న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొ లివారం వాయిదాలతో ముగిసింది. సోమవారం నుంచి సెషన్ రెండో వారంలో పహల్గాం, ఆపరేషన్ సిందూర్‌పై తీవ్రస్థాయి వాడివేడి చర్చలు జరుగనుంది. ఈ రెండు అంశాలు దేశ భద్రతకు సం బంధించి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉభయసభల్లో ఈ అంశాలపై సుదీర్ఘ చర్చ కు బిఎసి సమావేశాలలో ప్రభుత్వం అంగీకరించింది. విపక్షం పట్టు నెగ్గింది. భద్రత, విదేశాంగ విధానం అంశాల ప్రస్తావిత ఈ విషయాలపై ఢీ అంటే ఢీ అనే చర్చకు అధికార ఎన్‌డిఎ, ఇప్పటికైతే అంత సంఘటితంగా లేని ఇండియా కూటమి త మతమ వ్యూహాలను ఖరారు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ రెండు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది. ఈ దిశలో రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తోడుగా సమాజ్‌వాది పార్టీ, ఆర్జేడీ ఇతర పార్టీల నేతలతో కలిసి తమ దాడికి సమాయత్తం అవుతున్నారు. మరో వైపు బీహార్‌లో ఓటర్ల జాబి తా సవరణ (సర్)పై నిరసనల ఉధృతి కూడా ప్రతిపక్షం అస్త్రంగా ఉంది. రెండు కీలక విషయాల పై ప్రభుత్వం తరఫున ప్రధానంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,
హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతారని అధికార పక్షం వర్గాల ద్వారా వెల్లడైంది. చర్చల దశలో ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకునే అవకాశం ఉంది. జాతీయ భద్రత విషయాలలో తమ ప్రభుత్వ వైఖరి అత్యంత ధృఢమైన రీతిలోనే ఉం టుందని, ఈ విషయం పలుసార్లు స్పష్టం అయిందనే విషయాన్ని సభకు తెలియచేయనున్నారు. ఇందుకు ప్రధాని సిద్ధం అవుతున్నారు. ఈ కోణం లో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వ ఉక్కుపాదం, పాక్‌లోని ఉగ్ర స్థావరాల ధ్వంసం గురించి తెలియచేయడం ద్వారా ప్రభుత్వం పట్ల ప్రజలలో సానుకూలత సంఘీభావం పాదుకునే స్థాయిలో ఆయన తమ వాదనకు పదును పెట్టుకుంటారని వెల్లడైంది. కాగా, సెషన్ మొదటి వారం ప్రజోపయోగ విషయాల ప్రస్తావన లేకుండా తుడిచి పెట్టుకుపోయిందనే విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ కూడా అంగీకరించారు. సోమవారం లోక్‌సభలో పహల్గాం, ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతుంది. మరుసటిరోజు రాజ్యసభలో చర్చ ఉంటుంది. ఈ మేరకు అంగీకారం కుదిరిందని, ఈ దశలో పలు విషయాలపై స్పష్టత వస్తుందని రిజిజూ తెలిపారు.
సభలలో 16 గంటల చొప్పున సుదీర్ఘ చర్చ జరుగుతుంది. ఇటీవలి కాలంలో ఇది అసాధారణ రీతిలో నిలిచే చర్చగానే మిగులుతుంది. ఆపరేషన్ సిందూర్ విజయవంతం, తరువాతి క్రమంలో దౌత్య ప్రతినిధుల బృందాల విదేశీ పర్యటనల వివరాలు సభల్లో ప్రస్తావనకు వస్తాయి. ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులు , బహుళ పార్టీ ప్రతినిధి బృందాలలోని ఎంపిలు తమ వివరణాత్మక ప్రసంగాలకు దిగుతారు. శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే, జెడియు ఎంపి సంజయ్ ఝా, టిడిపి నుంచి హరీష్ బాలయోగి ఇతరులు మాట్లాడుతారు. ఇక కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ పార్టీ తరఫున ఈ విషయంపై మాట్లాడేందుకు పార్టీ వర్గాలు అనుమతిస్తాయా? అనేది స్పష్టం కాలేదు. ఇటీవలి కాలంలో ఆయన మోడీని మెచ్చుకుంటూ చేస్తున్న ప్రకటనలు కాంగ్రెస్ అగ్రనేతలకు కంటకంగా మారాయి. థరూర్ నాయకత్వపు ప్రతినిధి బృందం అమెరికా ఇతర దేశాలలో పర్యటించింది. ఆపరేషన్ సిందూర్ గురించి తెలియచేసింది. పాక్ ఉగ్రవాద ప్రేరక ధోరణిని ఆయా దేశాలకు వివరించేందుకు దౌత్యం నిర్వహించింది.
పహల్గాం దాడి భద్రతా వైఫల్యం అంతకు మించి ఇంటలిజెన్స్ వర్గాల సమాచార లోపం అనే విషయంపై ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. తరువాతి సైనిక చర్య కూడా సరిగ్గా జరగలేదని, ఈ విషయాన్ని సైనిక ఉన్నతాధికారులు ఇతర నిపుణులు కూడా ధృవీకరించారనే విషయం కూడా చర్చల దశలో ప్రస్తావనకు రానుంది. భారత్ పాక్ మధ్య ఘర్షణల నివారణ ఘనత అంతా తనదే అని ,ఈ దశలో తాను భారత్ పాకిస్థాన్‌లపై ఆంక్షల బెదిరింపులకు దిగానని పదేపదే ట్రంప్ ప్రకటించడంపై కూడా ప్రతిపక్షాలు దాడికి దిగనున్నాయి. ప్రధాని మోడీ సాధికారిక ప్రకటనకు డిమాండ్ చేయనున్నాయి. బీహార్ సర్ అంశంపై కూడా ప్రధాని , హోం మంత్రి ప్రకటన అంతకు ముందు చర్చ జరగాల్సి ఉందని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే పలు అంశాలు ఉంటాయని, ప్రతిదానిపై చర్చ వెంట వెంటనే అసాధ్యం అని , అయితే బీహార్ ఓటర్ల జాబితాపై చర్చ నిబంధనల మేరకు జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజూ స్పష్టం చేశారు.