న్యూఢిల్లీ: పాకిస్తాన్, భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ఆపకపోతే తగిన సమాధానం ఇస్తూనే ఉంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం స్పష్టం చేసింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత నెలకొన్న పరిస్థితులపై విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు సంయుక్త ప్రెస్‌మీట్ నిర్వహించాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. భారత్‌లోని పలు ప్రాంతాలను పాకిస్తాన్ టార్గెట్ చేసిందని.. ఉత్తర, పశ్చిమ భారత్‌లోని 15 ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించిందని.. కానీ, పాక్ దాడులను తిప్పికొట్టామని చెప్పారు.
అవంతిపొరా, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తల, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగడ్ఎం నాల్, ఫలోడి, భుజ్‌లలో పాక్ సైన్యం దాడులకు ప్రయత్నించిందని.. పాకిస్తాన్ డ్రోన్స్, మిస్సైళ్లను న్యూట్రలైజ్ చేశామని తెలిపారు. శకలాలు పాక్ సైన్యానికి చెందినవే అని తేలిందని, పాకిస్తాన్ మిస్సైళ్లను కూల్చేశామని.. అంతేకాదు, లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేశామని ఆయన వెల్లడించారు.