పాకిస్థాన్‌పై 67 తేదీల మధ్య రాత్రి భారతసైన్యం జరిపిన దాడి ఒక అనివార్యమైన ప్రతీకార చర్య. ఏ కోణం నుంచి ఆలోచించినా తప్పు పట్టలేనిది. ఏప్రిల్ 22న కశ్శీర్‌లోని పహల్గాంలో 26 మంది అమాయకులైన యాత్రికులను దారుణంగా కాల్చి చంపిన స్థితిలో అందుకు బాధ్యులైన వారిపై, వారికి ప్రోత్సాహం ఇచ్చేవారిపై తగు విధమైన తక్షణ చర్య తీసుకోవటమే సరైనది. నేరస్థులను పట్టుకుని సాక్షాధారాలు సేకరించి, కోర్టుల ద్వారా శిక్ష పడేట్లు చేయాలనటం, అదే విధంగా వారిని ప్రోత్సహించినట్లు పాకిస్థాన్ చేత ఒప్పించి చర్య తీసుకోవాలనటం తరహా వాదనలు వినేందుకు కొందరికి బాగా తోచవచ్చుగాని, వాస్తవ పరిస్థితులతో నిమిత్తం లేని మాటలకు అర్ధం ఉండదు. ఆనాటి చర్యకు బాధ్యత తమదని ‘కశ్శీర్ రెసిస్టెన్స్ ఫ్రంట్” అనే సంస్థ స్వయంగా ప్రకటించింది. ఆ వ్యక్తులు ఒకవేళ దొరికినా ఎప్పటికో తెలియదు.
ప్రోత్సహించింది తామని పాకిస్థాన్ ఎన్నటికీ అంగీకరించదు. అమెరికా రష్యా తగవు సందర్భంలో తాము అమెరికా పక్షాన పని చేసిన కాలంలో అనేక మిలిటెంట్, టెర్రరిస్టు సంస్థలకు ఆశ్రయ మిచ్చినట్లు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇటీవల ఒక ఇంటర్వూలో ఒప్పుకున్నారు. అంతకు ముందు జనరల్ ముషార్రఫ్, నవాజ్ షరీఫ్ మొదలైనవారు కూడా. ఈ మద్దతు అందరికీ తెలిసిన విషయమే. కాని అదంతా గతమని పహల్గాం దాడి జరిపిన వారు కశ్శీర్‌లో అంతర్గత పరిస్థితుల వల్ల అసంతృప్తి చెందిన యువకులే గాని, తమకు సంబంధం లేదని ప్రస్తుత పాకిస్థాన్ పాలకులు వాదించబూనుతున్నారు. ఆ మాటకు విశ్వసనీయత ఎంత మాత్రం లేదు. ఎందువల్ల లేదో అనేక కారణాలు చెప్పవచ్చుగాని అందుకిది సందర్భం కాదు.
మొత్తం మీద, ఏ విధంగా చూసినప్పటికీ భారత సైన్యం దాడులు సహేతుకమైనవే. అందువల్లనే పాకిస్థాన్‌ను కనీసం బహిరంగంగా సమర్థించే వారు ఎవరూ లేకపోయారు. ఒకవేళ రెండు దేశాలు మధ్య యుద్ధం జరిగితే వారంతా ఇండియాకు సైనిక సహాయం చేయకపోవచ్చు. ఇజ్రాయెల్ మినహా మరెవరూ చేయరు కూడా. కాని, ఉగ్రవాదాన్ని ఖండించేందుకు ఎవరూ సందేహించరు. స్వయంగా వారిలో అనేకులు ఉగ్రవాద బాధితులు గనుక విచిత్రమేమంటే, జాగ్రత్తగా పరిశీలిస్తే వారిలో కొందరు ఒకవైపు తమ ప్రయోజనాల కోసం తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మరొకవైపు ఇంకొక విధమైన ప్రయోజనాల కోసం ఆ ధోరణిని వ్యతిరేకిస్తున్నారు. అందుకు పాకిస్థాన్, అమెరికాలు రెండు మంచి ఉదాహరణలు. ఏవిధంగానో బహుశా వివరించనక్కర లేదు. ఆ విషయం అట్లుంచితే, మొన్నటి ఇండియా దాడులు లోగడ జరిపిన ఉగ్రవాద వ్యతిరేక దాడులకన్న తీవ్రమైనవి.
పహల్గాం దాడి తీవ్రతకు సరిపోల్చదగినవి. పాకిస్థాన్‌లో ఉగ్రవాద కేంద్రాలకు, ఆ దేశానికి కూడా గతం కన్న ఎక్కువ నష్టాన్ని కలిగించాయి. భారత అధికారులు ప్రకటించిన లెక్కల ప్రకారం అటు పాక్ ఆక్రమిత కశ్శీర్‌లో, ఇటు పాకిస్థాన్ పంజాబ్‌లో కలిసి తొమ్మిది స్థావరాలపై క్షిపణులను ప్రయోగించి ధ్వంసం చేసారు. 80 మంది వరకు టెర్రరిస్టులు మరణించారు. సాధారణ పౌరులెవరూ చనిపోలేదు. పాకిస్థాన్ చెప్తున్నది ఆరు లక్షాలు, 30 మందికి పైగా మనుషులు. అందులో ఉగ్రవాదులు ఎందరనేది వారు సహజంగానే మాట్లాడరుగాని, ఉగ్రవాద నాయకుడు మసూద్ అజర్ మాత్రం తమ కుటుంబ సభ్యులు పది మంది, సన్నిహితులు నలుగురు చనిపోయారన్నాడు. వీటన్నింటిపై స్వతంత్ర పరిశీలనలు ఏమీ లేవు ఇంత వరకు. యుద్ధ సందర్భాలలో అవి బహుశా ఎప్పటికీ ఉండవు కూడా.
ఇటువంటిదే పాకిస్థాన్ తాము తీసుకున్నామంటున్న ప్రతి చర్యలు. మొన్నటి దాడి సమయంలో భారత్‌కు చెందిన అయిదు యుద్ధ విమానాలు, ఒక సాయుధ డ్రోన్‌ను కూల్చివేసినట్లు పదే పదే ప్రకటిస్తున్నారు. అదే విధంగా కొన్ని భూతల దాడులు. వీటికి కూడా స్వతంత్ర ధ్రువీకరణలు లేవు. కాని గమనించదగినదేమంటే, విమానాల విషయాన్ని భారత్ అధికారులు అవుననటం లేదు, కాదనటం లేదు. ఈ మాటకు దాడుల వేడిలో మన వద్ద ప్రచారం లభించటం లేదుగాని, బయట చాలా చర్చలు జరుగుతున్నాయి. అందుకు ఒక కారణం, ఆ విమానాలలో ఫ్రాన్స్ రఫేల్, రష్యా మిగ్‌లు ఉండటం. రెండవది 2019 బాలాకోట్ దాడి సమయంలోనూ పాకిస్థాన్ ఒక భారత యుద్ధ విమానాన్ని దెబ్బతీయగలగటం. మూడవది, రెండు దేశాల వైమానిక బలాలు ఎటువంటివనే మీమాంసలు. నాల్గవది, చైనా నుంచి పాకిస్థాన్ ఖరీదు చేసిన జె10సి యుద్ధ విమాన సామర్థానికి రఫేల్, మిగ్‌ల వలె ప్రచారం జరగలేదుగాని, అది వీటికి మించినదన్న రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. ఈ
విషయాలు పక్కన ఉంచితే, పహల్గాం తర్వాత ప్రతి చర్యకు ముందు రెండు వారాల పాటు, ఆ చర్య ఏ విధంగా ఉండాలో, ఏ లక్షాల కోసమో భారత ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించిందన్నది స్పష్టం. మరొకవైపు అదే కాలంలో పరిస్థితిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు దౌత్య ప్రయత్నాలు చాలానే చేసింది. ఆ రోజులలోనే పాకిస్థాన్‌తో సింధూ ఒప్పందాన్ని సస్పెండ్ చేయటం సహా ఇతర దౌత్యపరమైన చర్యలు తీసుకున్నది. చివరకు ఈ 67 తేదీల రాత్రి దాడులు వెనుక, 7వ తేదీన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆ చర్య వివరాలు మీడియాకు తెలియజేస్తూ చెప్పిన కొన్ని మాటలు గమనించదగ్గవి. అవి ఈ విధంగా ఉన్నాయి: దాడులు జరిపింది ఉగ్రవాద శిబిరాలపైనే తప్ప సైనిక కేంద్రాలపై, పౌర నివాసాలపై కాదు.
పూర్తి నిఘా సమాచారంతో ఆ పని చేసాము. పహల్గాం తర్వాత ఉగ్రవాదులపై పాకిస్థాన్ ఎటువంటి చర్యలు కూడా రెండు వారాల వరకు తీసుకోనందువల్లనే తాము పూనుకోవలసివచ్చింది. భారత్ దాడులు ఉగ్రవాదుల దాడికి సరిసమానంగా (ప్రపోర్షనేట్), జాగ్రత్తగా లెక్క వేసి (మెజర్డ్), బాధ్యతాయుతంగా (రెస్పాన్సిబుల్), ఇంకా పెచ్చరిల్లని విధంగా (నాన్ ఎస్కలేటరీ) జరిపామని చెప్పారాయన. అట్లాగే, ఉగ్రవాద దాడులు భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా ఉండటం కోసం అన్నారు.ఇందులో ప్రతి మాటకు తగినంత అర్థం ఉంది. అది దాడుల ఫిలాసఫీ వంటిది. అయితే, దౌత్య నీతిపరంగా ప్రపంచాన్ని మెప్పించేందుకు ఈ మాటలు ఉపయోగపడవచ్చుగాని, ఆచరణపరంగా చూసినపుడు ఉపయోగం ఏమైనా ఉంటుందా అనేది సందేహాస్పదమే. ముఖ్యంగా ఇంకా పెచ్చరిల్లని విధంగా, దాడులు మళ్లీ జరగని తీరులో అన్నవి.
మొదటి మూడు మాటలను పాకిస్థాన్ ఎట్లాగూ అంగీకరించదు. తాము ప్రతిదాడులు జరపగలమని ఇప్పటికే ప్రకటించి, సరిహద్దులలో వరుసగా కాల్పులతో ఇప్పటికే పదుల కొద్దీ భారత పౌరులను చంపటం, గాయపరచటం జరుగుతున్నపుడు, ‘ఇంకా పెచ్చరిల్లని విధంగా’ అన్న మాటకు అర్ధం లేదు. పోతే ఉగ్రవాద చర్యలు, అందుకు ప్రతిచర్యలన్నవి దశాబ్దాలుగా సాగుతున్న స్థితిలో మొన్నటి చర్యల దరిమిలా ఇక ముందు అవి నిలిచిపోగలవని ఆశించటానికి కూడా అర్థంలేదు. పోతే, ప్రపోర్షనేట్, మెజర్డ్, రెస్పాన్సిబుల్ అని ఇండియాకు తోచినవి పాకిస్థాన్‌కు తోచగలవని చెప్పగలమా.తోచబోమని భారత అధికారులకు పూర్తిగా తెలుసు. కాకపోతే ఇదంతా బయటి ప్రపంచానికి ఆమోదయోగ్యం ఉండటం కోసం.
అది దౌత్యనీతిలో భాగం. ప్రస్తుతం ప్రపంచాభిప్రాయం ఎట్లున్నది? సాధారణంగానే ఉగ్రవాదానికి వ్యతిరేకం. రకరకాల ఉగ్రవాదాలు అనేకం ఉన్నందున ఆ విషయంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకం. పహల్గాం ఘటన వల్ల వ్యతిరేకం. ఇండియాపై సానుభూతి. దీనంతటి నేపథ్యంలో ఇపుడు ప్రపంచపు ఆందోళన అంతా, రెండు అణ్వస్త్ర దేశాల మధ్య సైనిక ఘర్షణలు అంచెలంచెలుగా తీవ్రమైపోయి, చివరకు పొరపాటునో, ఉద్దేశపూర్వకంగానో అణుయుద్ధం వరకు వెళ్లగలవేమోనని. అందుకే అందరూ ఈ ఘర్షణలను అంచెలంచెలుగా (ఎస్కలేటరీ) పెంచవద్దని రెండు దేశాలను పదేపదే కోరుతున్నారు. కశ్శీర్ సమస్య ఎపుడు తేలేదీ ఎవరికీ తెలియదు. అట్లాగే రొటీన్‌గా జరిగే ఘర్షణలు. వీటి పట్ల ఎవరీకీ ఆసక్తి కూడా లేదు. ఎవరి సమస్యలు వారికున్నాయి. వద్దనుకునేది అణుయుద్ధం మాత్రమే. ఇటువంటి ఆందోళనను దృష్టిలో ఉంచుకున్నందువల్లనే భారత అధికారులుపై వేర్వేరు మాటలతో పాటు నాన్ ఎస్కలేటరీ అనే మాటను జాగ్రత్తగా ఉపయోగించారు.
అనగా, ఇంతకు మించి పాకిస్థాన్ తదుపరి చర్యలకు పాల్పడితే అది ఎస్కలేటరీ అవుతుందని ప్రపంచానికి చెప్పడమన్నమాట. అందుకు తగినట్లే పలు దేశాలు ఇరువురికీ ముఖ్యంగా పాకిస్థాన్‌కు, ఇక ఇంతటితో ఆగమని సూచిస్తున్నాయి. ఆసక్తికరం ఏమంటే, పాకిస్థాన్ ఒకవైపు తమ ప్రతీకారం తాము తీసుకోగలమని ప్రకటిస్తూనే, మరొక వైపు తాము ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నామని, ఇక ఇండియా ఎస్కలేట్ చేయనట్లయితే తాము కూడా ఎస్కలేట్ చేయబోమని అంటున్నాయి. వారి దృష్టిలో తాము తీసుకున్న చర్యలు అయిదు భారత విమానాలను కూల్చటం మొదలైనవి. తర్వాత కొనసాగుతున్న సరిహద్దు కాల్పులు సరేసరి.
ఇంతకూ ఇండియా వైపు నుంచి ఈ బలమైన ప్రతీకారం తర్వాత రాగల రోజులలో ఏమిటన్నది ప్రశ్న. ఇటువంటి చర్యలతో ఉగ్రవాదం లోగడ అంతం కాలేదు, ఇపుడూ కాదు. ఉగ్రవాద శిబిరాలు గతంలో ధ్వంసం కాగా కొత్తవి పుట్టుకు వచ్చినట్లే మళ్ళీ జరుగుతుంది. సైనికంగా రెండూ బలమైనవి. ముఖ్యంగా అణుశక్తి దేశాలు అయినందున పూర్తిస్థాయి యుద్ధం పరిష్కారం కాజాలదు. ఉగ్రవాదం కశ్శీర్‌లో చిలవలు వేస్తూనే ఉంటుంది. పాకిస్థాన్ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. మిగిలింది ఏమిటి? పరస్పర అంగీకారంతో రాజకీయ పరిష్కారం ఒక్కటే. ఆ మార్గం ఏమిటో రెండు దేశాలు కలిసి కనుగొనవలసిందే. ఇందులో చిక్కు ఏమంటే లోగడ పాక్ రాజకీయ నాయత్వాలు కొన్ని ఆ ధోరణిని చూపినా, సైనిక నాయకత్వాలు అందుకు ఇష్టపడలేదు.
- టంకశాల అశోక్ (దూరదృష్టి) ( రచయిత సీనియర్ సంపాదకులు)