Monday, May 26, 2025

ఆపరేషన్ సిందూర మన దేశ ముఖచిత్రం

- Advertisement -
- Advertisement -

దేశ సంఘటిత శక్తి..అజేయ సైనిక సమర్థత
ఉగ్రవాదంపై పోరులో కీలక మలుపు ఓ గెలుపు
మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ స్పందన
మావోయిస్టు ప్రాబల్యానికి ఇక తుదిఘడియలు
2026 మార్చి 31తో నక్సల్స్ సమస్య కు చెల్లుచీటి
విద్యా , ప్రగతి చర్యలతో నిర్మాణాత్మక లక్షాలు
మారుమూల భారతంలో స్ఫూర్తిదాయక ఘట్టాలు
సంగారెడ్డి ఆడపడుచుల డ్రోన్ల సాగు ప్రస్తావన
పిల్లల్లో చక్కెర వ్యాధి నివారణ చర్యలకు జేజేలు

న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర కేవలం సైనిక చర్య కాదు, అంతకు మించి ఎంతో ఉంది, ఈ ఘట్టం పరివర్తిత గతి భారతదేశానికి ముఖచిత్రం అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నెలనెలా చివరి వారం ఆకాశవాణి దూరదర్శన్ ద్వారా తన ఆలోచనలను పౌరులతో పంచుకునే 122వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం ఆయన ప్రసంగించారు. ఆపరేషన్ సిందూరతో ప్రపంచ వేదికపై మన దేశం శక్తి సామర్థాలు, మన సైనిక పాటవం గురించి తెలిసింది. జాతి ధృఢ దీక్ష, ధైర్యసాహసాలు అందరికి తెలిశాయని ప్రధాని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా కాలంగా ఉగ్రవాదంపై పోరు సాగుతోంది. ఇందులో ఇప్పటి మన సిందూర ఘననీయం అయింది. టెర్రర్‌పై పోరులో ఇది కీలక మైలురాయిగా మారిందని వివరించారు.

ఉగ్రవాదుల అణచివేత చర్యలలో కీలక మలుపు ఈ ఆపరేషన్ అని చెప్పారు. మనం పొరుగుదేశం లోతట్టు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకుని నిర్ధేశిత రీతిలో నిర్ణీత దాడులు చేశాం. ఈ క్రమంలో అమాయక పౌరులకు ఎటువంటి నష్టం కలుగకుండా చూసుకున్నామని తెలిపారు. ఇదే క్రమంలో మనం దేనినైనా సాధించాలనే స్థిర నిర్ణయానికి వస్తే , దీనిని కార్యరూపంలోకి తీసుకువచ్చి తీరుతామని చాటాం అని ప్రధాని తెలిపారు. దేశ రాజధానిలో ఎన్‌డిఎ నేతల కీలక భేటీకి హాజరైన వారు ఈ మన్ కీ బాత్‌ను శ్రద్ధగా ఆలకించారు. ఆపరేషన్ సిందూరతో మన సైనిక శ్రేణుల్లో మరింత స్ఫూర్తి రగులకుంది. జాతియావత్తూ దేశ భక్తి తొణికిసలాడింది. ప్రజలు అంతా కూడా దేశభక్తి భావనను మరింతగా సంతరించుకున్నారు. విదేశాల నుంచి వచ్చే సరుకులను బహిష్కరిస్తూ ఇప్పుడు భారతీయ వస్తువుల పట్ల మక్కువ పెంచుకున్నారని తెలిపారు. ఇప్పుడు దేశం అంతా కూడా ఉగ్రవాదంపై సమైక్యంగా నిలబడింది.

అమానుషకాండ పట్ల ఆగ్రహజ్వాలలు మరింత ప్రజ్వరిల్లాయని తెలిపారు. ఇప్పుడు మనం అంతా కూడా స్వదేశీ ఆదరణకు ప్రతిన తీసుకుందామని ఈ నేపథ్యంలో ప్రధాని పిలుపు నిచ్చారు. ఇది జాతి నిర్మాణ ప్రక్రియగా సాగాలని కోరారు. ఆర్థిక ప్రగతి ఒక్కటే కాకుండా అన్ని రంగాలలో కూడా మన ముందడుగులు మరింత వేగవంతం కావల్సి ఉందని తెలిపారు. వచ్చే నెల 21న (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది. ప్రపంచ ప్రజలంతా కూడా ప్రశాంత సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితం కోసం యోగాను జీవన క్రమంలో అంతర్లీన ప్రక్రియ చేసుకోవాలని మోడీ పిలుపు నిచ్చారు. ఈసారి మరింత సృజనాత్మక రీతిలో యోగాలో పాలుపంచుకోవాలని , యువత ఉత్సాహం నిర్మాణాత్మక దిశకు సాగేందుకు యోగా ఓ సాధనం అంతకు మించిన మనో సమతుల్య ప్రక్రియ అవుతుందని తెలిపారు. యోగాతో తన దైనందిన అనుబంధాన్ని తెలియచేసుకున్నారు. ఇక గుజరాత్‌లో ఆసియా సింహాల సంఖ్య గత ఐదేళ్లలో గణనీయంగా పెరగడం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇంతకు ముందు వీటి సంఖ్య 674 కాగా ఇప్పుడు ఇవి 674కు చేరాయి. ఇది అత్యంత కీలక పరిణామం. అంతకు మించి ఈ అడవి సింహాల ఉనికి మనకు గర్వకారణం అన్నారు.

విద్యా , అభివృద్ధి పనులతో మావోయిజంపై జయం
వచ్చే ఏడాది మార్చి 31 లోగానే ఖేల్ ఖతం

ప్రధాని మోడీ తమ మన్ కీ బాత్‌లో నక్సలిజంపై ఆపరేషన్ కగారు గురించి ప్రస్తావించారు. నక్సలిజంపై పోరు ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరింది. వచ్చే ఏడాది మార్చి 31 లోగానే మావోయిస్టు సమస్య , హింసాత్మక చర్యల బెడద నుంచి మనం దూరం అయి తీరుతామని ఈ వేదిక ద్వారా ప్రధాని ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలు , విద్యారంగంలో చర్యలు అనేకం సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపారు.నక్సలిజంపై పోరు సమిష్టి కృషితో సత్ఫలితాలను అందిస్తోందన్నారు. దంతేవాడ, గడ్చిరోలి , కటేజ్హరి వంటి ప్రాంతాలను ఎంచుకుని అక్కడ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో , బస్సు ఇతరత్రా రవాణా సౌకర్యాలు, ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పనతో ఇప్పుడు క్రమేపీ ఈ ప్రాంతాలు మావోయిస్టుల ప్రాబల్యపు చెర నుంచి బయటపడుతున్నాయని తెలిపారు.మహారాష్ట్రలోని కటెజ్హరీలో ప్రజలు ఏళ్ల తరబడి బస్సు సౌకర్యం కోసం ఎదురుచూశారు. అక్కడ బస్సు సౌకర్యం ఏర్పడింది.

తొలి బస్సు సర్వీసుకు స్థానికులు సాంప్రదాయక రీతిలో తప్పట్లు తాళాలతో డప్పుల చప్పుళ్లతో స్వాగతం పలికారని తెలిపారు. అదే విధంగా చత్తీస్‌గఢ్‌లోని పలు మారుమూల ప్రాంతాలలో విద్యార్థులకు సైన్స్ ల్యాబ్స్ సహా అనేక విద్యా సౌకర్యాలు కల్పించారు. దీనితో ఆయా ప్రాంతాలలో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెరిగిందన్నారు.విద్యార్థులకు సైన్స్, స్పోర్ట్ పట్ల ఉండే ఆసక్తిని గుర్తించి వీటిని నిర్మాణాత్మక రీతిలో ఫలితాల దిశకు మళ్లించడం జరుగుతోందన్నారు. తేనె ఉత్పత్తిలో దేశం మనం అత్యద్భుత విజయం సాధించామని, ఇది ఆరోగ్యకరమైన పరిణామం అని స్పందించారు. మనమంతా తేనెటీగల మిత్రత్వ ధోరణిని ప్రదర్శించాలి. తేనెతెట్టెలను విరివిగా పెంచాలని హితవు పలికారు. ఇక విద్యార్థులు , పసివయస్సు చిన్నారుల్లో షుగర్ వ్యాధి నివారణ ఉద్యమ స్థాయిలో సాగాల్సి ఉందన్నారు. ఇటీవ సిబిఎస్‌ఇ స్కూళ్లలో విద్యార్థుల షుగర్ పరిణామాల అంచనాకు షుగర్ బోర్డులు ఏర్పాటు చేయడం దీర్ఘకాలిక ప్రయోజనాల దిశలో కీలకమైన తీపి మలుపు అన్నారు. మోడీ తమ ప్రసంగంలో ప్రత్యేకించి బీహార్‌ను కొనియాడారు. క్రీడలలో బీహారీ యువత గణనీయ విజయాలు సాధిస్తున్నారని , ఇది జాతికి గర్వకారణం అని తెలిపారు.

సంగారెడ్డి మహిళా.. నువ్వుఘనం ..మహనీయం
మోడీ మనసు పడి పలికిన మెచ్చుకోలు

ప్రధాని మోడీ తమ మన్ కీ బాత్‌లో తెలంగాణలోని సంగారెడ్డి ప్రాంత మహిళలు సాధించిన వ్యవసాయిక ప్రగతిని కొనియాడారు. వారు తమ సాగు పనులకు డ్రోన్లు వాడుతున్నారు. డ్రోన్ల వినియోగంలో తగు శిక్షణ పొందారు. సొంత పొలాల్లో డ్రోన్ల ద్వారా పురుగుల మందు ఇతర అవసరాలకు డ్రోన్లను వాడుతున్నారు. తగు రుసుం తీసుకుని ఇతరుల పంట పొలాలకు కూడాడ్రోన్ల ద్వారా పంట పనులు చేస్తున్నారని తనకు సమాచారం అందిందని తెలిపారు. ఈ డ్రోన్ అక్కలు బన ఆత్మస్థయిర్య భారత్‌కు ప్రతీకలు అని, వారిని తాను స్కై వారియర్స్ అని ఆప్యాయ ఆదరణ భావనలతో పిలుస్తున్నానని మనసులో మాట పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News