జమ్మూ : భారత్ ఇప్పుడు జపాన్‌ను దాటేసి , నాలుగో ఆర్థిక శక్తివంత దేశం అయిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఆదివారం జమ్మూకు వచ్చిన ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోడీ 11 సంవత్సరాల పాలనలో సాధించిన సత్ఫలితాలు, సాగిన ప్రగతి ప్రతిఫలంగానే ఇప్పుడు భారత్ ఈ విశిష్టతను సాధించామని మంత్రి తెలిపారు. జాతికి ఇంతటి ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత ఆయనదే అన్నారు.
నీతి ఆయోగ్ నివేదిక క్రమంలో భారత్ ప్రగతి పథం గురించి ప్రపంచానికి తెలిసింది. మన రక్షణ వ్యవస్థను మనం తీర్చిదిద్దుకున్నామని , 2014లో అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితితో పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్షం భారత్‌కు కీలకం అని , ఈ దిశలోనే మనం ముందుకు సాగుతున్నామని , ఇప్పుడు మనం సంపాదించుకున్న 4వ ర్యాంకుతో తేటతెల్లం అయిందని మంత్రి విశ్లేషించారు.
నీతి ఆయోగ్ సిఇఒ సుబ్రహమణ్యం వెలువరించిన నివేదికలోని అంశాలు భారతీయులందరికీ సంతోషదాయకం అన్నారు. అన్నింటికి ముందు ఈ శుభవార్త పట్ల తాను ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి అయిన జితేంద్ర సింగ్ చెప్పారు.