భారత విదేశాంగ విధానం గురించి ఎస్‌సిఒ తియాన్‌జిన్ సమావేశాల తర్వాత పలు విధాలైన వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. వాటిలో అన్నింటి కన్న ఎక్కువగా కనిపిస్తున్న అభిప్రాయం, భారతదేశం ఇక అమెరికా కూటమికి పూర్తిగా దూరమైపోయి చైనా, రష్యా కూటమిలో చేరిపోవటం ఇంకా జరగకున్నా ఆ దిశలో ప్రయాణం మొదలుపెట్టిందినేది.. ఈ అభిప్రాయానికి పరాకాష్ట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి వినిపించింది. తామిక ఇండియాను రష్యాను కూడా చైనాకు కోల్పోయినట్లు తోస్తున్నదని దీనమైన మొహంతో అన్నారాయన. ఆ ముగ్గురి మైత్రి చిరకాలం వర్ధిల్లుగాక అని ఆశీర్వదించారు. చపలచిత్తానికి పేరుబడిన ఆయన ఆ మరునాడే మాట మార్చి, అట్లా కాదు ప్రధాని మోడీ తన ప్రియమిత్రుడేనని ప్రకటించారు. అందుకు మోడీ కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికాతో తాము వ్యూహాత్మక భాగస్వాములమని గుర్తుచేసారు.
ఇంతకూ ఏమి జరుగుతున్నట్లు? అది చర్చించే ముందు ట్రంప్ ప్రకటనలోని ఒక ఆసక్తికరమైన అంశాన్ని గుర్తించాలి. తాము చైనాకు భారతదేశాన్ని కోల్పోయామనటంతో ఆగక రష్యాను కూడా పేర్కొనటమేమిటి? రష్యా, చైనాలు పూర్తిగా సన్నిహితమైనవే కదా? అయినప్పటికీ ట్రంప్ ఆ విధంగా మాట్లాడారంటే, రష్యా మునుముందు చైనాకు దూరమై తమకు మిత్రదేశంగా మారగలదని ఆశించి, ఇపుడు తియాన్‌జిన్ పరిణామంతో భంగ పడ్డారా? ట్రంప్ ఈ ప్రస్తావనను ఎందువల్లనో ఎవరూ చర్చించటం లేదుగాని, ఇది అమెరికన్ వ్యూహాత్మక రాజకీయాల దృష్టా ఎంతమాత్రం విస్మరించగలది కాదు. ఈ చర్చను కొద్దిసేపు పక్కనఉంచి భారతదేశం విషయం చూద్దాము.
తియాన్‌జిన్‌తో పాటు అందుకు కొద్ది ముందు వెనుకలుగా జరిగిన పరిణామాలను గమనించినపుడు మూడు విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఒకటి, బహుళ ధ్రువ ప్రపంచ భావన వైపు ఇండియా గతం కన్న మరికొంత ముందుకు జరిగింది. రెండు, అమెరికన్ కూటమితో తెగతెంపులు చేసుకునే ఆలోచనలు ఎంతమాత్రం లేవు. మూడు తన ప్రయోజనాల కోసం స్వేచ్ఛాయుత వ్యూహాన్ని అనుసరించే వెనుకటి విధానమే మునుముందు కూడా కొనసాగుతుంది. వీటిలో మూడవ దానికి సంబంధించి కొన్ని దృష్టాంతాలను చూడండి. చైనాకు మోడీ అమెరికాకు సన్నిహితమైన జపాన్ మీదుగా ప్రయాణించి పలు ఒప్పందాలు చేసుకున్నారు. దక్షిణ చైనా సముద్రం ద్వారా స్వేచ్ఛా సముద్రయానం, అరుదైన లోహాలు, ఖనిజాలు, పరస్పర భద్రతల వంటి ప్రస్తావనలు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా స్వేచ్ఛా సముద్రయానం విషయమై చైనా ఒకవైపు, అమెరికాతోపాటు ఇండియా, జపాన్, ఫిలిప్పీన్స్ వంటివి మరొకవైపు ఉన్నాయి.
క్వాడ్ అయితే మరింత విస్తృతమైనది, దీర్ఘకాలిక వ్యూహం కలది. ఇండో పసిఫిక్ అనే పేరిట ఈ సముద్రాలన్నింటా చైనాను కట్టడి చేసే ఉద్దేశంతో అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఇండియాలతో కూడిన వేదిక అది. దానిని సైనిక కూటమిగా మార్చే అమెరికా ప్రయత్నాలతో భారత దేశం విభేదించింది గాని, అదే సమయంలో అందులో భాగస్వామికావటం గమనించ దగ్గది. నిజానికి సునామీ సమయంలో 2007లో ఏర్పడిన క్వాడ్ లక్షాలు వేరు. తర్వాత పదేళ్లకు 2017లో అమెరికా దానిని స్పష్టంగా చైనా వ్యతిరేక సంస్థగా మార్చింది. ఆ విషయం తెలిసినప్పటికీ మోడీ ప్రభుత్వం చైనాతో గల సమస్యల కారణంగా దేశప్రయోజనాల కోసం అందులో కొనసాగింది. ఇంతకూ విషయమేమింటే, అటువంటి పరస్పర సంబంధాలు గల జపాన్ మీదుగా మోడీ చైనాకు ప్రయాణించటం ఒక సంకేతాత్మకం కాగా, ఎస్‌సిఒ సమావేశాలు జరిగిన వెంటనే, బీజింగ్‌లో నిర్వహించిన జపాన్ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనకపోవటం రెండవది అయింది. వాటిలో పాల్గొనవద్దని జపాన్ అన్ని దేశాలకు విజ్ఞప్తి చేసింది.
పోతే, చైనా వ్యతిరేక క్వాడ్ కూటమిలో సభ్యత్వం గల భారతదేశం, ఈ సంవత్సరం చివరిలో ఢిల్లీలో జరగవలసిన ఆ సంస్థ సమావేశాలను యథావిధిగా నిర్వహిస్తున్న తప్ప, తియాన్‌జిన్ దృష్టా మానుకోవటం లేదు. అదే ధోరణిలో బ్రెజిల్ ఆధ్వర్యాన రెండు రోజుల క్రితం జరిగిన బ్రిక్స్ ఆన్‌లైన్ సమావేశాలలో మోడీకి బదులు విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. దీని అర్థం బ్రిక్స్‌కు వ్యతిరేకమని ఎంతమాత్రం కాదు. కాని, దౌత్య వ్యవహారాలలో చిన్నచిన్న వాటికి, సందర్భాన్ని బట్టి చిన్నచిన్న అర్థాలైనా ఉంటాయి. తియాన్ జిన్‌తో అలక వహించిన అమెరికా అధ్యక్షుడిని కాస్త మెత్త బరిచేందుకు ఇదొక చర్య అయినా ఆశ్చర్యపడనక్కర లేదు. మరొక వైపు అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో, వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌లు తియాన్ జిన్ సమావేశాల తర్వాత ఇండియాపై సుంకాలు, వాణిజ్య ఒప్పందపు చర్చల విషయమై ధూర్తంగా, అవమానకరంగా మాట్లాడినా, మామూలుగానైతే ఆగ్రహంగా స్పందించవలసిన భారత అధికారులు ఆ అంశాలపై చర్చలు కొనసాగుతాయని మాత్రమే అనటం గమనించదగ్గది.
ఈ విషయాలన్నీ చెప్పేదేమిటి? అమెరికా వైపు చూసినపుడు భారత ప్రభుత్వం తన ఇంతకాలపు వ్యూహాత్మక సంబంధాన్ని, సంయమనాన్ని, సమతులనాన్ని వదలుకోలేదు. కొన్ని సమస్యలు ఎదురవుతుండటం నిజమే అయినా వాటిని దీర్ఘకాల ప్రయోజనాల కోసం భరిస్తూనే ఉండదలచింది తప్ప వ్యూహాన్ని మౌలికంగా మార్చుకోదలచలేదు. అది తన స్వేచ్ఛాయుత వ్యూహంలో ఇంత వరకు వలెనే ఇకముందు కూడా భాగంగా కొనసాగుతుంది. వాస్తవికంగా మాట్లాడాలంటే అమెరికా, రష్యా, చైనాల స్థాయిలో భారతదేశం అగ్రరాజ్యం కానందున, అవసరాలు రెండు పక్షాలతో ఉంటాయి. గనుక, అదే సరైన వ్యూహమవుతుంది. అందువల్లనే, ట్రంప్ టారిఫ్‌లు, తియాన్‌జిన్ సమావేశాలకు ముందు నాటి విధానాలనే ఇప్పటికీ పాటించగలమని చూపుతున్నారు.
రెండవ వైపున కనిపిస్తున్నదేమిటి? మారుతున్న పరిస్థితుల దృష్టా, తిరిగి దేశ ప్రయోజనాల కోసం బహుళ ధ్రువ ప్రపంచంపట్ల ఇంతవరకు కన్నా ఎక్కువ మొగ్గుచూపటం. అది తియాన్‌జిన్‌లో స్పష్టంగా కనిపించింది. పైన అనుకున్నట్లు, భారత దేశం రష్యా, చైనాలతో పోల్చగల అగ్రరాజ్యం ఇంకా కాలేదు గనుక, బహుళ ధ్రువం వైపు ఆ రెండింటిస్థాయిలో మొగ్గటం ప్రస్తుతానికి సాధ్యం కాదు. బ్రిక్స్‌లో ఎస్‌సిఒలలో చేరిన మరే వర్ధమాన దేశానికి కూడా అది వీలు కానిది. కనుకనే అందరూ సమతులనం పాటిస్తున్నారు. అదే సమయంలో బహుళ ధ్రువం వైపు ఇండియా వలెనే వీరందరి మొగ్గు క్రమంగా పెరుగుతున్నది. ఈ విధమైన పరిణామాల కారణంగానే అమెరికా అధ్యక్షుడు, తన అధికారులలో తియాన్‌జిన్ దరిమిలా గతంలో లేని కొత్త ఆందోళనలు కనిపిస్తున్నాయి. భారతదేశం విషయానికి వస్తే, మొదట చెప్పుకున్నట్లు, తన ప్రయోజనాల ప్రకారం స్వేచ్ఛాయుత విదేశాంగ విధాన వ్యూహం కొనసాగుతున్నది. కాకపోతే, బహుళ ధ్రువం వైపు మరింత మొగ్గుతో. ఆమేకు బ్రిక్స్, ఎస్‌సిఒ వేదికలుగా జరిగిందేమిటనే చర్చ విస్తృతంగా జరిగినందున ఇక్కడ మళ్లీ చెప్పనక్కరలేదు.
ఇపుడు రష్యాను చైనాకు కోల్పోవడమంటూ ట్రంప్ చేసిన చిత్రమైన వ్యాఖ్యను చూద్దాము. అందులో ఆశ్చర్యమేమీ లేదు. అమెరికా అంచనాల ప్రకారం వారికి ప్రపంచంలో ఆర్థికంగా, సైనికంగా, రాజకీయంగా అంతిమమైన సవాలుగా నిలిచేది చైనా మాత్రమే. దానిని నియంత్రించి తమ ఆధిపత్యాన్ని ఏకధ్రువ ప్రపంచాన్ని నిలబెట్టుకోవాలంటే వీలైనన్ని దేశాలను, ముఖ్యంగా చైనా ఇరుగు పొరుగు వాటిని, పసిఫిక్ మహా సముద్రంలోని వాటిని తమ వెంట చేర్చుకోవాలి. అందులో భాగంగా రష్యాను సైతం కొంత ఆలస్యంగానైనా తమవైపు తిప్పుకోవాలన్నది అమెరికన్ నాయకులు, థింక్ ట్యాంక్‌లు తమకు తాము నూరిపోసుకుంటున్న విషయం. ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ రష్యా చూపుతున్న సానుభూతుల వెనుక ఈ దీర్ఘకాలిక ఆలోచనలు ఉన్నాయన్నది ఒక అంచనా. లేనిదే, ట్రంప్ నోటి వెంట ఇటువంటి అనూహ్యమైన మాట రాగల అవకాశంలేదు. కాని అది నెరవేరగల అవకాశం కూడా కనిపించదన్నది వేరే విషయం.
ఈ ధోరణులకు కొనసాగింపు మరొకసారి గత రెండు రోజులలో కన్పించింది. ప్రధాని మోడీ యథా ప్రకారం సంయమన పూర్వకంగా మాట్లాడగా, ట్రంప్ కూడా తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూనే ఉండటం గమనించదగ్గది. ఇండియా తమకు ఇప్పటికీ మిత్రదేశమని, మోడీ తనకు మంచి స్నేహితుడని అమెరికా అధ్యక్షుడు అన్న దానికి స్పందనగా ప్రధానమంత్రి, తమ రెండు దేశాలు సహజ మిత్రులని ప్రకటించారు. ట్రంప్ చేస్తున్న నష్టాలు, తెస్తున్న తీవ్రమైన ఒత్తిడులు కనిపిస్తూనే ఉన్నా, అమెరికాతో పోల్చినపుడు బలహీనమైన దేశం అయినందున మోడీ ఈ విధమైన దౌత్యధోరణిని పాటించక తప్పదు. పైగా రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందపు చర్చలు కొనసాగుతున్నాయి. అవి ఈ సంవత్సరం చివరి వరకు ముగిసేదీ లేనిదీ చెప్పలేము గాని, ముఖ్యంగా వ్యవసాయం, పాడి, మత్స రంగాలను అమెరికా బారినుంచి కాపాడాలన్నది ప్రభుత్వ ప్రయాస. ఈ విధమైన మోడీ మాటలు తియాన్‌జిన్ ధోరణికి భిన్నంగా తోచవచ్చు. కాని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నపుడు అట్లా భావించలేము. బ్రిక్స్, ఎస్‌సిఒలు వేదికలుగా వర్ధమాన దేశాలు ఇప్పటికిపుడు బహుళ ధ్రువ ప్రపంచంలోకి ప్రవేశించబోవటం లేదు. అది క్రమక్రమంగా చేరుకోవలసిన లక్షం. అందుకోసం వర్తమాన వాస్తవాలను విస్మరించలేము.
అదిగాక, రక్షణ, ఆర్థికపరమైన, సైద్ధాంతికమైన ఇతర అవసరాలను బట్టి కూడా అమెరికాతో మైత్రిని కొనసాగించక తప్పదు.
వైరుధ్యాలమయంగా కొనసాగుతున్నది అమెరికా అధ్యక్షుని ధోరణి మాత్రమే. తిరిగి ఈ రెండు రోజులలోనూ ఆయన ఒకవైపు భారతదేశం గురించి, మోడీ గురించి పైన ప్రస్తావించిన మాటలు అంటూనే, మరొక వైపు తన వాణిజ్య సలహాదారు నవారో ద్వారా, ఇతర అధికారుల ద్వారా అసభ్యకరమైన భాషలో హెచ్చరికలు జారీ చేయించటం మానుకోలేదు. భారతదేశం చివరకు చచ్చినట్లు వచ్చి తమతో ఒప్పందం చేసుకోగలదంటూ మాట్లాడారువారు. ఇది ఒకటి కాగా, రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు కొనసాగిస్తున్న ఇండియాపై సుంకాలను 100 శాతానికి పెంచుదామంటూ యూరోపియన్ దేశాలను రెచ్చ గొడుతున్నారు. దీనిని బట్టి గ్రహించవలసిందేమంటే, ఇండియా ఒక వర్ధమాన దేశం గనుక సంయమన ధోరణిని చూపవలసివస్తుండగా, అమెరికా తన అగ్రదేశపు దురహంకారంతో ఇతరులను తాను చెప్పినట్లు చేయించే ఆధిపత్య వైఖరిని ప్రదర్శిస్తున్నదన్నమాట. ఏకధ్రువ ప్రపంచానికి బదులు బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడవలసింది ఇందువల్లనే.
Also Read: విద్య, వైద్యం జాతీయీకరణ జరగాలి
టంకశాల అశోక్