ముంబై: భారతీయ కళలను పరిక్షించడానికి రిలయన్స్ సంస్థ అధ్యక్షుడు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) ‘‘నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఎంఎసిసి)’’ను 2023 మార్చి 31న ఏర్పాటు చేశారు. తాజాగా ఈ సంస్థ కీలక ప్రకటన చేసింది. న్యూయార్క్ నగరంలో ‘‘నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఇండియా వీకెండ్’’ కార్యక్రమాన్ని జరపనున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 12 నుంచి 14 వరకూ నిర్వహించనున్నారు. లింకన్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో సంగీతం, థియేటర్, ఫ్యాషన్, పంటకాలతో వివిధ భారతీయ (Indian Culture) కళారూపాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు. ఈ ఇండియా వీకెండ్ మొదటి ఎడిషన్‌తో అంతర్జాతీయంగా ఓ మైలురాయి అరంగేట్రం చేయనుంది.
మూడు రోజుల ఈ వేడుకలో ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్ : సివిలైజేషన్ టు నేషన్’ ముఖ్యమైనది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద థియేట్రికల్ ప్రొడక్షన్. ఇందులో దాదాపు 100 మందికి పైగా కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. వీరిలో టోనీ, ఎమ్మీ అవార్డులు అందుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి నీతా అంబానీ (Nita Ambani) మాట్లాడుతూ.. భారతదేశపు అత్యుత్తమ కళలను(Indian Culture) ప్రపంచానికి ప్రదర్శించడమే ఎన్‌ఎంఎసిసి ప్రధాన లక్ష్యమని అన్నారు. న్యూయార్క్‌లో జరిగే ఈ మూడు రోజుల వేడుక తమ ప్రయాణంలో మొదటి అడుగు అవుతుందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక లింకన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగడం.. అందులో మన గొప్ప సంస్కృతిని పంచుకోవడానికి ఉత్సహంగా ఉందని అన్నారు.