దేశంలో ఇప్పటికీ దాదాపు డజన్‌కు పైగా రహస్య ఏజెంట్లు వివిధ ప్రాంతాలలో పట్టుబడ్డారు. పాకిస్థాన్‌కు కీలక సైనిక రహస్య సమాచారం చేరవేతల అభియోగాలతో , ఇంటలిజెన్స్ వర్గాల నిఘాలో పట్టుబడ్డ డారిలో ట్రావెటర్ యూట్యూబర్ జ్యోతి, ఇతరులు అనేకులు ఇప్పటివరకూ అరెస్టు అయ్యి ఇంటరాగేషన్‌లను ఎదుర్కొంటున్నారు. పాకిస్థాన్ ఇరుగుపొరుగు రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వారే ఈ పట్టుబడ్డవారిలో ఉన్నారని అధికారిక ప్రకటనలతో వెల్లడైంది. పహల్గాం ఉగ్రదాడి, తరువాత ఆపరేషన్ సిందూర దశల్లో ఇంటలిజెన్స్ వర్గాల నిఘాలో ఏజెంట్లను అరెస్టు చేశారు. పంజాబ్‌నుంచి ఆరుగురు, హర్యానా నుంచి ఐదుగురు , యుపి నుంచి ఒక్కరు పట్టుబడ్డారు. పలు రకాలుగా పొరుగుదేశం ప్రోద్బలాలకు లొంగి వీరు రహస్య సమాచారం తెలియచేసినట్లు,
కొందరు తాము ఏమి చేస్తున్నామనేది తెలియని దశలో ఏజెంట్లుగా మారినట్లు వెల్లడైంది. పాకిస్థాన్ ఇంటలిజెన్‌స ఆపరేటివ్స్ (పిఐఒ)లకు కీలక సమాచారం వెల్లడించడం వీరి డ్యూటీగా మారింది. పూర్తి స్థాయి దర్యాప్తుల తరువాత ఈ డజన్ మంది ఏ మేరకు సమాచారం ఏ స్థాయిల్లో లోగుట్టు అందించారనేది వెల్లడి కానుంది. ప్రత్యేకించి పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ఆపరేషన్ క్రమంలోనే భారతీయులు అనేకులు పాక్ ఏజెంట్లు అయినట్లు తెలిసింది. ఎక్కువగా భారత భద్రతా సంస్థలతో సంబంధాలు ఉన్న యువతను విద్యాధికులను నిరుద్యోగులను ఎంచుకుని వారికి భారీ స్థాయి ధనం , ఇతరత్రా విలాసాలకు అలవాటు చేసి ఈ విషవలయంలోకి దింపినట్లు గుర్తించారు.