గత కొద్ది రోజులుగా భారత్, పాక్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. ఇరుదేశాల మధ్య మరోసారి పూర్తి స్థాయి యుద్ధం తప్పదేమోనన్న భయాలు కొనసాగుతున్న తరుణంలో ఇరుదేశాలు కాల్పల విరమణకు అంగీకరించాయి. భారత విదేశాంగ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. శనివారం సాయంత్రం 5 గంటలనుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. శనివారం సాయంత్రం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విలేఖరులతో మాట్లాడుతూ ‘ మధ్యాహ్నం 3.35 గంటలకు ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్( డిజిఎంఒ) స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. పాకిస్థాన్ డిజిఎంఒ భారత డిజిఎంఒకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణలకు ఇరుదేశాల సైనికాధికారులు అంగీకరించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలనుంచి ఇది అమలులోకి వచ్చింది.
భూ, గగన, సముద్ర తలాలనుంచి ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుంది. వీటికి సంబంధించి ఇరుదేశాల సైన్యాలకు తగిన ఆదేశాలు వెళ్లాయి.ఈ నెల 12న సాయంత్రం ఇరుదేశాల డిజిఎంఒలు మళ్లీ చర్చలు జరుపుతారు’ అని మిస్రీ వెల్లడించారు. కాగా తక్షణం కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్‌దార్ ఇస్లామాబాద్‌లో ‘ఎక్స్’లో చేసిన ఓ ట్వీట్‌లో తెలియజేశారు. ‘తన సార్వభౌమత్వం, సమగ్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుడా పాకిస్థాన్ ఎల్లప్పుడు ఈ ప్రాంతలో శాంతి, భద్రత కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంది’ అని ఉపప్రధాని కూడా అయిన దార్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ తాము ఎల్లప్పుడూ సర్వ సన్నద్ధంగానే ఉంటామని భారత సైన్యం స్పష్టం చేసింది.