పహల్గాం ఘటన అనంతరం పాకిస్తాన్ భరతం పట్టేందుకు, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశం వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు భారత్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, పాక్‌తో వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను తెగతెంపులు చేసుకోవడం, దేశంలో తిష్ఠవేసిన పాకిస్తానీయులను వెనక్కి పంపించడం వంటి చర్యలు చేపడుతూనే దాయాది దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఒకవిధంగా పాకిస్తాన్‌ను అష్టదిగ్బంధం చేసేందుకు పావులు కదుపుతోంది. విదేశాలకు ప్రతినిధి (India Diplomat) బృందాలను పంపించాలని నిర్ణయించడం అందులో భాగమే. వివిధ దేశాలలో ప్రభుత్వాధినేతలను కలసి, ఆపరేషన్ సిందూర్ గురించి వివరించడంతోపాటు ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ నిర్వాకాన్ని వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది.
సుమారు ఎనిమిదిమంది చొప్పున సభ్యులుగల ఈ బృందాలు ఆయా దేశాల రాజధానులకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఒక విధంగా ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడంతోపాటు పాక్‌ని ఏకాకిని చేయడం ఈ వ్యూహంలో భాగం. అయితే, అఖిలపక్ష ప్రతినిధి బృందాల రూపకల్పన వివాదాస్పదం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతినిధి బృందాలలో ఒక దానికి తమ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌ను ఎంపిక చేయడం కాంగ్రెస్‌కు కంటగింపుగా మారింది. వాస్తవానికి విదేశాలకు పంపే ప్రతినిధి బృందాలకోసం పార్టీ నేతల పేర్లు ఇవ్వాలన్న కేంద్రం కోరికపై కాంగ్రెస్ ఎంపిక చేసిన నలుగురిలో శశిథరూర్ పేరు లేదు. ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నసీర్ హుసేన్, అమరీందర్ రజా పేర్లను కాంగ్రెస్ ఇవ్వగా, ఆనంద్ శర్మ ఒక్కరినే పరిగణనలోకి తీసుకున్న కేంద్రం, మిగిలిన ముగ్గురినీ తన ఇచ్ఛమేరకే ఎంపిక చేసింది.
దీనినిబట్టి కేంద్రం ముందుగానే పేర్లను నిర్ణయించుకుని, కంటితుడుపుగా తమను పేర్లు అడిగినట్లు స్పష్టమవుతోందన్న కాంగ్రెస్ విమర్శలో హేతుబద్ధత లేకపోలేదు. అదే సమయంలో ఉత్తమ పార్లమెంటేరియన్ గా, చక్కటి వాగ్ధాటి కలిగిన నేతగా, అంతర్జాతీయ వేదికలపై భారత్ తరఫున తడుముకోకుండా మాట్లాడే తిరుగులేని వక్తగా పేరొందిన శశిథరూర్ పేరును కాంగ్రెస్ ఎందుకు ప్రతిపాదించలేదు? దీనికి కారణాలు లేకపోలేదు. గత కొంతకాలంగా శశిథరూర్ కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా ఉంటూ, బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ సమర్ధుడైన నేత అని, ఆయన నాయకత్వం దేశానికి అవసరమని శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు సహజంగానే కాంగ్రెస్‌కు ఆగ్రహం తెప్పించాయి. దానికితోడు ఇటీవల తిరువనంతపురంలో జరిగిన విజింజం ఓడరేపు ప్రారంభోత్సవ(India Diplomat) కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఒకే వేదికపై తాను, శశిథరూర్ పాల్గొనడాన్ని చూసిన కొందరు కాంగ్రెస్ నేతలకు ఇక నిద్రపట్టదంటూ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి.
ఈ వివాదాలు ఎలా ఉన్నా, అంతర్జాతీయ స్థాయిలో భారత్ వైఖరిని విప్పిచెప్పేందుకు వెళ్లే ప్రతినిధి బృందాలకు దీటైన నేతలను పంపించడం ఆయా పార్టీల బాధ్యత. వాస్తవానికి కాంగ్రెస్ ప్రతిపాదించిన నేతలందరూ సమర్థులే అయినా, వారందరూ సీనియర్ రాజకీయ నేత, రచయిత, మాజీ దౌత్యవేత్త అయిన శశిథరూర్ తరువాతేనని చెప్పవచ్చు. ఆయన ప్రస్తుతం విదేశీ వ్యవహారాల కమిటీకి చైర్మన్ గానూ వ్యవహరిస్తున్నారు. గతంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీ పడ్డారనే సంగతి విస్మరించకూడదు. బిజెపి శశిథరూర్‌ను ఎంపిక చేయడం ద్వారా స్వామికార్యంతోపాటు స్వకార్యాన్ని కూడా నెరవేర్చుకోగా, కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా మారింది.
శశిథరూర్ లాంటి ప్రతిభావంతుడిని ఎంపిక చేయకపోవడానికి సరైన కారణాలు చెప్పలేని స్థితిలో ఆ పార్టీ కేంద్రం వైఖరిని తూలనాడటమే పనిగా పెట్టుకుంది. అదే సమయంలో కాంగ్రెస్‌లో ఉండటం వేరు, కాంగ్రెస్‌తో ఉండటం వేరు అంటూ శశిథరూర్‌ను ఉద్దేశించి పార్టీ వ్యాఖ్యలు వాస్తవంగా తోస్తాయి. శశిథరూర్ కాంగ్రెస్‌లో ఉంటూ ఎన్నో పదవులు పొందారు. ఇప్పటికీ పార్టీలో ఆయన కీలకమైన అగ్రనేతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తి పార్టీ మారాలని అనుకుంటే, ముసుగులో గుద్దులాటలు దేనికి? హుందాగా తన పదవికి రాజీనామా చేసి, కమలనాథుల పంచన చేరితే కాదనేవారెవరు? దేశప్రతిష్ఠను ఇనుమడింపజేసేందుకు ఉద్దేశించిన అఖిలపక్ష బృందాల ఎంపిక విషయంలో రాజకీయ విభేదాలు, స్వార్థ ప్రయోజనాలు తెరపైకి రావడం గర్హనీయం.