Sunday, May 25, 2025

టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియాను ఎంపిక చేశారు. భారత జట్టు కొత్త టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను నియమించారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. ఊహించినట్టే శుభ్‌మన్‌కు టెస్టు సారథ్య బాధ్యతలను అప్పగించారు. ఐపిఎల్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో అదరగొడుతున్న సాయి సుదర్శన్‌కు జట్టులో చోటు దక్కింది. యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా కెరీర్‌లో తొలిసారి టెస్టు టీమ్‌కు ఎంపికయ్యాడు. శనివారం ముంబైలో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ప్రధాన కార్యాలయంలో జరిగిన సెలెక్షన్ కమిటీ సమావేశంలో కెప్టెన్‌తో పాటు టెస్టు జట్టును ప్రకటించారు.

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 20 నుంచి సిరీస్ ఆరంభమవుతోంది. ఈ సిరీస్‌లో పాల్గొనే 18 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో సహా రవిచంద్రన్ అశ్విన్‌లు టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను ఎంపిక చేయక తప్పలేదు. దేశవాళీ క్రికెట్‌లో అసాధారణ ఆటతో అలరిస్తున్న కరుణ్ నాయర్‌కు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి చోటు దక్కింది. రోహిత్ వారసుడిగా శుభ్‌మన్ ఎంపిక చేస్తారని కొన్ని రోజులుగా జాతీయ, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తగినట్టుగానే సెలెక్టర్లు శుభ్‌మన్‌కే టెస్టు సారథ్య బాధ్యతలను అప్పగించింది. అతనికి డిప్యూటీగా రిషబ్‌ను ఎంపిక చేశారు.

ఈశ్వరన్, సుదర్శన్‌లకు స్థానం
దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న తమిళనాడు బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌కు టీమిండియాలో స్థానం దక్కింది. రంజీతో పాటు పలు దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌లలో ఈశ్వరన్ అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. దీంతో అతనికి టెస్టు టీమ్‌లో చోటు లభించింది. ఇక ఐపిఎల్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న యువ సంచలనం సాయి సుదర్శన్‌కు కూడా టెస్టు టీమ్‌లోకి పిలుపు వచ్చింది. ఊహించినట్టే సాయికి సెలెక్టర్లు చోటు కల్పించారు. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ కూడా జట్టులో స్థానాన్ని కాపాడుకున్నాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా జట్టులో స్థానం సంపాదించాడు. ఐపిఎల్‌తో పాటు డొమెస్టిక్ క్రికెట్‌లో మెరుపులు మెరిపించిన

స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు మరోసారి టీమిండియా చోటు దక్కింది. ఐపిఎల్‌లో వరుస వైఫల్యాలు చవిచూసిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమికి జట్టులో స్థానం లభించలేదు. హైదరాబాదీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. యువ సంచలనం అర్ష్‌దీప్ సింగ్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపిఎల్‌తో అర్ష్‌దీప్ నిలకడైన బౌలింగ్‌తో పంజాబ్‌కు నాకౌట్ బెర్త్ సాధించి పెట్టాడు. దీంతో అతనికి కూడా జట్టులో స్థానం లభించింది. ఆకాశ్‌దీప్, వాషింగ్టన్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ట, కుల్దీప్‌లకు కూడా టెస్టు టీమ్‌లో బెర్త్ దక్కింది. సీనియర్ ఆటగాళ్లు కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలకు కూడా స్థానం కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News