Saturday, July 19, 2025

ట్రంప్ ఆంక్షలు.. అమెరికాలో భారీగా తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

స్లాట్లు తెరవక నానా పాట్లు
ట్రంప్ షాక్‌తో భారతీయ విద్యార్థులకు బ్రేక్
70 శాతానికి పైగా నిలిచిపోయిన సంఖ్య
చతికిలపడ్డ అమెరికా చదువుల కల
కళకళల కన్సల్టెంన్సీల్లో బోసిపోయిన వెలవెల
వాషింగ్టన్ : ట్రంప్ ఆంక్షలు, వీసాల కట్టడి తరువాత అమెరికాకు భారతీయ విద్యార్థుల రాక గణనీయంగా తగ్గింది. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ బ్రేక్ మరింత పడింది. హైదరాబాద్‌కు చెందిన ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు ఇప్పటి ఈ పరిస్థితిని విశ్లేషించారు. ఇంతకు ముందటితో పోలిస్తే ఇప్పుడు అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 70 శాతం వరకూ పడిపోయిందని వివరించారు. వీసా ఫీజులు పెంచడం, వీసా దరఖాస్తుల తిరస్కరణ, ప్రస్తుతం సాగుతోన్న వీసా అపాయింట్మెట్ స్లాట్ల నిలిపివేత వంటి పరిణామాలతో విసిగి వేసారి విద్యార్థులు అమెరికా ఆశలు వదులకుంటున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా లేదా చైనా వంటి దేశాలను తమ విద్యా మజిలీగా ఎంచుకుంటున్నారు. అమెరికా నిరాకరణతో చేసేది లేక విద్యార్థులలో అత్యధికులు ఇండియాలోనే ఉన్నత విద్యకు దిగుతున్నారని కూడా కన్సల్టెంట్లు తెలిపారు. సాధారణంగా అమెరికాలో విద్యా సంవత్సరం ఆరంభం ముందు నుంచే భారీ స్థాయిలో విద్యార్థుల, తల్లిదండ్రుల రాకలతో ఎడ్యుకేషన్ కన్సల్టెంటీ సంస్థలు సందడిగా ఉండేవి. ప్రతిరోజూ స్లాట్స్ గురించి తాము ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌తో పరిశీలిస్తే అవి ముందుకు సాగడం లేదని, స్లాట్స్ లేకుండా విద్యార్థుల వీసాలకు ఇక్కట్లే అని హైదరాబాద్ ఓవర్సీస్ కన్సల్టెంట్ నిర్వాహకులు సంజీవ్ రాయ్ తెలిపారు. ఇప్పుడు తాము స్టూడెంట్స్‌కు ఏమీ చెప్పలేకపోతున్నామని సారీ అన్నారు.

సాధారణంగా ఈ రోజుల్లో ఎక్కువగా ఇంటర్వూలు జరుగుతాయి. ఈ సందడి లేకుండా పోయిందన్నారు. ఇక వీసా స్లాట్స్‌ను క్రమేపీ పునరుద్ధరించడం తరువాత వేగవంతం చేయడం జరుగుతుందని అమెరికా దౌత్య కార్యాలయ వర్గాలు చెపుతున్నాయి. కానీ ఇది జరగడం లేదు. దీనితో అనిశ్చితత సాగుతోంది. స్లాట్స్ బుక్ తరువాత ఇంటర్వూల ప్రక్రియ ముగిసినా చాలా కాలంగా విద్యార్థులకు వీసా మంజూరీ లేదా నిరాకరణ సమాచారం అందడం లేదని విండో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ తరఫున అంకిత్ జైన్ చెప్పారు. బుకింగ్స్ నిర్థారణ లేకుండా స్లాట్స్ వేగవంతం చేస్తామని అమెరికా అధికారులు చెప్పడం వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. అమెరికా కావాలనే తన వ్యవస్థతో విద్యార్థులకు పరీక్ష పెడుతోందని అనుకోవల్సి ఉంటుందన్నారు. అమెరికా వీసా రావడం లేదు. దీనితో తాను జర్మనీని ఎంచుకున్నానని 23 సంవత్సరాల విద్యార్థి ఒకరు హైదరాబాద్‌లో తెలిపారు. సంవత్సరాల తరబడి యుఎస్ వీసా జపం చేస్తే ప్రయోజనం ఏమిటని నిలదీశారు. ఇతర దేశాలు అమెరికాకు చదువు విషయంలో ప్రత్యామ్నాయ వేదికలు కావచ్చునని చెప్పారు.

వేలాది మందికి నిరాశే: అరవింద్ ముండువ
వచ్చే కొద్ది రోజులలో అయినా స్లాట్లు ఆరంభం కాకపోతే ఇక వేలాది మంది కలలు కల్లలు అవుతాయని ఐ 20 ఫివర్ కన్సల్టెంన్సీ సంస్థ అధినేత అరవింద్ మండువ తెలిపారు. ఇప్పుడు తమ సంస్థ విషయానికి వస్తే వీసా విషయాల్లో 80 శాతం వరకూ తగ్గుదల తలెత్తింది. ఇది మరింతగా ఉంటుందని అనుకుంటున్నాం, దీనికి బ్రేక్ పడాల్సి ఉంది. రోజు రోజు విద్యార్థులు, వారి తలిదండ్రుల నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ఏమి చెప్పాలో తెలియడం లేదని, అయితే త్వరలోనే పరిస్థితి కుదుటపడుతుందని భావిస్తున్నామని అరవింద్ తెలిపారు. అమెరికా ఇమిగ్రేషన్ జాతీయ చట్టంలోని నిబంధనలు అనేకం ఇప్పుడు ట్రంప్ హయాంలో మరింత కటుతరం అయ్యాయి. వడబోతలు ఎక్కువ కావడంతో పరిస్థితి విషమించింది. విద్యాభ్యాసం తరువాత తిరిగి స్వదేశం వెళ్లుతామనే పత్రాల్లో ఎటువంటి లోపాలు ఉన్నా, ఇతరత్రా సమాచారం లేకపోయినా తిరస్కరణ జరుగుతోంది. చాలాకాలంగా స్లాట్లు రాకుండా పోతున్నాయి.

అయితే స్లాట్సు బుకింగ్ ఆరంభం అయిందని హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. తరచూ వెబ్‌సైట్ విజిట్ చేయాలని విద్యార్థులకు సలహా ఇచ్చింది. అయితే ఇప్పటికీ మునుపటి స్థితి కొనసాగుతోంది. భారతీయ విద్యార్థుల రాకను అమెరికా అడ్డుకోవాలనుకోవడం లేదని, అయితే వీసా ప్రక్రియ సవ్యంగా ఉండటం , అమెరికా ప్రయోజనాల నేపథ్యంలో కొంత జాప్యం తప్పనిసరి అయిందని కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రతినిధి వివరించారు. అయితే ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే చైనాను అధిగమించి భారత్ నుంచి అమెరికాకు దాదాపు మూడున్నర లక్షల మంది విద్యార్థులు అమెరికా చదువుకు వెళ్లారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నివేదిక మేరకు చూస్తే 2024 జనవరి 1 నాటికి దాదాపు 12 లక్షల మంది వరకూ భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. వీరిలో అత్యధికులు అమెరికాలోనే ఉన్నారని వెల్లడైంది. యూరప్ దేశాలు కూడా విద్యాభ్యాసానికి కేంద్రాలు అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News