Friday, July 11, 2025

భారత మహిళల నయా చరిత్ర

- Advertisement -
- Advertisement -

భారత మహిళా క్రికెట్ టీమ్ నయా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే 3-1తో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌పై టి20 సిరీస్‌లో విజయం సాధించడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటి వరకు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆరు ద్వైపాక్షిక టి20 సిరీస్‌లు జరిగాయి. అన్నింటిలో ఇంగ్లండే విజయం సాధించింది. తాజాగా జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మాత్రం భారత జట్టు చరిత్రను లిఖించింది. ఇంగ్లండ్‌పై తొలి సిరీస్‌ను దక్కించుకుంది. తొలి రెండు టి20లలో టీమిండియా విజయం సాధించింది. మూడో టి20లో ఇంగ్లండ్ జయకేతనం ఎగుర వేసింది. తాజాగా నాలుగో టి20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి సిరీస్‌ను దక్కించుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసింది.భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఆతిథ్య జట్టులో సోఫియా డంక్లీ (22) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ అద్భుత ప్రతిభను కనబరిచింది. 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లను పడగొట్టింది. అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మ, శ్రీ చరణి, అరుధంతి రెడ్డిలు కూడా మెరుగైన బౌలింగ్‌ను కనబరిచారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 17 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (32), షఫాలీ వర్మ (31) శుభారంభం అందించారు. ఇద్దరు తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. జెమీమా రోడ్రిగ్స్ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 3 ఫోర్లతో 26 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News