ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్లడం, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం కావడం పట్ల మొత్తం ప్రపంచం ఆసక్తిగా గమనించింది. దీనిని భారత్ దౌత్య విజయంగా చెప్పుకున్నప్పటికీ, ఈ శిఖరాగ్ర సమావేశం మోడీ విదేశాంగ విధానంలో (Indian foreign policy) ఒక ఇబ్బందికరమైన నమూనాను వెల్లడిస్తుంది. ఇది భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాల కంటే అంతర్జాతీయంగా వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకొనే ప్రయత్నంగా పలువురు చూస్తున్నారు. మొదటి నుండి అంతర్జాతీయ ప్రాముఖ్యత కోసం మోడీ పడుతున్న తపన అందరికీ తెలిసిందే. విదేశీ పర్యటనల ద్వారా ఆయన భారత్‌కు ఎటువంటి ప్రయోజనం చేకూరుస్తున్నారో గాని, అందుకోసం వెచ్చిస్తున్న వనరులు అన్ని రికార్డులనూ అధిగమిస్తున్నాయి.
Also Read: కవితపై వేటు
‘విశ్వగురు’ వాక్చాతుర్యంతో భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రాంతీయ పరిస్థితుల విషయంలో రాజీపడే విధంగా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. విదేశాంగ విధాదాన్ని(Indian foreign policy) ఓ ప్రజాసంబంధాల ప్రక్రియ స్థాయికి కుదించి, వ్యూహాత్మక ఎత్తుగడలకు ఆస్కారం లేకుండా చేస్తున్న ధోరణులు కనిపిస్తున్నాయి. చైనా పర్యటనకు కొద్దీ రోజులముందు చైనా ‘వన్ నేషన్ పాలసీ’కు ఆమోదం తెలపడం ద్వారా తైవాన్‌ను ఆ దేశం ఆక్రమించుకొనేందుకు భారత్ ఆమోద ముద్ర వేసినట్లయింది. 1950లలో టిబెట్ ను చైనా ఆక్రమించుకోవడాన్నీ గుర్తించడం ద్వారా నెహ్రూ ప్రభుత్వం ఎటువంటి ఘోరమైన వ్యూహాత్మక తప్పిదం చేసిందో ఇప్పుడు కూడా అటువంటి పొరపాటు వైపు పయనిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం అవుతున్నది.
ప్రధాని పదవి చేబడుతూ ప్రకటించిన ‘పొరుగువారు మొదట’ విధానం పతనం నుండి సుంకాలపై అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తత వరకు, వరుసగా దౌత్యపరమైన పొరపాట్లు భారత్ ప్రయోజనాలకు తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయి. ప్రపంచ నాయకుడిగా తనను తాను ప్రచారం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయతిస్తూ దేశాన్ని మరింత సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ దృశ్యంలో దుర్బలంగా మారుస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.భారతదేశ ప్రపంచ ఆకాంక్షలు, దాని పొరుగు, అంతర్జాతీయ సంబంధాల వాస్తవాలతో ఢీకొంటున్నందున, భారత్ దౌత్యవిధానాలు గతంలో ఎన్నడూ లేనంతటి పరీక్షకు గురవుతున్నాయి. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోడీ ఏ ఇతర దేశంతో కంటే అమెరికాతో సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఎక్కువ దృష్టి సారించారు. తరచుగా ‘నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్’ అంటూ అమెరికా అధ్యక్షుడితో తన సాన్నిహిత్యాన్ని చాటుకునే ప్రయత్నాలు వీలుచిక్కినప్పుడల్లా చేస్తూ వచ్చారు.
అయితే ఆ ప్రయత్నాలు అన్ని ఇప్పుడు వృథాగా కనిపించడమే కాకుండా, ప్రతికూల ఫలితాలను కూడా కలిగిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. కానీ సిమ్లా ఒప్పందం తర్వాత, పాకిస్తాన్‌తో మన ద్వైపాక్షిక విషయాల్లో (Indian foreign policy) మూడవ పక్షం జోక్యం చేసుకోవడానికి అనుమతించరాదనే స్థిరమైన విధానాన్ని భారత్‌లోని ప్రతి ప్రభుత్వం అనుసరిస్తూ వస్తున్నది. అయినప్పటికీ, రెండు దేశాల మధ్య అకస్మాత్తుగా కాల్పుల విరమణ జరిగింది. ఇది దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ట్రంప్ దానికి తాను మధ్యవర్తిత్వం వహించానని గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే మోడీ మౌనంగా ఉండిపోవడంతో మరిన్ని అనుమానాలు చెలరేగాయి.
నేరుగా, సున్నితంగానైనా ఇప్పటివరకు ట్రంప్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని చెప్పలేకపోతున్నారు. కేవలం పాకిస్తాన్ వచ్చి సాగిలపడటం తప్ప మరెవ్వరి ప్రమేయం లేదంటూ పరోక్షంగా చెబుతున్నారు. ఈ విషయమై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి చివరికి ఒక ప్రకటనను విచిత్రంగా హిందీలో చదివారు. ఇంగ్లీషులో ఎందుకు చదవలేదు? బహుశా ట్రంప్ అర్థం చేసుకోరని ఆయన భావించి ఉండవచ్చు. కానీ ప్రతిదీ అనువదిస్తారని, సందేశం వారికి ఎలాగైనా చేరుతుందని తెలియదా? ఆ నిశ్శబ్దం, తప్పుడు అంచనాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. కొన్ని రోజుల క్రితం, అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ రష్యా నుండి భారతదేశం ముడి చమురు దిగుమతులకు సంబంధించి చాలా వివాదాస్పద ప్రకటన చేశారు.
ఆయన రెండు లేదా మూడు క్లిష్టమైన విషయాలను ఎత్తి చూపారు.
మొదటిది, భారతదేశం తన మొత్తం చమురు దిగుమతుల్లో ఒక శాతం కంటే తక్కువ రష్యా నుండి కొనుగోలు చేసినప్పటికీ, ఆ సంఖ్య ఇప్పుడు 40 శాతానికి పెరిగింది. మన విదేశాంగ మంత్రి (Indian foreign policy) భారతదేశం కంటే రష్యా నుండి చైనా ఎక్కువ చమురు కొనుగోలు చేస్తుందని చెప్పడం ద్వారా అందరి దృష్టి మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. చైనా దిగుమతులు కేవలం 13% నుండి 16 శాతానికి పెరిగాయి. అయితే మనది విపరీతంగా పెరిగింది. బెసెంట్ ఇంకా మాట్లాడుతూ, ఈ చవకైన రష్యన్ ముడి చమురును ఒక పారిశ్రామిక సమూహానికి మళ్ళించారని, వారు దానిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి, అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ధరలకు తిరిగి విక్రయించారని, ఓ అంచనా ప్రకారం 16 బిలియన్ డాలర్ల లాభం పొందారని వెల్లడించారు. అంటే, రష్యా నుండి చవకైన ధరలకు పొందిన ముడి చమురు నుండి ప్రయోజనం భారతీయ వినియోగదారులకు ఒక రూపాయి కూడా లభించడం లేదు.
అన్ని లాభాలు ఒకే పారిశ్రామిక సంస్థకు వెళ్ళాయి. అదే సమయంలో, ప్రభుత్వంలోనే (జాతీయ భద్రతా సలహాదారు) అజిత్ దోవల్, ఎస్. జైశంకర్ మధ్య ఘర్షణ గురించి వార్తలు వెలువడుతున్నాయి. జైశంకర్ కుమారుడు ధ్రువ్ వాషింగ్టన్‌లోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఒఆర్‌ఎఫ్)కు నాయకత్వం వహిస్తుండగా, దోవల్ కుమారుడు శౌర్య ఇండియా ఫౌండేషన్‌లో కీలకపాత్ర వహిస్తున్నారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మనోహర్ పారికర్ ఫౌండేషన్‌ను విస్మరించి, ఒఆర్‌ఎస్‌కు జైశంకర్ ప్రభుత్వ నిధులను పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నారు. ప్రతి ఏడాది ఢిల్లీలో అంతర్జాతీయ నాయకులతో ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నారు. అమెరికాలో ఆ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మోడీ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలో పేరొందిన ఒఆర్‌ఎఫ్ కు విదేశాంగ మంత్రి ఓ విధంగా పోషకుడిగా ఉండటం వివాదాలు రేకెత్తిస్తోంది.
మరోవంక, చైనా పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడితో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మంతనాలు జరపడం ద్వారా ట్రంప్ విసురుతున్న సుంకాల సవాళ్లకు సమాధానంగా మోడీ ఘనమైన దౌత్యం ప్రదర్శిస్తున్నారని మన దేశంలో చాలామంది సంబరపడిపోతున్నారు. అయితే, ఉక్రెయిన్ యుద్ధంలో సైనికంగా, ఆర్థికంగా భారీ నష్టాలు ఎదుర్కొంటున్న రష్యా పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలతో ఇప్పుడు చైనా మద్దతుపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఆధారపడి ఉంది. అందుకనే అమెరికాకు వ్యతిరేకంగా భారత్‌ను పుతిన్ ఆదుకునే అవకాశాలు ప్రస్తుతం తక్కువనే గుర్తించాలి.మరోవంక, గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత ప్రస్తుతం భారత్- చైనాల మధ్య సామరస్య వాతావరణం నెలకొంటున్నట్లు కనిపిస్తున్నా తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళలో తెలియని గందరగోళంలో రెండు దేశాలు చిక్కుకున్నట్లు కనిపిస్తున్నారు. గత నెల భారత్‌లో పర్యటించిన చైనా విదేశాంగ మంత్రి సరిహద్దు సమస్యలనుండి తమ సంబంధాలు ముందుకు వెళ్లాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అంటే సరిహద్దులో సమస్యలు పరిష్కరించుకోవడం దాదాపు అసాధ్యంగా గుర్తించినట్లు స్పష్టం అవుతుంది.
భారత్ పాకిస్థాన్, భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల మాదిరిగా భారత్- చైనా సరిహద్దులు మైదాన ప్రాంతాల్లో లేవు. ఏది ఎవ్వరి భూభాగంలో నిర్ధారణకు రావడం రెండు దేశాలకు క్లిష్టమైన అంశమే. మరోవంక సైనికంగా, రాజకీయంగా వ్యూహాత్మక అంశాలను ఇమిడి ఉన్నాయి. రెండు దేశాల ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలు సైతం మిళితమై ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ భూభాగం తమదే అని చైనా వాదిస్తున్నది. రెండు దేశాల మధ్య భూభాగాల గురించి వివాదాలు బ్రిటిష్ పాలనా సమయంలోనే, చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటు కానప్పటి నుండే ఉంటూ వచ్చాయి. వాటి పరిష్కారంకోసం అప్పట్లోనే పలు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏవీ ఫలించలేదు. అయితే ప్రధానిగా రాజీవ్ గాంధీ చైనాలో పర్యటించి చర్చల ద్వారా సరిహద్దుల సమస్యలు పరిష్కరించుకొందామని ఒప్పందం చేసుకొని, అందుకోసం ఓ యంత్రాంగం ఏర్పాటుకు అంగీకరించినప్పటి నుండి సరిహద్దుల్లో రెండు దేశాల సైనికుల మధ్య ఎప్పుడూ కాల్పులు జరగలేదు. కేవలం 2022లో గాల్వాన్ లోయలో ఘర్షణ చోటుచేసుకుంది. అందుకు ప్రధాన కారణం చైనాను సైనికంగా కట్టడి చేయడం కోసం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కలిసి ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమిలో భారత్ చేరడంతో రెచ్చగొట్టే చర్యగా చైనా ఉపక్రమించి ఉండవచ్చనే అభిప్రాయం కలుగుతుంది.
మరోవంక, వాణిజ్య సంబంధాల విషయంలో సైతం అమెరికాతో కంటే భిన్నమైన పరిస్థితి నెలకొంది. అమెరికా భారత్ నుండు అత్యధిక దిగుమతులు చేసుకుంటున్నామని, ఆ మేరకు ఎగుమతులు ఆ దేశానికి చేయలేకపోతున్నామని సుంకాల అస్త్రాలు ప్రయోగిస్తుంటే; చైనా నుండి భారత్ దిగుమతులు ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. కానీ ఆ మేరకు మన ఎగుమతులు పెరగడం లేదు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాలతో సంబంధాలు పెంచుకునేందుకు చేస్తున్న ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదు. దక్షిణ ఆసియాలో చైనా ఆధిపత్య ధోరణులను కట్టడి చేయడంలో భారత్ వైఫల్యమే అందుకు కారణం. అయితే చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని విస్మరించలేము. కానీ, వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా స్పష్టమైన, దీర్ఘకాల వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవలసిన అవసరం గుర్తించాలి. ఏదిఏమైనా మోడీ చైనా పర్యటన భారత విదేశాంగ విధానాన్ని మరింత గందరగోళానికి నెట్టివేసిన్నట్లు స్పష్టం అవుతున్నది.
చలసాని నరేంద్ర
98495 69050