Wednesday, July 16, 2025

రుణభారంతో దేశం కుదేలు

- Advertisement -
- Advertisement -

భారతదేశం గత దశాబ్దకాలంలో అనేక ఆర్థిక సంస్కరణలు, సామాజిక పథకాలు, రాజకీయ మార్పులను చవిచూసింది. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పన, సామాజిక సంక్షేమం వంటి అంశాలపై ఎన్నో వాగ్దానాలు చేసింది. అయితే, ఇటీవలి ఆర్థిక నివేదికలు, సామాజిక వాస్తవాలు సామాన్య పౌరుడి జీవితంలో పెరిగిన అప్పుల భారాన్ని, ఆర్థిక సంక్షోభాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఇటీవల విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్- 2025 ప్రకారం, దేశంలోని ప్రతి పౌరుడిపై సగటున రూ. 4.8 లక్షల అప్పు ఉంది. ఇది గత రెండేళ్లలో రూ. 90,000 మేర పెరిగింది. ఈ గణాంకాలు సామాన్యుడి జీవన పరిస్థితులు ఎంత దిగజారాయో చాటుతున్నాయి.

ఆర్‌బిఐ నివేదిక ప్రకారం, 2023 మార్చిలో ఒక్కో పౌరుడిపై అప్పు రూ. 3.9 లక్షలుగా ఉండగా, 2025 మార్చి నాటికి ఇది రూ. 4.8 లక్షలకు చేరింది. ఈ రూ. 90,000 పెరుగుదల సామాన్యుడి ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. దేశ జిడిపిలో అప్పుల వాటా 41.9 శాతంగా ఉంది. ఇందులో గృహ రుణాలు 29 శాతం. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, మొబైల్ ఇఎంఐలు 54.9 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మరో ఆందోళనకర అంశం ఏమిటంటే, లోన్- టు-వాల్యూ (ఎల్‌టివి) రేషియో 70 శాతానికి పైగా ఉండటం. ఇది రుణాల రికవరీని కష్టతరం చేస్తుంది. అంతేకాక, 25 శాతం రిటైల్ రుణాలు సురక్షితం కానివిగా గుర్తించారు. ఇది ఆర్థిక వ్యవస్థలో అస్థిరతను సూచిస్తుంది.

ఫోర్బ్ నివేదిక ప్రకారం, దేశంలో సగటు తలసరి ఆదాయం రూ. 2.16 లక్షలు మాత్రమే. అంటే, సామాన్యుడి అప్పు అతని ఆదాయం కంటే రెండింతలకు పైగా ఉంది. ఈ అసమతుల్యత సామాన్య పౌరుడు తన రోజువారీ జీవన అవసరాల కోసం అప్పులపై ఆధారపడుతున్నాడని స్పష్టం చేస్తుంది. ఆర్‌బిఐ గణాంకాలు చెప్పేది ఏమిటంటే 55% అప్పులు, ఆస్తుల సృష్టికి కాకుండా, కేవలం జీవన ఖర్చుల కోసమే తీసుకోబడుతున్నాయి. క్రెడిట్ కార్డుల వాడకం, వ్యక్తిగత రుణాలు, ఇఎంఐలు ఈ ధోరణికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. సామాన్యుడు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది, నిత్యావసర వస్తువుల ధరలు గత 11 ఏళ్లలో దాదాపు 300 శాతం పెరిగాయి. ఆహారం, ఇంధనం, గృహ ఖర్చులు, విద్య, వైద్యం వంటి అంశాలు సామాన్యుడికి భారంగా మారాయి.

రెండవది, ద్రవ్యోల్బణం పెరిగినా, వేతనాలు దానికి అనుగుణంగా పెరగలేదు. చాలీచాలని జీతాలతో కుటుంబ ఖర్చులను భరించలేక, ప్రజలు అప్పులపై ఆధారపడుతున్నారు. మూడవది, నైపుణ్యానికి తగిన ఉపాధి అవకాశాలు తగ్గాయి. యువతలో నిరుద్యోగం రేటు గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగింది, ఇది ఆర్థిక అస్థిరతకు దారితీస్తోంది. ఈ పరిస్థితుల్లో, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు- ఉదాహరణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై), ఆయుష్మాన్ భారత్- పేదలకు సహాయం చేసే లక్ష్యంతో రూపొందించబడ్డాయి. అయితే, ఈ పథకాలు అమలులో లోపాలు, అవగాహన లేమి లేదా అర్హత సమస్యల వల్ల సామాన్యుడికి పూర్తి ప్రయోజనం చేకూరడం లేదు.

ఉదాహరణకు, పిఎంఎవై కింద గృహ రుణాలపై సబ్సిడీలు అందుతున్నప్పటికీ అర్హత నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియలు సంక్లిష్టంగా ఉండటం వల్ల చాలా మంది ఈ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వంటి విమర్శకులు, మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో విఫలమైందని ఆరోపిస్తున్నారు. అచ్చేదిన్ నినాదంతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం, వాస్తవానికి ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టిందని వాదిస్తున్నారు. ఒక వైపు సామాన్యులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే, ప్రభుత్వానికి సన్నిహిత వ్యాపార వేత్తలు మాత్రం అపార సంపదను సృష్టించుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు, ఐటి హార్డ్‌వేర్, బయో టెక్నాలజీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ ఈ ప్రయోజనాలు ప్రధానంగా కార్పొరేట్ రంగానికే చేకూరుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు తీసుకోవాలి. మొదట ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి.

నిత్యావసర వస్తువుల ధరలను స్థిరీకరించడం అత్యవసరం. రెండవది, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలి. మూడవది, రుణాల విషయంలో పారదర్శకత, సురక్షిత రుణవిధానాలను అమలు చేయాలి. అంతేకాక సామాన్యులకు విద్య, వైద్యం, గృహసౌకర్యాలు అందించే పథకాలు సులభతరం చేయాలి. తద్వారా వారు అప్పులపై ఆధారపడకుండా ఉండగలరు. మోడీ పాలనలో దేశం కొన్ని రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ, సామాన్యుడి జీవనపరిస్థితులు మాత్రం ఆశాజనకంగా లేవు. పెరిగిన అప్పుల భారం, ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాల కొరత వంటివి పేద, మధ్యతరగతి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థిక స్థిరత్వం, సామాజిక సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే సామాన్యుడి జీవితం మరింత కష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

కోలాహలం రామ్‌కిశోర్
98493 28496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News