Thursday, September 11, 2025

వీసాలపై వెయ్యికళ్ల నిఘా

- Advertisement -
- Advertisement -

అమెరికాలోని భారతీయ విద్యార్థుల కదలికలపై నిఘా పెంచిన సంగతి తెలిసిందే. భారత దేశంనుంచి విద్యార్థులు నిజంగా చదువులకోసం వచ్చారా లేదా చట్ట వ్యతిరేకంగా ఏవైనా ఉద్యోగాలు చేస్తున్నారా? సరైన అధికారిక పత్రాలతో వచ్చారా? వాళ్ల బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై తీవ్రంగా నిఘా కొనసాగుతోంది. అదేవిధంగా ఇప్పుడు తాజాగా హెచ్1బి, ఎఫ్1 వీసాదారుల అనధికారిక సంపాదనపైనా నిఘా పెడుతున్నారు. ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని ఇమిగ్రేషన్ అధికారులకు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అందించడం మొదలైంది.

పన్నులు చెల్లించిన, దాఖలు చేసిన ఆదాయం కంటే అనధికారిక సంపాదనపైనే పరిశీలించడం ప్రారంభమైంది. దీంతో సైడ్ ఇన్‌కమ్‌పై ఆధారపడే అనేక మంది వలసదారులను అమెరికా నుంచి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికాలో ఇప్పుడు వలసదారులకు సైడ్ ఇన్‌కమ్‌ను నేరంగా పరిగణించే పరిస్థితి ఏర్పడింది. రాయబార కార్యాలయాలు, పోర్టుల వద్ద ప్రవేశ సమయంలో హెచ్1బి వీసాదారులను ఈ విషయాలపై ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు. గతంలో విద్యార్థులుగా ఉన్నప్పుడు అనధికారికంగా ఎలాంటి వ్యవహారాలు సాగించారో ఆరా తీస్తున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా వీసాదారుల ప్రవర్తనను పరిశీలిస్తున్నారు. కొన్ని నెలల క్రితం అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు తమ యూనివర్శిటీల క్యాంపస్‌ల బయట పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారన్న అనుమానం ఎక్కువైంది.

అమెరికా యూనివర్శిటీల్లో లక్షమందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరిపై నిఘా కొనసాగుతోంది. అమెరికాలో ఎంఎస్ చేసిన తరువాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకోవడానికి (ఇవి కూడా స్కిల్డ్ మాత్రమే) ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఒపిటి) ఇస్తారు. 202324 గణాంకాల ప్రకారం భారతీయ విద్యార్థులు 97,556 మంది ఒపిటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒపిటి చేసిన తరువాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొంత కాలం అమెరికాలో ఉండవచ్చు. అయితే ఇప్పుడు అలాంటి అవకాశం కనిపించడం లేదు. ఎంఎస్ పూర్తయిన వెంటనే ఉద్యోగం వస్తే సరేసరి. లేకుంటే మూటాముల్లె సర్దుకుని వెంటనే స్వదేశానికి బయలుదేరక తప్పదు. అమెరికా వెళ్లడంకోసం ఒక్కో విద్యార్థి సగటున రూ. 35 లక్షల నుంచి రూ. 49 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. వీరు అమెరికాలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసి అప్పులు తీర్చగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒపిటి ఎత్తివేస్తే తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులు చదువుకోసం కాకుండా వేరే ఉద్యోగాల కోసమో, ఉపాధి కోసమో వచ్చినట్టు తేలితే చిక్కులు తప్పవు. ఇదంతా అమెరికాలోని ఉద్యోగాలు అమెరికా వాళ్లకే (మేడ్ ఎగైన్ గ్రేట్ అమెరికా మాగా) అన్న నినాదం ఊపందుకుంటోంది.

అమెరికాలో మొత్తం జనాభాలో 1.5 శాతం వరకు ప్రవాస భారతీయుల ఉనికి కనిపిస్తోంది. అమెరికాలో పుట్టి పెరిగిన అసలైన అమెరికన్లకు దక్కవలసిన ఉద్యోగాలు, పదవులు ప్రవాసీయులకే దక్కుతున్నాయన్న వివాదం ఎక్కువవుతోంది. ఇదే వీసాదారుల పాలిట శాపంగా తయారవుతోంది. హెచ్1బి వీసాల్లో 70 శాతం భారతీయులే పొందుతున్నారని, వీరంతా భారత్ నుంచి వచ్చే మూడో ప్రపంచ ఆక్రమణదారులన్న ద్వేషం జడలు విప్పుతోంది. హెచ్1బి వీసాదారుల్ని కాంట్రాక్టుగా తీసుకుని పనిచేయించుకోవడంతో ఏటా వారికి 80 వేల డాలర్ల నుంచి 1,20,000 డాలర్ల వరకు చెల్లించవలసి వస్తోందని ట్రంప్ ప్రభుత్వం లెక్కలు తీస్తోంది. ఏటా దాదాపు 10,000 మంది హెచ్1బి వీసాదారులతోపాటు 60,000 నుంచి 70,000 మంది విద్యార్థులు అమెరికాకు వస్తుంటారు. వీరిలో 80% కంటే ఎక్కువ మంది యువతరం ఐటి, ఫైనాన్స్‌లో పనిచేస్తున్నవారే ఉంటున్నారు. అమెరికా ఫస్ట్ అన్న ఆశయానికి ఈ హెచ్1బి ప్రక్రియ దెబ్బతీస్తుందని ట్రంప్ అభిప్రాయం. ట్రంప్ మొదటిసారి పాలనలో వీసాలపై ఉన్న అభిప్రాయాలకు ఇప్పటి వైఖరికి తేడా కనిపిస్తోంది. 2017లో బై అమెరికన్, హైర్ అమెరికన్ అన్న సిద్ధాంతానికి వత్తాసు పలికారు. ఫలితంగా 2015 నుంచి హెచ్1బి వీసాల మంజూరు మందగించింది. వీసా తిరస్కరణలు అత్యధికంగా పెరిగాయి.

మన దేశంనుంచి అమెరికాకు వెళ్లడానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హెచ్1బి వర్క్ పర్మిట్, ఎఫ్1 స్టూడెంట్ వీసా, హెచ్4 డిపెండెంట్ వీసా, హెచ్3 వీసా, 01 వీసా, పి వీసా, ఆర్1 రెలీజియన్ వీసా ఈ విధంగా నాన్ ఇమిగ్రెంట్ వీసాల ద్వారా అమెరికాకు వెళ్తుండటం పరిపాటిగా వస్తోంది. అయితే ఇప్పుడు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇకపై మరో దేశంలో ఇంటర్వూకు హాజరయ్యే అవకాశం లేదని తాజా నిబంధనలు చెబుతున్నాయి. వీరు తమ స్వదేశంలోనే అమెరికా ఎంబసి, కాన్సులేట్‌లో మాత్రమే ఇంటర్వూ అపాయింట్‌మెంట్ కోసం షెడ్యూల్ చేసుకోవాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్ సమయంలో భారత్‌లో వీసా అపాయింట్‌మెంట్ కోసం దాదాపు మూడేళ్ల కాలం ఎదురు చూడవలసి వచ్చేది. దీంతో చాలా మంది భారతీయులు థాయ్‌లాండ్, సింగపూర్, జర్మనీ, బ్రెజిల్ వంటి దేశాలకు వెళ్లి త్వరగా వీసాలు పొందేవారు. ఇప్పటికే భారత్‌లో బీ1, బీ2 వీసాల ఇంటర్వూలకు సుమారు మూడున్నర నెలల సమయం పడుతోంది. కొత్త నిబంధనల వల్ల ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేం. ఇలాంటి కఠినతర ఆంక్షల కారణంగానే హెచ్1బి వీసాదారులు ప్రత్యామ్నాయంగా చైనా, కెనడా వంటి ఇతర దేశాలపై మొగ్గు చూపడం ప్రారంభమైంది.

Also Read: బరువెక్కుతున్న బాలభారతం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News