సనా (యెమెన్) : కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. బుధవారం అమలు కావాల్సిన ఆమె మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో కాస్త ఊరట లభించింది. అయితే మృతుడు తలాల్ అదిబ్ మెహది కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడు సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది స్పష్టం చేశారు. ఆమెకు శిక్షపడాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించబోమని వెల్లడించారు. శిక్ష అమలు వాయిదా అనంతరం అతడు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.
“మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అలాగే మేం ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు. ఈ వాయిదాను మేం ఊహించలేదు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం. మాకు న్యాయం దక్కాల్సిందే” అని అర్థం వచ్చేలా పోస్టులో రాసుకొచ్చారు. అలాగే దోషిని బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా నిమిష మరణశిక్ష వాయిదా పడిన విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంగళవారం ప్రకటించింది. యెమెన్ జైలు అధికారులతోపాటు ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. నిమిష, బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని గత కొన్ని రోజులుగా యెమెన్ ప్రభుత్వాన్ని భారత్ కోరుతోంది.