న్యూఢిల్లీ: అణుయుద్ధంగా మారుతుందని ట్రంప్ చెప్పిన మాటలను భారత్ కొట్టిపారేసింది. పూర్తి సంప్రదాయ రీతిలోనే భారత సైనిక చర్య జరిగిందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) అన్నారు. పాక్ నేషనల్ కమాండ్ అథారిటీ 10న భేటీ అవుతుందని వార్తలు వచ్చాయని.. కానీ ఎలాంటి సమావేశం జరగలేదని పాక్ విదేశాంగ మంత్రి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సైనిక చర్యలో అణు కోణం లేదని పాక్ విదేశాంగ మంత్రే ఖండించారని ఆయన అన్నారు. భారత్‌తో ప్రపంచ దేశాలు జరిపిన సంప్రదింపుల్లో మన వైఖరి స్పష్టం చేశామని తెలిపారు. అణ్వాయుధ బూచితో ఉగ్రవాదాన్ని పెంచడానికి అంగీకరించబోమని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఈ బెదిరింపులకు తలొగ్గితే మీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి వస్తుందని చెప్పామన్నారు. భారత్‌ను.. ఉగ్రవాద(Terrorism) బాధితురాలిగా ప్రపంచం గుర్తించిందని తెలిపారు. పహల్గాం దాడితో పాక్‌ను ఉగ్రవాద మద్దతు దేశంగా ప్రపంచం గుర్తించిందని అన్నారు. పహల్గాం దాడి తర్వాత ప్రపంచదేశాల దీన్ని ధృవీకరించారని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్‌కు సంపూర్ణ హక్కు ఉందన్నారు.
భారత్ దాడుల తర్వాత పాక్ కుదేలైంది
పాక్ పెంచిన ఉగ్రవాదం అన్ని దేశాల్లోని అమాయకులను బలితీసుకుందని రణధీర్(Randhir Jaiswal) అన్నారు. ‘‘ఆపరేషన్ సింధూర్ తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగానే చర్చలు. ముజఫరాబాద్, బహావల్‌పూర్, మురిద్కేల్లో ఉగ్రస్థావరాలు(Terrorism) నేలమట్టం చేశాం. పాక్ సైనిక సామర్థ్యాన్ని భారత్ నిర్వీర్యం చేసింది. పాక్‌లోని ప్రధాన వైమానిక స్థావరాలను వాడలేని పరిస్థితి కల్పించాం. పాక్.. ఈ వైఫల్యాలను విజయాలుగా చెప్పాలనుకుంటే స్వాగతిస్తున్నాం. కాల్పుల విరమణకు ఎవరు ఎవరికి ఫోన్ చేశారనేది ప్రపంచం గుర్తించింది. ఈ నెల 9 రాత్రి వరకు భారీగా దాడులు చేస్తామని పాక్ బెదిరించింది. ఈ నెల 10న ఉదయం భారత్ చేసిన దాడులతో పాక్ సైన్యం బిక్కచచ్చిపోయింది. భారత్ చేసిన దాడుల తర్వాత పాక్ స్వరంలో మార్పు వచ్చింది. కాల్పుల విరమణ అవగాహనకు పాక్ డిజిఎంవొ ముందుకొచ్చారు. అప్పటికీ, ఇప్పటికీ.. భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. మార్పు వచ్చింది పాక్‌లోనే పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం చేశాక పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. ఇవన్నీ చూస్తే.. కాల్పుల విరమణ ప్రతిపాదన గురించి చెప్పనవసరం లేదు. ఉపగ్రహ చిత్రాలు ఇప్పుడందరికీ అందుబాటులో ఉన్నాయి. పాక్ అబద్ధపు ప్రచారం వెనుక వాస్తవ పరిస్థితి అందరూ చూడవచ్చు. భారత్ దాడులతో పాక్ ఎలా కుదేలైందో పరిశీలించవచ్చు’’ అని పేర్కొన్నారు.