ఎంపిల బృందాల ఖరారు
శశి థరూర్‌కు కీలక స్థానం
డిఎంకె నుంచి కనిమొళి
రాహుల్ పేర్లు బుట్టదాఖలు
ఎన్‌సిపి ఎంపి సుప్రియా పూలే
మజ్లిస్ పార్టీ నుంచి అసదుద్దిన్ ఒవైసీ
ఉగ్రవాదంపై జాతి తరఫున సంఘటిత పోరు
అన్పి పక్షాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గళం
న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర తరువాతి క్రమంలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బహుళ పార్టీల ఎంపిల ప్రతినిధి బృందంలో పేర్లు ఖరారయ్యాయి. పాకిస్థాన్ ఉగ్ర చర్యలను అనేక దేశాలకు వివరించడం, అంతర్జాతీయ వేదికలపై పాక్‌ను ఎండగట్టేందుకు భారత ప్రభుత్వం ఈ బృందాలను వచ్చే వారం నుంచి పంపిస్తోంది. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ తరఫున శశి థరూర్, డిఎంకె నుంచి కనిమొళి ఉంటారు.
అధికార పార్టీ బిజెపి నుంచి రవిశంకర ప్రసాద్, సంజయ్ ఝా ప్రాతినిధ్యం వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద చర్యల పాకిస్థాన్‌ను అన్ని విధాలుగా దెబ్బతీసే క్రమంలో చేపట్టిన దౌత్యస్థాయి పర్యటనలలో మొత్తం ఏడు ప్రధాన రాజకీయ పార్టీలకు చోటు కల్పించారు. పాక్‌ను ఏకాకి చేసేందుకు కేంద్రం చేపట్టే ఎటువంటి చర్యకు అయినా తమ వైపు నుంచి మద్దతు ఉంటుందని, జాతీయ భద్రతా కోణం పరిగణనలోకి తీసుకుంటామని విపక్ష నేతలు ఇప్పటికే ప్రకటించారు. బృందాలలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని ఏ స్థాయిలో ఉన్నా పూర్తి స్థాయిలో ఏరివేయాలనే పాలసీని భారత ప్రభుత్వం పాటిస్తుందని ఇప్పటికే మోడీ తెలిపారు.
పలు పార్టీల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంపిలను ఎంపిక చేసింది. ఎన్‌సిపి శరద్ పవార్ వర్గం నుంచి సుప్రియా సూలే, బిజెపి నుంచి బైజయంత్ జె పాండా, శివసేన తరఫున శ్రీకాంత్ షిండే బృందాలలో ఉంటారు. ఉగ్రవాదం ఏరివేతకు భారతదేశం జాతీయ స్థాయిలో పూర్తి ఏకాభిప్రాయంతో వ్యవహరించింది. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా స్పందన ఉంటుందని , బృందాల ఎంపిక ఇతర వివరాలను ఓ ప్రకటనలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది.నిర్థిష్ట రీతిలో మాట్లాడగలిగే వారు. దేశ సమగ్ర విధానాన్ని వేదికల ద్వారా చాటి చెప్పగలిగే వారిని గమనించి వడబోతల తరువాత బృందాల్లోకి తీసుకున్నారని వెల్లడించారు. ఇక ప్రతినిధి బృందంలో అధికార ఎన్‌డిఎ నుంచి నలుగురు, ఇండియా కూటమి నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పార్టీల ఎంపిలే కాకుండా ఈ టీంలలో ప్రముఖ దౌత్యవేత్తలు కూడా ఉంటారు. అత్యంత కీలక విషయాలు , ప్రత్యేకించి జాతీయ భద్రతా , సమగ్రత సమైక్యత వంటి విషయాలలో భారత్ అంతా కలిసికట్టుగా ఉంటుంది. ఉగ్రవాద వ్యతిరేక సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా బలీయంగా ప్రకటిస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ స్పందించారు. విభేదాలకు తావు లేని రీతిలో రాజకీయాలకు , పార్టీల విధానాలకు అతీతంగా ఇప్పుడు మరో సారి జాతీయ ఐక్యత ప్రతిఫలించిందని తమ మంత్రిత్వశాఖ తరఫు ప్రకటనను మంత్రి వెలువరించారు. ఈ ప్రతినిధి బృందాలు సౌదీ అరేబియా, కువైట్, బహరైన్, అల్జీరియా ఒమన్, కెన్యా , దక్షిణాఫ్రికా , ఈజిప్టులలో పర్యటిస్తాయి.ఇక మరో బృందం జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా , మలేసియా, ఇండోనేసియాలకు వెళ్లుతుంది. ప్రతినిధిబృందాలలో హైదరాబాద్‌ఎంపి అసదుద్దిన్ ఒవైసి, రాజీవ్ ప్రతాప్ రూడీ, మనిష్ తివారీ, అనురాగ్ ఠాకూర్ వంటి పలువురు ఎంపిలు కూడా ఉంటారు.
ఏ దేశం వెళ్లినా ఈ బృందం ద్వారా వెలిబుచ్చే సందేశాలు , పలువురు నేతలతో వారి చర్చలు, ప్రజలతో మమేకం కావడం వంటి విషయాలను ప్రపంచ వ్యాప్తంగా బలీయరీతిలో విన్పించేందుకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూనే , అంతర్జాతీయ ఆర్థిక , ద్రవ్య సంస్థల నుంచి భారీ స్థాయిలో సాయం తీసుకునేందుకు పాకిస్థాన్ పలు రకాలుగా దౌత్య యత్నాలకు దిగడం , ఐఎంఎఫ్ నుంచి ఇప్పటికే పాకిస్థాన్‌కు భారీ స్థాయి ఆర్థిక సాయం అందిన దశలో దీనిని అడ్డుకునేందుకు ఇప్పుడు ఈ భారతీయ ప్రతినిధి బృందాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా పాకిస్థాన్ కీలక పాత్ర పలు సందర్భాల్లో రుజువు అయిన దశలో ఇప్పటికీ ఈ దేశానికి భారీ స్థాయి నిధులు అందడం చివరికి మనకు మనమే ఉగ్రవాద గోతిలో పడటమే అవుతుందని భారత దౌత్య వర్గాలు ఇప్పటికే అంతర్జాతీయ వేదికల్లో చాటిచెపుతున్నాయి.
అనారోగ్యం ..బృందంలో చేరలేను
కొందరు ఎంపిల వెల్లడి
కేంద్రం తలపెట్టిన ఎంపిల దౌత్య ప్రతినిధి బృందంలో తాను చేరలేనని టిఎంసిఎంపి సుదీప్ బందోపాధ్యాయ శనివారం తెలిపారు. అనారోగ్య కారణాలతో తాను ఇందులో చేరేందుకు వీలు లేదని ఈ ఎంపి వివరణ ఇచ్చారు. తనకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ ఫోన్ చేశారని, అయితే తాను రాలేకపోతున్నానని తెలిపానని చెప్పారు.