లండన్: ఇంగ్లండ్‌తో శనివారం లార్డ్ వేదికగా జరిగే రెండో వన్డేకు భారత మహిళా (Indian women) క్రికెట్ జట్టు సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. సౌతాంప్టన్‌లో జరిగిన తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్ సేన ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి జయకేతనం ఎగుర వేసింది. ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో బరిలోకి దిగుతోంది. కిందటి మ్యాచ్‌లో దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లు అసాధారణ బ్యాటింగ్‌తో అలరించారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని జట్టుకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు.
దీప్తి 62 (నాటౌట్) అజేయ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోడ్రిగ్స్ (48) పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రతీక రావల్ (36), స్మృతి మంధాన (28), హర్లీన్ డియోల్, అమన్‌జోత్ కౌర్‌లు కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరుగ్గా (Better bowling) కనిపిస్తున్న టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. దీంతో భారత్ ఎలాగైనా మ్యాచ్‌లో గెలవాలనే లక్షంతో ఉంది. ఇప్పటికే టి20 సిరీస్‌ను గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించింది. వన్డేల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని తహతహలాడుతోంది.
మరోవైపు ఇంగ్లండ్ కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న ఇంగ్లీష్ టీమ్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు బ్యూమౌంట్, అమీ జోన్స్, ఎమ్మా లాంబ్,కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్, సోఫియా డంక్లి, డేవిడ్‌సన్ రిచర్డ్, సోఫి ఎకిల్‌స్టోన్ వంటి స్టార్లు జట్టులో ఉన్నారు. దీంతో ఇంగ్లండ్ కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. రెండు జట్లు కూడా విజయంపై దృష్టి సారించడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.