Sunday, August 3, 2025

సెంచరీతో ఆదుకున్న యశస్వి

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో చివరి టెస్టులో (final test) టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శనివారం మూడో రోజు ఆటలో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. 75/2తో శనివారం మూడో రోజు బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు యశస్వి జైస్వాల్, ఆకాశ్‌దీప్ అండగా నిలిచారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. వీరిని ఔట్ చేసేందుకు ఆతిథ్య టీమ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు యశస్వి అటు ఆకాశ్‌దీప్‌లు అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు ను పరిగెత్తించారు.

నైట్ వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన ఆకాశ్‌దీప్ అంచనాలకు మించి రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఆకాశ్‌దీప్ 94 బంతుల్లో 12 ఫోర్లతో 66 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీని సాధించాడు. యశస్వితో కలిసి మూడో వికెట్‌కు(Third wicket Yashasvi) 107 పరుగులు సాధించాడు. లంచ్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తర్వాత తిరిగి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (11) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ కూడా నిరాశ పరిచాడు. నాయర్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే రవీంద్ర జడేజాతో కలిసి యశస్వి పోరాటం కొనసాగించాడు.

అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యశస్వి 164 బంతుల్లో 14 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు జడేజా 5 బౌండరీలతో 53 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు. ధాటిగా ఆడిన ధ్రువ్ జురెల్ 4 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. ఇక దూకుడుగా బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 పరుగులు సాధించి చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 88 ఓవర్లలో 396 పరుగుల వద్ద ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ ఐదు, అట్కిన్సన్ మూడు, ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ తాజా సమాచారం లభించే సమయానికి వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News