అమరావతి: గతంలో సింగపూర్ తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. కొన్ని కారణాలతో అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ బయటకు వెళ్లిందని అన్నారు. సింగపూర్ లో చంద్రబాబు బృందం పర్యటించారు. సింగపూర్ లో తెలుగు డయాస్పోరాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణ భాగస్వామ్యం విషయంలో అలా జరిగి ఉండకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో కొన్ని రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నిస్తానని తెలియజేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నానని, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఎపిలో ఇప్పటికే పట్టాలెక్కాయని చెప్పారు.
ఇండియా క్వాంటం మిషన్ (India Quantum Mission) లో క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేశామని, విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు అవుతుందని అన్నారు. డిఫెన్స్, ఏరో స్పేస్, ఎలక్ట్రానికి, ఆటోమొబైల్ సంస్థలకు..రాయలసీమ ప్రాంతంలో అనువైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. భారత్ కు సింగపూర్ నుంచి పెట్టుబడులు రావాలని, వాటికి ఎపి గేట్ వేగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.