పాలకులు, వ్యాపారులు పరివర్తన చెంది మన పూర్వీకులు సాధించి పెట్టిన స్వాతంత్య్ర, గణతంత్ర దేశానికి పరిపూర్ణమైన అర్థం వచ్చేలా జీవించాలి!

లేకుంటే భవిష్యత్తులో అగ్రవర్ణాల భూస్వామ్య, పెట్టుబడిదారీ అసమానత్వ పాలనకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం 10% అగ్రవర్ణాలకు, 90% అణగారిన వర్గాలకు మధ్య సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సమన్యాయం కోసం మరో స్వాతంత్య్ర సంగ్రామం పుట్టినా ఆశ్చర్యం లేదు! కాబట్టి బుద్ధిజీవులైన మానవులుగా కుల, మత తారతమ్యాలు లేకుండా ప్రతి పౌరుడికీ దేశ స్వాతంత్య్ర, గణతంత్ర ఫలాలు అందించడమే నేడు పాలకులపై ఉన్న తక్షణ, సహజ కర్తవ్యం. ఇట్టి విషయాన్ని దేశ పౌరులకు తెలిసేలా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే కీలక భాగమైన ప్రింట్ మరియు ఎలక్ట్రాన్ మీడియా కూడా నిరంతరం అనేక విధాలుగా ప్రచారం చేయాల్సిన అవసరం మీడియా రంగంపై కూడా ఉన్నదనే విషయాన్ని మేధావులు, విద్యావంతులు, సామాన్యులు సైతం గ్రహించాల్సిన చారిత్రక సత్యం.

  • పుల్లెంల గణేష్
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News