Saturday, May 10, 2025

సరిహద్దు గ్రామాలపై పాక్ బాంబుల వర్షం… కాల్పుల మోత

- Advertisement -
- Advertisement -

పూంఛ్, రాజౌరీ జిల్లాలపై
పాక్ సైన్యం రౌడీ దాడియిజం

గ్రామాలపై బాంబుల వర్షం కాల్పుల మోత
గ్రామస్తుడి మృతి…పలువురికి గాయాలు
ధీటుగా స్పందించిన భారతీయ సైన్యం ..టక్కర్‌కు బ్రేక్

పూంఛ్ / జమ్మూ : తెగబడిన పాకిస్థానీ సైన్యం శుక్రవారం జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో విచక్షణారహిత కాల్పులు జరిపింది. ఇక్కడ గ్రామాలను ఎంచుకుని బాంబులు తూటాల వర్షం కురిపించారు. దీనితో గ్రామస్తుడు ఒక్కరు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. స్థానిక అధికారులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలతో ఇక్కడ పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. రెండు రోజులుగా పాకిస్థాన్ ఆపరేషన్ సిందూరకు ప్రతీకారంగా దాడులకు దిగుతోంది. ఈ కాల్పులను భారతీయ సైన్యం అన్ని స్థాయిల్లో తిప్పికొడుతోంది. పూంఛ్ రాజౌరీ జిల్లాల్లోని ఫార్వర్డ్ ప్రాంతాలలో పాకిస్థాన్ దూకుడును సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎదురుదాడులకు దిగింది.

సరిహద్దుల వెంబడి ఉన్న గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. పలు చోట్ల పెద్ద ఎత్తున పేలుళ్లు విన్పించాయి. తెల్లవారుజామునే 3.50 నుంచి 4.45 గంటల వరకూ పాక్ బలగాలు కాల్పులకు దిగాయి. ముందు జాగ్రత్త చర్యగా సైరన్లు, బ్లాకౌట్లకు దిగినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు తగు జాగ్రత్త చర్యల గురించి మైక్‌లలో తెలిపారు. పాకిస్థాన్ నుంచి దాడులు ఉంటాయని అధికారులు ముందుగానే పసికట్టారు. దీనితో ఈ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం వల్ల ముప్పు తప్పింది. డ్రోన్లు ఇతర గగనతలవస్తువులతో నిజానికి పాక్ నాటు దాడికి దిగింది. వీటిని భారతీయ సైన్యం శక్తివంతమైన రీతిలో తిప్పికొట్టింది. కుప్పారా, బారాముల్లా, ఇతర ప్రాంతాలను ప్రత్యేకించి పౌర నివాస సముదాయాలను ఎంచుకుని పాక్ దాడులకు దిగినట్లు వెల్లడైంది. ఈ ఆకతాయి చర్యకు మన సేనలు తగు రీతిలో జవాబు ఇచ్చారు.

కాల్పుల్లో గ్రామస్తుడు ఒక్కరు మృతి చెందాడు. అనేక మంది గాయపడ్డారు. మృతుడిని లోరన్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్రార్‌గా గుర్తించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ అతిక్రమణ చర్యలను సహించేది లేదని, దెబ్బకు దెబ్బనే కాకుండా అంతకు మించిన స్థాయిలో తమ నుంచి తగు జవాబు ఉంటుందని ఈ ప్రాంత ఉన్నతాధికారి ఒక్కరు తెలిపారు. పాక్ సేనల కవ్వింపు చర్యల పట్ల ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని జమ్మూ ప్రాంత డిసిపి కోరారు. ప్రశాంతంగా ఉండండి, భయాలకు లోనుకావద్దని, ప్రజలకు సైన్యం , పోలీసు భద్రతా బలగాలు పూర్తిగా భరోసాగా నిలుస్తాయని తెలిపారు. ఈ ప్రాంతంలో విద్యాసంస్థలను మూసివేశారు. పాక్ దుస్సాహస చర్యలను గమనించి సరిహద్దుల వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలించారు. వారికి తగు ఆశ్రయం కల్పించారని ఉన్నతాధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News