Sunday, August 24, 2025

బీహార్‌లో ఇండియా కూటమిదే గెలుపు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

అరేరియా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఇండియా కూటమి పార్టీలన్ని కలిసికట్టుగా పనిచేస్తున్నాయని.. ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటాయని.. ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన బీహార్‌లోని అరేరియాలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్ తోపాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎన్నికలకు ప్రతిపక్ష కూటమి ఉమ్మడి మేనిఫెస్టోతో పోటీ చేస్తుంది దీనిని ఇప్పుడు రూపొందిస్తున్నామని, అధికార బిజెపి కూటమి ఓటమి ఇండియా కూటమి లక్షం అని, బీహార్‌లో అధికార పక్షం గద్దెదిగడం ప్రజల ఆకాంక్ష. ఇది అనివార్యం అవుతుందన్నారు.

ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ సర్ వివాదాస్పదం అయింది. ఇండియా కూటమి సంఘటిత బలానికి బీహార్ వేదిక అవుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలన్ని సిద్ధాంతపరంగా, రాజకీయంగా ఏకాభిప్రాయంతో ఉన్నాయి. పరస్పర ఆదరణ, గౌరవంతో సాగుతూ ఆశించిన సత్ఫలితాలు సాధించడం జరుగుతుందని చెప్పారు. బీహార్‌లో చేపట్టిన సర్ పూర్తి స్థాయిలో ఓట్ల చోరీ వ్యవహారం అయింది. ఎన్నికల సంఘం వ్యవస్థాగతంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంది. అధికార బిజెపి అధికారం నిలబెట్టేందుకు తన వంతు పాత్ర పోషించిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ మరో మారు ఆరోపించారు. అయితే బిజెపిపై ప్రేమతో ఇసి సాగించే ఆగడాలకు తాము అడ్డుకట్ట కడుతామని, అందుకే ప్రజలలో చైతన్యం కోసం యాత్ర చేపట్టినట్లు వివరించారు.

తప్పు చేయడమే కాకండా, తాము తప్పులు ఎత్తి చూపినప్పుడల్లా ఎన్నికల సంఘం ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతోందని విమర్శించారు. వేర్వేరు ధర్మాలను పాటిస్తున్న ఎన్నికల సంఘం తన సహజమైన నిష్పక్షపాత ధోరణిని వీడితే ప్రజాస్వామ్యయుత ఎన్నికల పరిస్థితి ఏమిటని రాహుల్ ప్రశ్నించారు. బీహార్ ఎన్నికలకు ఇండియా కూటమి తరఫున ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్‌ను ప్రకటిస్తారా? అనే ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వలేదు. తామంతా ఒక్కటే అని,ముందుగా ఓట్ల చోరీకి అడ్డుకట్ట వేయాల్సి ఉందని చెప్పారు. విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేత దీపాంకర్ భట్టాచార్య, ముఖేష్ సైనీ ఇతరులతో పాటు కర్నాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News