కంగారూలు కంగాళీ చేష్టకు దిగారు. ఆస్ట్రేలియాలో భారతీయ యువకుడు , విద్యార్థి చరణ్‌ప్రీత్ సింగ్‌పై జాత్యాహంకార దాడి జరిగింది. ఈ ఘటనలో 23 సంవత్సరాల సింగ్‌కు తీవ్రగాయాలయ్యి, ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో గతవారం కారు పార్కింగ్ జగడం దశలో జరిగింది. ఈ ఉదంతాన్ని ది ఆస్ట్రేలియా టుడే పత్రిక ఇప్పుడు వెలువరించింది. కింటోర్ అవెన్యూ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఈ భారతీయుడిపై దాడికి దిగారు. భారతీయుడివా?…… అంటూ పరమ బూతు పదజాలంతో తిట్టారు. శనివారం ఈ యువకుడు తన భార్యతో కలిసి కారులో నగరంలో లైట్ డిస్‌ప్లే చూసేందుకు వెళ్లినప్పుడు స్థానికులు దౌర్జన్యానికి దిగారు. కారు పార్కింగ్ వద్ద ఆగంతకులు ఆయనను బయటకు లాగి , తిట్లకు దిగారు. భారతీయులను కించపర్చే విధంగా మాట్లాడారు. తరువాత కర్రలతో కొట్టడంతో సింగ్ స్పృహ తప్పిపడ్డాడని పత్రిక తమ కథనంలో తెలిపింది.
ఆ వ్యక్తి ఇప్పటికీ ఎమి అర్థం కాని స్థితిలో ఉన్నాడు. తన ఎడమ కంటి చుట్టూ గాయాలు అయ్యాయని, కణజాలం దెబ్బతిందని అతి కష్టం మీద ఆసుపత్రి బెడ్ మిది నుంచి చెప్పాడు. ఆయన దవడలు, ముఖం పూర్తిగా వాచి పొయ్యాయి. ఈ యువకుడి పరిస్థితి గురించి ఎస్‌బిఎస్ పంజాబీ కూడా వార్త వెలువరించింది. ఘటనకు సంబంధించి 20 సంవత్సరాల ఓ యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు పెట్టారు. ఇతర దుండగుల కోసం గాలిస్తున్నామని , సమాచారం అందించాలని స్థానికులను కోరారు. దుండగులను ఎదుర్కొనేందుకు తాను , ప్రతిఘటించేందుకు యత్నించానని సింగ్ చెప్పారు. అయితే వారు ఎక్కువ మంది ఉండటంతో తాను ఏమి చేయలేకపోయినట్లు తెలిపారు. ఆయన ఒంటరిగా అక్కడికి వెళ్లాడా లేక వేరెవరైనా ఉన్నారా? అనే విషయంపై స్పష్టత రాలేదు. విదేశాలలో ఉన్న మా వంటి వారికి ఇటువంటి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు, భారత్‌ను బూతులు తిట్టినప్పుడు ఇంకా ఎందుకు ఇక్కడున్నామనిపిస్తుంది.
వెళ్లిపోవాలనిపిస్తుంది. అయితే ఏమి చేయలేమని, గాయాలు మానుతాయి కానీ మచ్చలను మార్చలేమని నిర్వేదం వ్యక్తం చేశారు. ఇక్కడి కొందరి వైఖరిని వారి అహంకార ధోరణిని ఏమీ చేయలేమన్నారు. అయినా మనం శరీరంలో దేనిని అయినా మార్చుకోవచ్చు కానీ పుట్టకతో వచ్చిన రంగును మార్చివేసుకోలేం కదా. ఈ వర్ణంతో తిరగాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. మనుష్యుల రంగు బట్టి బతకాల్సి వస్తోందన్నాడు. గాయాలనుంచి కోలుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఈ యువకుడిపై దాడి సంబంధిత వీడియోలను గ్లోబల్ మీడియా వెలువరించింది. ఐదుగురు వ్యక్తులు ఆయనపై ఇనుప రాడ్లు, ఇతర పదునైన వస్తువులతో దాడికి దిగినప్పటి దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ముందుగా తిట్లకు దిగారు. ఎవురుతిరిగేందుకు యత్నించిన యువకుడి ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. కడుపులో కుమ్మడంతో సొమ్మసిల్లి పడ్డాడు. పక్కన ఉన్న మహిళ ఈ ఘటనను వీడియో తీస్తూనే వారిని వారించేందుకు యత్నిస్తూ కేకలు పెట్టింది.
ఫలితం లేకుండా పోయింది. కింద పడిపోయి ఉన్న వ్యక్తి ఇక లేవడనుకున్న తరువాతనే గుంపు అక్కడి నుంచి తమ వాహనంలో వెళ్లిపోయింది.సకాలంలో అక్కడికి అత్యవసర చికిత్స వాహనాలు చేరుకుని వెంటనే రాయల్ అడిలైడ్స్ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ జాత్యాహంకార దాడితో అడిలైడ్‌లోని భారతీయ సమాజం తీవ్రంగా స్పందించింది. తమ భద్రతకు వేడుకుంది. విదేశీ విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సింగ్‌కు సంఘీభావంగా భారతీయులు ఆన్‌లైన్‌లో స్పందించారు. దాడిని స్థానిక ప్రధాని పీటర్ మలలినవుకసల్ ఖండించారు. ఇటువంటి దుశ్చర్యలకు ఇక్కడ తావులేదని ప్రకటించారు.