Monday, August 4, 2025

సర్‌పై మరింత జోరు నిరసన హోరు

- Advertisement -
- Advertisement -

7న ఇండియా కూటమి విందు భేటీ
మరుసటి రోజు ఇసి వద్దకు ర్యాలీ
పార్లమెంట్‌లోనూ మరింతగా పట్టు
న్యూఢిల్లీ : బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్) పై ప్రతిపక్ష ఇండియా కూటమి తమ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేయనుంది. కూటమి నేతలు ఈ నెల 7వ తేదీన విందు సమావేశం ఏర్పాటు చేసుకుని తమ తదుపరి కార్యాచరణను ఖరారు చేసుకుంటారు. మరుసటి రోజు 8 వ తేదీన ఎన్నికల సంఘం కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లుతారు. రెండు రోజుల విరామానంతరం సోమవారం నుంచి తిరిగి పార్లమెంట్ సమావేశాలు ఆరంభమవుతాయి. వీటిలో కూడా ప్రతిపక్షాలు సర్ ఉపసంహరణకు పట్టుపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. సర్ వ్యవహారం ఈ సెషన్ దశలో అత్యంత వివాదాస్పద అంశం అయింది. దాదాపుగా సెషన్ ఆరంభం నుంచి నిరసనలతో కార్యకలాపాలు స్తంభించిపోతూ ఉన్నాయి.

ప్రతిపక్ష కూటమి ఐక్యత సంఘటిత శక్తికి ప్రతీకగా విందు సమావేశం ఏర్పాటు కానుంది. ఉప రాష్ట్రపతి పదవికి ఖాళీ భర్తీకి ఇప్పటికే ఎన్నిక ప్రక్రియను ప్రకటించారు. ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలిపే దిశలో కూడా ఇండియా కూటమి సంప్రదింపులు సాగుతాయి. బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ రాజ్యాంగ , పార్లమెంటరీ పద్ధతులకు విరుద్ధం అవుతోందని ప్రతిపక్షాలు ఆక్షేపించాయి. నిజమైన ఓటర్లకు అన్యాయం జరిగి , బిజెపి అనుకూల ఓటర్లకు పెద్ద పీట వేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టారని కాంగ్రెస్ విమర్శించింది. ఇది వోటుబందీ, ఓటు చోర్ అని రాహుల్ గాంధీ పలు వేదికలపై నిరసనకు దిగుతున్నారు.

సర్‌పై చర్చకు ప్రభుత్వం ససేమిరా.. మోడీ సర్కారుకు క్లాసు తీసుకుంటామన్న విపక్షం
ఎట్టి పరిస్థితుల్లోనూ సభలలో సర్‌పై చర్చకు వీలు కుదరదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ గత వారం స్పష్టం చేశారు. నియమనిబంధనల పరిధిలోనే ఏ విషయంపై అయినా చర్చ జరగాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం లేదా ఇతర రాజ్యాంగ వ్యవస్థల కార్యనిర్వాహక పంథాపై సభలలో చర్చ కుదరని, ఇది వ్యవస్థ అతిక్రమణ కిందికి వస్తుందని గతంలో లోక్‌సభ స్పీకర్ బలరాం జక్కర్ పేర్కొని ఉన్నారు. దీనిని తాము పాటిస్తామని చర్చకు అనుమతించేది లేదని ప్రభుత్వం తెలిపింది. దీనితో ఈ వ్యవహారం సర్దుబాట్లకు వీలులేని స్థాయికి రాజుకుంది. సభల్లో తాము సర్‌పై చర్చకు పట్టుపడుతూనే ఉంటామని విపక్షాలు స్పష్టం చేశాయి. దీనితో ఇప్పుడు ఈ వారం కూడా సభా కార్యక్రమాలు సజావుగా సాగుతాయా? అనే మీమాంస నెలకొంది.

వణుకుతున్న మోడీ సర్కారుకు ప్రతిపక్షాలు సభా నిబంధనల గురించి ఇక పాఠాలు తీసుకుంటాయని టిఎంసి సీనియర్ నేత డెరెక్ ఒ బ్రెయిన్ తెలిపారు. చర్చ జరిగేలా చేసి తీరుతామన్నారు. సర్ అంటే సైలెంట్ ఇన్‌విజిబుల్ రిగ్గింగ్ అని, సడీసప్పుడు లేకుండా ఎన్నికల రిగ్గింగ్ సన్నాహక ప్రక్రియ అని విమర్శించారు. ఓట్ల చౌర్యమంటేనే పరమ చెత్త దొంగ పని, ఇక దీనిపై చర్చకు నిబంధనల సాకు ఎందుకు? దీనిపై చర్చకు బిజెపి వణుకుతోంది. అందుకే వద్దంటోంది. సభకు ఆటంకాలు కల్పిస్తున్నది అధికార పక్షమే అన్నారు. సోమవారం నుంచి విపక్షాలు ఏ విధంగా మోడీ సర్కారుకు క్లాసులు తీసుకుంటామనేది అంతా చూస్తారని స్పందించారు. చర్చకు అంగీకరించేలా చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News