మాల్దీవులకు భారతదేశం రూ 4850 కోట్ల రుణం ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ మాల్దీవుల పర్యటనకు శుక్రవారం వచ్చారు. వెసులుబాట్లతో కూడిన రుణసాయాన్ని వెలువరించారు. మాల్దీవులకు భారతదేశం చిరకాల విశ్వసనీయ స్నేహపక్షంగా నిలబడటం భారత్‌కు గర్వకారణం అని ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తెలిపారు. ఇరుదేశాల మధ్య స్పల్ప కాలిక క్లిష్టత తరువాత ప్రధాని మోడీ ఇక్కడికి రావడం ఇరుదేశాల మధ్య వెనుకటి సానుకూలత దిశలో ముందడుగు అయింది. భారత ప్రధాని మోడీ తమ బ్రిటన్ పర్యటన ముగించుకుని ఇక్కడికి చేరారు. ఆయన ఇక్కడ దేశాధ్యక్షులు మెహమ్మద్ ముయిజూతో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వ్యాపార వాణిజ్య , మౌలిక వసతులు కల్పన వంటి కీలక రంగాల్లో ఇరుదేశాల మధ్య పటిష్ట బంధానికి దారితీసేలా ఇరువురి నేతల చర్చలు జరిగాయి.
త్వరలోనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఖరారు అయ్యేందుకు వీలుందని, ఈ దిశలో చర్చలు జరుగుతాయని ప్రధాని మోడీ తెలిపారు. భారతదేశం అనుసరించే ఇరుగుపొరుగులకు ప్రాధాన్యత విధానం, ప్రాంతీయ పరస్పర కట్టుబాట్ల ప్రగతి, భద్రతల మహాసాగర్ వైఖరికి అనుగుణంగా మాల్దీవుల పట్ల భారత్‌కు కీలక స్థానం ఉందని ప్రధాని తెలిపారు. రక్షణ, భద్రత రంగంలో పరస్పర సహకారం ద్వైపాక్షిక విశ్వాసానికి గీటురాయి అవుతుందని చెప్పారు. అధ్యక్షులు ముయిజూ అధికారం చేపట్టిన దశలో ముందుగా చైనా అనుకూల వైఖరి ప్రదర్శించారు. భారత్‌పై ఆంక్షలకు యత్నించారు. అయితే తరువాతి దశలో తలెత్తిన మార్పు ఇప్పుడు మోడీ పర్యటనతో విస్తృతం అయింది. ప్రధాని మోడీ ఇక్కడికి చేరుకోగానే ప్రెసిడెంట్ ముయిజూ , ఆయన ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయనకు ఇక్కడి వెలెనా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆకర్షణీయమైన సాంప్రదాయక స్వాగతం తరువాత రిపబ్లిక్ స్వేర్ వద్ద గౌరవ సైనిక కవాతు జరిగింది.