Thursday, May 8, 2025

యుద్ధమే పరిష్కారమా?

- Advertisement -
- Advertisement -

ఇరవై అయిదు మంది పర్యాటకులతో సహా 26 మంది అమాయకులను బలిగొన్న పహల్గాం ఉగ్రదాడి మొత్తం దేశంలో ఆగ్రవేశాలను కలిగిస్తున్నది. 2019లో ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదానికి ముగింపు పలికినట్లే అంటూ భారత ప్రభుత్వం ఇప్పటి వరకు చేస్తున్న ప్రచారం భగ్నం కావడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ఉగ్రవాద ముప్పు లేదని, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని ప్రపంచం ముందు ఉంచిన చిత్రం భగ్నం కావడంతో ప్రభుత్వం అచేతనంగా నిలబడిపోయింది. ఈ సందర్భంగా ఇటు భారత్‌లో, అటు పాకిస్థాన్‌లో యుద్ధం మేఘాలు ఆవహిస్తున్నాయి. ఎప్పుడైనా యుద్ధం ప్రారంభం కావచ్చనే ఉద్రిక్త పరిస్థితులు కల్పించేందుకు రెండు దేశాల ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాయి.

అయితే, తమ పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ విధంగా చేస్తున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉగ్రదాడికి దారితీసిన పరిస్థితులను లోతుగా పరిశీలించి, బాధ్యులపై ఎటువంటి చర్యకు ఉపక్రమించే సాహసం మోడీ ప్రభుత్వం చేయడం లేదు. పాకిస్థాన్‌తో యుద్ధానికి దిగడమే సమాధానంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నది. మరోవంక, దేశ ప్రజలు సైతం గతంలో బాలకోట్, సర్జికల్ స్ట్రైక్ వంటి ఘటనలతో ప్రధాని నరేంద్ర మోడీని ఆధునిక జేమ్స్ బాండ్‌వలే జరిపిన ప్రచారానికి ప్రభావితమై ఇప్పుడు కూడా మరేదో అద్భుతం చేయబోతున్నారనే ఆశతో ఎదురు చూస్తున్నారు. అంతేగాని ఈ ఉగ్రదాడిలో బహిర్గతమైన ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ పక్షాల దివాలాకోరు విధానాలను గమనించలేకపోతున్నారు.

ఉగ్రదాడిలో చనిపోయిన వారిపట్ల మనందరికీ సానుభూతి కలుగుతున్నది. వారి కుటుంబాల పట్ల ఆవేదన వ్యక్తం అవుతున్నది. అయితే, కేవలం నలుగురు ఉగ్రవాదులు వచ్చి ఎదురుగా మతం అడుగుతూ కాల్పులు జరుపుతుంటే ఒక్కరు కూడా ఎదిరించే ప్రయత్నం చేయలేదు. కనీసం ఆ తుపాకీ గుండ్ల నుండి తప్పించుకొనే ప్రయత్నం చేయలేదు. ఒక్కరైనా ఎదురు తిరిగి, ఒక తుపాకిని లాక్కునే ప్రయత్నం చేసినా మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులు పారిపోయి ఉండేవారు. ఇంతమంది చనిపోయేవారు కాదు. అంటే జమ్మూకశ్మీర్ వంటి సున్నిత ప్రాంతాలకు వెళ్లే ప్రజలను ఉగ్రవాదం ఎదుర్కొనే విధంగా సంసిద్ధులను చేయకుండా, అంతా ప్రశాంతంగా ఉందనే మాయమాటలతో ప్రభుత్వం వారిని వంచనకు గురిచేసిందా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. పైగా, 26 మందిలో 20 మంది ఉగ్రవాదులు కోరగానే తమ ప్యాంట్‌లు తీసివేశారు. ఎట్లాగూ చంపుతారని తెలిసినా ఒకరు కూడా ఎదురు తిరిగే ప్రయత్నం చేయలేదు. ఉగ్రవాదులను కట్టడిచేసే ప్రయత్నం చేసింది కేవలం చనిపోయిన ఏకైక ముస్లిం వ్యక్తి కావడం గమనార్హం.

భారత ప్రజలలో ఇంతటి పిరికితనాన్ని నింపిన ఘోర అపరాధానికి మన రాజకీయ నేతలే బాధ్యులని చెప్పక తప్పదు. హిందువులను గుర్తించి ఉగ్రవాదులు చంపివేయగానే ఈ ఉగ్రదాడికి మతం రంగు పూసే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో కశ్మీర్ లోయలో మొదటిసారిగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి రావడం, నిరసనలు తెలపడం వంటి చైతన్యాన్ని గమనించలేకపోతున్నారు. ప్రజల ఆగ్రవేశాలు చూసిన తర్వాతనే దేశంలో రాజకీయ పక్షాలు అన్ని ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడం ప్రారంభించాయి. మొదటిసారిగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ ప్రత్యేక సమావేశం జరిపి ఓ తీర్మానం చేసింది. ఉగ్రదాడి జరగగానే రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టివేసి ప్రయత్నం జరిగింది. అక్కడ ఎన్నికలు జరపాలని ఆదేశించిన సుప్రీం కోర్టును తప్పుబడుతూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. భద్రతా దళాలకు తెలపకుండా పర్యాటక స్థలాన్ని తెరవడంతో ఈ ముప్పు జరిగింది అంటూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ఆర్టికల్ 370 కారణంగా ఉగ్రవాదం అదుపులోకి వచ్చిందని అమిత్ షా చేసిన ప్రచారం ఈ సందర్భంగా తీవ్రమైన హాని కలిగించిందని చెప్పవచ్చు. నిఘా వైఫల్యం అంటూ జరిగిన ప్రచారం కూడా అబద్ధమని తర్వాత తెలిసిపోయింది. మన భద్రతా దళాలు జరుపుతున్న నిర్విరామ కృషి కారణంగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం చాలా వరకు అదుపులోకి వచ్చింది. ఒక విధంగా శైవ దశలో ఉంది. అంతమాత్రం చేత ఉగ్రముప్పు పూర్తిగా నిర్మూలించామని చెప్పడం ప్రజలను వంచించడమే అవుతుంది.

2001లో ఉగ్రదాడులలో 4,000 వేల మందికిపైగా చనిపోతే ఆ సంఖ్య 2024లో 128కి తగ్గింది. అయినా కనిష్ట స్థాయి లో 121 మాత్రమే మృతి చెందిన 2012 నాటి స్థాయికి ఆ తర్వాత మనం చేరుకోలేదని గమనించాలి. వేల సంఖ్యలో ఉన్న ఉగ్రవాదుల సంఖ్య ప్రభుత్వ లెక్కల ప్రకారం 60కు తగ్గిపోయింది. అయినప్పటికీ ఐదారుగురు ఉగ్రవాదులు ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోటు దాడులు చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. స్థానికంగా కొందరి సహకారం సంపాదిస్తూనే ఉంటారు. వారు సాధారణంగా భద్రతా దళాలు సమీపంలో లేని ప్రాంతాలను ఎన్నుకుంటారు.ఈ విధంగా పహల్గాం దాడి జరిపారు. తమ ఉనికి చాటుకోవడం కోసం, ఉగ్రవాదాన్ని కశ్మీర్ లోయ నుండి లేకుండా చేశామని ప్రభుత్వ ప్రచారాన్ని కొట్టివేయడం ద్వారా ఉగ్రవాదులతో ఆత్మస్థైర్యం నింపడం కోసం ఈ విధంగా చేసి ఉండవచ్చు. అయితే, ఉగ్రవాదాన్ని యుద్ధం ద్వారా పరిష్కరింపలేం. తమ దేశంపై యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి తరచూ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఓ విధంగా యుద్ధాన్ని పాకిస్తాన్ కోరుకుంటుందనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం తమ దేశ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. విశేష ప్రజాదరణ గల ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో పెట్టి, దాదాపు ప్రతిపక్షం లేకుండా వారు దేశాన్ని పతనం వైపు తీసుకు వెడుతున్నారనే ఆగ్రవేశాలు వారిలో వ్యక్తం అవుతున్నాయి. యుద్ధం ద్వారా ప్రజలు దృష్టి మళ్లించే అవకాశం కలుగుతుంది. యుద్ధం అంటూ జరిగితే భారత్‌కు పాకిస్తాన్ సరితూగలేదనడంలో సందేహం లేదు. కానీ, ప్రస్తుత ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిస్థితులు యుద్ధానికి అనుకూలంగా లేవు. రష్యా వంటి బలమైన దేశం రెండు, మూడు వారాలలో ఉక్రెయిన్‌ను ఆక్రమించుకుంటామని యుద్ధం ప్రారంభించి మూడు ఏళ్లయినా బయటపడలేకపోవడం గమనార్హం.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ జరిపే పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయి గాని వారెవ్వరూ పాకిస్తాన్ పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని గత రెండు వారాలలో ఖండించకపోవడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ అయితే భారత్ తన స్నేహితుడు అంటూనే, పాకిస్తాన్ కూడా స్నేహితుడు అనడం గమనార్హం. కేవలం మాటల సహాయంతో ప్రయోజనం ఉండదు. క్షేత్రస్థాయిలో సహాయం చేయగల రష్యా, ఇజ్రాయిల్ రెండూ ఇప్పుడు తామే పొరుగు దేశాలలో యుద్ధాల్లో తలమునకలై ఉన్నాయి. యుద్ధం అంటూ జరిగితే మూడు వైపులా సన్నద్ధం కావాల్సి ఉంటుందని గ్రహించాలి. చైనా మనపై యుద్ధాని దిగకపోయినా తన సైనిక దళాలను సరిహద్దులకు తరలిస్తే మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. అదే విధంగా బంగ్లాదేశ్ వైపు నుండి కూడా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి సరిహద్దుల్లో జరగలేదని గమనించాలి. కాబట్టి ఇది పూర్తిగా అంతర్గత భద్రతా యంత్రాంగం వైఫల్యంగా ముందుగా గుర్తించాలి. అందుకు జమ్మూకశ్మీర్ డిజిపి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని పౌరపోలీసులు మాత్రమే బాధ్యత వహించాలి. పోలీస్ చట్టం, 1861 ప్రకారం, పోలీసుల పని నేరాలను నిరోధించడం, గుర్తించడం, శాంతిభద్రతలను కాపాడటం.

జమ్మూకశ్మీర్‌లో 64,000 మంది పోలీసు అధికారులతో పాటు బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, ఐటిబిఎఫ్ వంటి కేంద్ర దళాలు కలిపి రెండు లక్షలకు పైగా సాయుధ దళాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం సిఆర్‌పిఎఫ్ మాత్రమే ఆ ప్రాంతంలో 75 బెటాలియన్లు మోహరించింది ఒక బెటాలియన్ దాదాపు 1000 మంది పోలీసు అధికారులు, సైనికులు ఉంటారు. పర్యాటక ప్రాంతాలను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడమో, ఆ విధంగా చేయలేని పక్షంలో పర్యాటకులు పర్యటించకుండా ఆంక్షలు విధించడంతో వారు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారని స్పష్టం అవుతుంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలలో సరైన బందోబస్తు ఏర్పాట్లు చేసి, కఠినమైన పెట్రోలింగ్‌ను ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ ఉండాలి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు కొన్ని రోజులుగా ఆ ప్రాంతాలలో తిరుగుతున్నా, నిఘా సమాచారం ఉన్నా కట్టడి చేయలేకపోయారు. వారు సరిహద్దు దాటి వచ్చారు. ఆ నలుగురూ నేరుగా పాకిస్తాన్ సైనిక శిక్షణ పొందారని చెబుతున్నారు. ఇదంతా అంతర్గత భద్రతా యంత్రాంగం ప్రాథమిక వైఫల్యాన్ని సూచిస్తున్నది.నిఘా సమాచారం ఎప్పుడూ నిర్దుష్టంగా ఉండదు. అందుచేత నిఘా సమాచారం ఉన్నప్పటికీ దాడులు అడ్డుకోవడంలో భద్రతా దళాలు వైఫల్యం చెందారని చెప్పలేం. నిర్దిష్ట వ్యక్తి లేదా వ్యక్తులు, నిర్దిష్ట ప్రాంతంలో, నిర్దిష్ట రోజున దాడికి సిద్ధంగా ఉన్నాడని చెప్పినా ఆపలేని పక్షం లో వైఫల్యంగా గుర్తించాలి. కానీ, పహల్గాం విషయంలో శ్రీనగర్ పరిసరాలలో పర్యాటకులు బసచేసే హోటళ్లపై దాడి చేయవచ్చనే నిఘా సమాచారం వచ్చింది.

అందుచేత భద్రతా దళాలు పర్యాటకులు ఉండే హోటళ్లలో దాడికి కొద్ది రోజుల ముందు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా ఒక ప్రశ్నని ఓ సీనియర్ భద్రత అధికారి లేవనెత్తారు. ఒక దొంగను భారతదేశంలో పోలీసులు పట్టుకుని, అతని విచారణలో తాను మయన్మార్ లేదా థాయిలాండ్‌కు చెందినవాడినని చెప్పాడనుకుంటే, మనం ఆ రెండు దేశాలపైనే అన్ని నిందలు వేసి యుద్ధంలోకి దూకుతామా? అదేవిధంగా కశ్మీర్‌లో ఉగ్రవాదం నిర్మూలనకు అంతర్గత భద్రతలో వెల్లడవుతున్న వైఫల్యాలను సరిచేసుకునే ప్రయత్నాలను ముందుగా చేపట్టాలి. ఇప్పటికే అంతర్గత భద్రతా సమస్యలతో, ఆర్థ్ధిక సంక్షోభంతో చిక్కుకున్న పాకిస్తాన్ భారత్‌పై నేరుగా యుద్ధానికి దిగాలనుకొంటే ఆత్మహత్య సదృశ్యం కాగలదు. అటువంటి పరిస్థితులు ఏర్పడితే దీటుగా జవాబు చెప్పగల సామర్థ్యం మన సైనిక దళాలకు ఉన్నాయి. నేడు రక్షణ పరంగా ఒక విధంగా ఒంటరిగా ఉన్నామని గుర్తించాలి. మొత్తం దక్షిణ ఆసియాలో ఒక్క దేశం కూడా మనకు తోడుగా లేదు. అమెరికా వంటి దేశాలు యుద్ధభయం ఆసరాగా చేసుకొని తమ ఆయుధాలను అమ్ముకొనే ప్రయత్నమే చేస్తున్నాయి. అంతేగాని మన వ్యూహాత్మక రక్షణ అవసరాలను పట్టించుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వాస్తవిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని, అవసరమైన వ్యూహాలు, చర్యలు చేపట్టాల్సి ఉంది.

చలసాని నరేంద్ర
98495 69050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News