‘రణ’రంగం తప్పదా?
పహల్గామ్‌కు ప్రతీకారేచ్ఛతో భారత్
పాక్‌పై ముప్పేట దాడికి సన్నాహాలు
ప్రధాని మోడీ హెచ్చరికల తర్వాత మారుతున్న పరిణామాలు ‘ఆక్రమణ్’ పేరిట
భారీ విన్యాసాలు శ్రీనగర్‌కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సైనికుల సెలవులు రద్దు
శ్రీనగర్ విమానాశ్రయంలో భారీ ఎత్తున భద్రత జమ్మూ కశ్మీర్‌లో కనీవినీ
ఎరుగని సెక్యూరిటీ ఉగ్రజాడల కోసం అణువణువూ జల్లెడ
శ్రీనగర్/న్యూఢిల్లీ : పహల్గామ్‌లో ఉగ్రవాదుల మారణకాండ తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ దాయాది పాకిస్థాన్‌పై సమరానికి సన్నాహాలు చే స్తోందా..? పొరుగుదేశంలోని ఉగ్రవా ద తండాలతో తాడో పేడో తేల్చేకునేందుకు తయారవుతోందా? భూ, ఆకాశ మార్గాన తలపడేందుకు అంతుబట్టని వ్యూహాన్ని అంతర్గతంగా రచిస్తోందా? ఉన్నట్టుండి గుట్టుచప్పుడు కాకుండా సై నికుల సెలవులు రద్దు చేయడంతో పా టు ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారు తిరిగి హుటాహుటిన రిపోర్ట్ చేయాలని ఆదేశించడం ఆలోచింపజేస్తోంది. ఇలాంటి అంశాలపై ప్రభుత్వంలోని అత్యున్నత వర్గాలు అలికిడి కాకుండా కదన వ్యూ హాన్ని రచిస్తున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు దాన్నే బలపరుస్తున్నాయి. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ ఇకపై చుక్క నీరు కూడా పాక్ భూభాగంలో పారనివ్వబోమని తాజాగా ప్రతినబూనింది.
పాక్ పౌరులపై నిషేధాజ్ఞలు వి ధించి సరిహద్దులు దాటిస్తోంది. జి.20 దేశాల దౌత్యవేత్తలను ప్రత్యేకంగా పిలిపించుకుని పహల్గామ్ ఉదంతాన్ని వివరించడం, ఆయా దేశాల మద్దతు కూడగట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇక బీహార్ వేదికగా ప్రధాని మోడీ ముష్కరు లు, వాళ్లకు వెన్నుదన్నుగా నిలిచేవారికి గట్టి హెచ్చరికలు చేశారు. ప్రధాని వ్యా ఖ్యల తర్వాత నౌకాదళం విన్యాసాలకు తెరలేపడం చర్చనీయాంశమవుతోంది. అవి సర్వసాధారంగా జరిగేవే విన్యాసాలేనని అధికార వర్గాలు పేర్కొంటున్నా చూడడానికి మాత్రం ఒక యుద్ధానికి ముందు జరిగే సన్నద్ధత తరహాలో వా టిని భారీ ఎత్తున నిర్వహిస్తుండడం ప లు అనుమానాలను రేకెత్తిస్తోంది. ‘ఆక్రమణ్’ (ధైర్యం) పేరిట జరుగుతున్న ఈ అభ్యాస కార్యక్రమాల్లో భారత వైమాని క దళం (ఐఎఎఫ్) తన అగ్రశ్రేణి యుద్ధ విమానం రఫేల్‌ను నియోగించడం, ఐఎఎఫ్‌కు చెందిన కొన్ని అత్యుత్తమ ‘ఫైటర్ జెట్లను’ కూడా వినియోగించడం ఈ విన్యాసం తీవ్రతను, పరిమాణాన్ని సూచించింది.
మునుపెన్నడూ లేనిది ఐఎఎఫ్ పైలట్లు పర్వత ప్రాంతం సహా విభిన్న ప్రదేశాల్లో ఎంతో ఉద్ధృతమైన తమ దాడి కార్యకలాపాలను రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ విస్తృత విన్యాసంలో సుఖోయ్30ఎంకెఐ స్కాడ్రన్లు కూడా పాల్గొన్నాయి. తూర్పు ప్రాంతంతో సహా అనేక వైమానిక స్థావరాల నుంచి ఐఎఎఫ్ యుద్ధ విమానాలను తరలించడం దృష్టా ఈ విన్యాసం స్థాయిని అంచనా వేసుకోవచ్చు. ఈ విన్యాసాల్లో సాధారణంగా ప్రగాఢ దాడి మిషన్లకు ఉద్దేశించిన సుదూర లక్షాలపై కచ్చితంగా బాంబులు జారవిడవడం కూడా చోటు చేసుకున్నది. ఈ మొత్తం ప్రక్రియను ఐఎఎఫ్ సీనియర్ నాయకత్వం పర్యవేక్షించింది. ఐఎఎఫ్ దాడి సత్తా 2019లో పుల్వామా ఉగ్ర దాడి తరువాత బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో కానవచ్చింది. ఆ సమయంలో పాకిస్తాన్ భూభాగం లోపల ఉగ్రవాద ప్రయోగ శిబిరాలను మిరాజ్ 2000 జెట్లు నేలమట్టం చేశాయి. ఆనాటి పోరులో ఐఎఎఫ్ మరింత ఆధునిక పాకిస్తానీ ఎఫ్16 జెట్‌ను కూడా కూల్చివేసింది. ఆ దరిమిలా ఐఎఎఫ్ అమ్ములపొదిలో ఐదో తరం యుద్ధ విమానం రఫేల్ చేరింది. అదే సమయంలో నౌకాదళ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ‘ఐఎన్‌ఎస్ సూరత్’ అరేబియా సముద్రంలో మధ్య శ్రేణి భూతలం నుంచి గగనతలంలో లక్షాన్ని ఛేదించగల క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
అరేబియా సముద్రంలో భూతలం నుంచి భూతలానికి క్షిపణి పరీక్ష నిర్వహించనున్నట్లు పాకిస్తాన్ ఒక ప్రకటన జారీ చేసిన నేసథ్యంలో ఆ ప్రయోగం జరగడం విశేషం. దేశంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఈ కార్యక్రమాలు పాకిస్తాన్‌లో భయం సృష్టించాయి. పాక్ తన దళాలను అప్రమత్తం చేసి, సైనిక విమానాలను కేంద్రపాలిత ప్రాంతం జెకె సమీపంలోని వైమానిక స్థావరాలకు తరలించింది. మరోవైపు సైనికుల సెలవులను రక్షణ శాఖ రద్దు చేసింది. సెలవుపై వెళ్లిన వారు తిరిగి వచ్చి రిపోర్టు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శ్రీనగర్ విమానాశ్రయాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా మునుపెన్నడూ లేని రీతిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇదే సమయంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్‌కు చేరుకున్నారు. రక్షణ విభాగంలోని అత్యున్నత స్థాయి అధికారులతో ఆయన కీలక మంతనాలు జరపనున్నారని తెలుస్తోంది. మరోవైపు సరిహద్దులతో పాటు జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రజాడకు సంబంధించిన సమాచారం వస్తే అక్కడ వాలిపోతున్నాయి. శుక్రవారంనాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి.