న్యూఢిల్లీ : భారత్-అమెరికా సహజ భాగస్వామ్యపక్షాలు. ఈ చిరకాల, నిజమైన బంధం ప్రాతిపదికననే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా వెలువరించిన స్పందన ఇరుదేశాల ఇప్పటి అనిశ్చితత నడుమ అత్యంత కీలకం అయ్యాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు పరిష్కారించుకునేందుకు అన్ని విదాలుగా దౌత్యచర్చలు జరుగుతున్నాయని ట్రంప్ వెలువరించిన వ్యాఖ్యలకు స్పందనగా మోడీ ట్రేడ్ డీల్ గురించి ప్రస్తావించారు. ట్రంప్ ట్రూత్ సోషల్ వ్యాఖ్యలకు స్పందనగా మోడీ ఎక్స్ స్పందన వెలువడింది. రెండు దేశాలు మిత్రదేశాలుగా ఉన్నాయి.
ఇది సహజసిద్ధమైన, ఎటువంటి ఇతర ప్రభావాలకు తావులేని బంధం అయి ఉంది. ద్వైపాక్షిక ట్రేడ్ డీల్ గౌరవప్రదంగా, పరస్పర ప్రయోజనాల కోణంలో నిలిచి తీరేందుకు అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయని మోడీ తెలిపారు. త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునేందుకు రెండు వైపుల నుంచి ప్రతినిధి బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు. భారతీయ సరుకులపై ట్రంప్ నుంచి ఏకంగా 50 శాతం వరకూ సుంకాల విధింపు , తరచూ భారత్‌పై మోడీ ఘాటైన మాటల నడుమ ఇరుదేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టిన దశలోనే ఇప్పుడు మోడీ అంతకు ముందు ట్రంప్ నుంచి ట్రేడ్ డీల్‌పై సానుకూలత వ్యక్తం కావడం కీలక పరిణామం అయింది. వచ్చే కొద్ది వారాలలోనే తాను మోడీతో మాట్లాడే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు, ఇది ఒప్పందం ఖరారుకు దారితీస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొనడంపై మోడీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇరుదేశాలూ మిత్రదేశాలు.
ఈ బంధం ముందుకు సాగుతుందని మోడీ వెల్లడించారు. తాను కూడా ట్రంప్‌తో నేరుగా మాట్లాడాలనుకుంటున్నానని, ఇరుదేశాల ప్రజల మరింత ఉజ్వల , సంపన్న భవిత నెలకొనే అధ్యాయం కోసం ట్రంప్‌తో పాటు తానూ ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మోడీ వ్యాఖ్యలను వెంటనే ట్రంప్ తమ ట్రూత్ సోషల్ మీడియాలో ఇద్దరి ఫోటోలతో పొందుపర్చారు. ఇరువురు నేతల పరస్పర ఆశాభావ ప్రకటనల దశలో ఇక వచ్చే కొద్దిరోజుల్లోనే ట్రంప్ సంబంధిత విశ్వసనీయ అధికారిక బృందం భారత్‌కు చేరుకుంటుంది. ఈ దశలోనే ట్రేడ్ డీల్‌కు రంగంల సిద్ధం అవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ బృందం ప్రత్యేకించి భారతీయ నౌకాదళం కోసం అత్యంత అధునాతనమైన బహుళ స్థాయి తీర ప్రాంత గస్తీ యుద్ధ విమానం పి8ఐ కొనుగోలు ఒప్పందం ఖరారుకు అని అధికార వర్గాలు తెలిపాయి. ట్రేడ్ డీల్ ఖరారు కూడా ఈ బృందం ప్రత్యేక చర్చనీయాంశం అవుతుందని వెల్లడైంది. ఈ నెల ఆరంభం నుంచి మోడీ పట్ల, భారత్ పట్ల ట్రంప్ సానుకూల స్పందన ప్రకటనలు వెలువడుతున్నాయి.
ఇరుదేశాల మధ్య ఉన్న ప్రత్యేక బంధం అత్యంత కీలకమైనదని, దేని గురించి ఆందోళన వెందాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రకటిస్తూ వచ్చారు. ఇక ఒక్కరోజు క్రితమే ఫైనాన్షియల్ టైమ్స్ లో భారత్‌కు వ్యతిరేకంగా ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వచ్చిన వార్తను ట్రంప్ కానీ ఆయన అధికారిక యంత్రాంగం కానీ నిర్థారించలేదు. రష్యా ముడిచమురు సేకరణకు ప్రతిగా భారత్‌పై వంద శాతం సుంకాలు విధించాల్సిందే అని ట్రంప్ యూరోపియన్ యూనియన్ను ఆదేశించినట్లు వెలువడ్డ వార్త నిజం కాదని స్పష్టం అయింది. ఇరువురు నేతలు ఇప్పుడు ట్రేడ్ డీల్ త్వరలోనే ఖాయం అనే పరస్పర ప్రకటనలకు దిగుతూ రావడంతో భారత్ అమెరికా బంధం నీలినీడలు తొలిగిపోతాయనే దౌత్యవర్గాలు స్పందిస్తున్నాయి.
Also Read: వచ్చే నెల నుంచీ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ