ప్రతి తరానికీ ఒక చరిత్ర ఉంటుంది. కొన్ని చరిత్రలు కాలగతిలో మిగిలిపోతాయి, మరికొన్ని తరతరాలకూ మార్గదర్శకంగా నిలుస్తాయి. 2025 జులై నెలలో 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ సాధించిన విజయం భారత చెస్ చరిత్రను తిరగరాసింది. ఫిడే మహిళల ప్రపంచ కప్‌ను గెలిచి, ఆమె కేవలం క్రీడాకారిణిగా కాకుండా, భారత మహిళా చెస్‌కు ఓ కొత్త శకాన్ని లిఖించిన నేతగా నిలిచారు. ఈ విజయం కేవలం ఒక స్పోర్ట్ టైటిల్ కాదు. ఇది ఒక దేశం పట్ల, ఒక కల పట్ల, తనపై ఉన్న విశ్వాసం పట్ల ఇచ్చిన సమాధానం. దివ్య దేశ్‌ముఖ్ కథ ఒక వ్యక్తిగత గాథ కాదు. ఇది లక్షలాది యువతిలో వెలిగే ఆశకు రూపం. చెస్ గేమ్ మౌనంగా సాగుతుంది. ఆ బోర్డు మీద శబ్దం ఉండదు.
కానీ ఆ మౌనంలో మారుతున్న గేమ్ ప్లాన్‌లు, మెదడు చురుకుదనం అంతటా కొట్టిపడతాయి. దివ్య దేశ్‌ముఖ్ గెలుపు కూడా అలాంటిదే. బయటకు మామూలుగా అనిపించొచ్చు. కానీ ఆమె చేసినది ఒక బలమైన, అద్భుతమైన ప్రయత్నం. తన ప్రత్యర్థి, భారత చెస్ చరిత్రలో అత్యున్నత స్థాయిలో ఉన్న గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి. అంతటి అనుభవాన్ని, స్థిరతను ఎదుర్కొని, పలు రౌండ్ల తర్వాత ఫైనల్లో టై-బ్రేక్ గేమ్‌లో గెలిచి, దివ్య ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. ఇది మామూలు విజయం కాదు. ఇది ఒక తిరుగుబాటు.
వయస్సుతో సంబంధం లేకుండా పట్టుదల ఎంత బలంగా ఉంటుందో నిరూపించిన ఘట్టం. పిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందడం ఎవరికైనా సాధ్యపడదు. దివ్య దేశ్‌ముఖ్ కథలో గణాంకాలు ఎంతో చెప్పగలవు. 7 ఏళ్ల వయసులో ఫిడే రేటింగ్ ప్రారంభం, 13 ఏట వుమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్, 15 ఏట వుమెన్ గ్రాండ్ మాస్టర్, 2025లో ప్రపంచ కప్ విజయం, గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధన. కానీ ఈ గణాంకాల వెనుక ఉన్న కన్నీళ్లు, కడుపు మంట, కలపై ఉన్న నమ్మకం చెప్పడానికి సంఖ్యలు చాలవు. ఆమె కథ మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టే ప్రతీ సాధారణ పిల్లవాడి కథ. పాఠశాల ముగిసిన వెంటనే చెస్ బోర్డు ముందు గంటల తరబడి కూర్చునే జీవితం.
ఓటమి అన్నప్పుడు కన్నీళ్లు తడిపే గడ్డ. విజయం దగ్గర లోపాలు కనిపించి మరింతగా శ్రమించాల్సిన స్థితి. తల్లిదండ్రుల త్యాగం – ఆర్థికంగా, మానసికంగా ఇవన్నీ కలిసే గమ్యం సాధ్యమైంది. చెస్ బోర్డు మీద ఆమె వేసిన ఒక్కో ఎత్తుగడ ఆమె అంతర్గత విశ్లేషణకు, వ్యూహం బలానికి నిదర్శనాలు. ఫైనల్లో ప్రత్యర్థి ఒక దిగ్గజం అయినా, దివ్య భయపడలేదు. ఆమె ఆటలో దూకుడు ఉన్నా, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. సూటిగా, ఒత్తిడిని అవకాశంగా మలచుకునే తత్వాన్ని చూసినప్పుడు ఆమె గురువు శ్రీనాథ్ ఎందుకు ‘ధోనీ తరహా క్లచ్ ప్లేయర్’ అన్నారో అర్థమవుతుంది. ఈ ఒక్క గెలుపు చెస్ బోర్డు వరకు పరిమితం కాదు. ఇది భారత మహిళా క్రీడాకారిణుల అభివృద్ధికి ఉదాహరణగా, తరతరాల ఆశలలో సరికొత్త పుటగా, సామాజిక అడ్డంకులను చెరిపేసే నిదర్శనంగా మారుతుంది.
భారతదేశంలో చెస్‌కు ప్రాచీన చరిత్ర ఉంది. కానీ మహిళల రంగం లో ఒక పరిమిత స్థాయివరకు మాత్రమే విజయాలు నమోదయ్యాయి. కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి వంటి పేర్లు ఒక తరం ఆకర్షణగా నిలిచినా, ఇప్పుడు దివ్య దేశ్‌ముఖ్ వంటి యువతరపు ప్రతిభ కొత్త శక్తిగా మారుతోంది. ఇది సామర్థ్యాన్ని గుర్తించే సమాజానికి సంకేతం. ఈ గెలుపు ద్వారా మాత్రమే కాకుండా, దివ్య చూపించిన క్రమశిక్షణ, ఒత్తిడిని ఎదుర్కొనే తత్వం, టెక్నికల్ లోతు -ఇవన్నీ ఇప్పుడు భారత మహిళల చెస్‌కు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. ఇది వ్యక్తిగత గెలుపును సామూహిక విజయంగా మార్చే అవకాశం. ఇలాంటి అద్భుత గెలుపును ప్రభుత్వాలు, కార్పొరేట్ రంగాలు మరింత శ్రద్ధగా పరిశీలించాల్సిన సందర్భాలు.
ఒక యువతి అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గర్వించేలా చేయగలగడం అంటే, అది వ్యక్తిగత ప్రతిభ మాత్రమే కాదు. మరింత మంది దివ్యల కోసం ప్రణాళికలు, పెట్టుబడులు, శిక్షణ కేంద్రాలు, స్పాన్సర్ షిప్‌లు ఇప్పుడే మొదలుకావాలి. దివ్య దేశ్‌ముఖ్ విజయం ఆటలోనే కాదు, క్రీడా మౌలిక వసతులలో పెట్టుబడి పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేసే ఘట్టం. దివ్య దేశ్‌ముఖ్ గెలుపు మనం గర్వపడాల్సిన విషయం మాత్రమే కాదు. మనం ఆలోచించాల్సిన విజయం. ఏ సాధనా వృథా కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పట్టుదల ఉంటే అసాధ్యం అనే మాటే ఉండదని ఆమె నిరూపించారు. ఆమె విజయగాథ తెల్లబోర్డుపై నల్లపావులతో నడిచిన తత్వజ్ఞాన పాఠం. అటువంటి ప్రేరణలు ఒక్కొక్కసారి దేశం దిశను మారుస్తాయి. మన కళ్ల ముందే మారుతున్న భారత చెస్ చరిత్రలో, దివ్య దేశ్‌ముఖ్ పేరు ప్రేరణ పుస్తకాల్లో తప్పకుండా ఉంటుంది.
డివిబి శ్రీహరిన్
94945 88909